తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదు.. ‘పర్సంటేజీల పాలన‘. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తి. వేలాది మంది కార్మికులు రక్తం చిందించిన సింగరేణిని రేవంత్‌రెడ్డి సర్కార్ ఒక ’కమీషన్ల అడ్డా’గా మార్చేసింది. సింగరేణిలో జరుగుతున్న దోపిడీని చూస్తుంటే.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాదు, ఒక ‘డైవర్షన్ అండ్ డెమోలిషన్ ఏజెన్సీ‘కి సీఈవోగా పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతున్నది.
సింగరేణి చరిత్రలో, చివరకు కోల్ ఇండియాలో కూడా లేని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్” అనే సరికొత్త దందాను రేవంత్ సర్కార్ 2024లో తెరపైకి తెచ్చింది. ఎందుకు? ఆన్లైన్ టెండర్లు వేసే ధైర్యం ఎవరికీ లేకుండా చేయడానికి! టెండర్ వేసే కాంట్రాక్టర్ సైట్ విజిట్ చేయాలని నిబంధన పెట్టి.. అక్కడికి వచ్చిన వారిని తన ’బంధువుల ముఠా’తో బెదిరించి, భయపెట్టి పంపించేస్తున్నారు. ఆఖరికి ఆ సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరికి? ముఖ్యమంత్రి బావమరిదికి, ఆయన సన్నిహితులకు మాత్రమే! ఇది పారదర్శకత కాదు.. పచ్చి దౌర్జన్యం. బీఆర్ఎస్ హయాంలో పోటీతత్వంతో మైనస్ 7 నుంచి 20 శాతం వరకు కేటాయించిన టెండర్లను రద్దు చేసి.. ఇప్పుడు తన అనుయాయులకు ప్లస్ 7 నుంచి 20 శాతం వరకు కట్టబెడుతున్నారు. అంటే..సంస్థకు రావాల్సిన వేల కోట్ల లాభం.. ఇప్పుడు రేవంత్ అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నది. నైనీ బ్లాక్ విషయంలో వాటాల పంచాయితీలో తేడాలొచ్చి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మరో మంత్రి వీధికెక్కి కొట్టుకోవడం ఈ దౌర్భాగ్య పాలనకు పరాకాష్ట.
డీజిల్ దందా – కమీషన్ల కోసం సంస్థకు కన్నం!
గతంలో ఐవోసీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి నేరుగా డీజిల్ సరఫరా అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీని వెనుక ఉన్నది మరెవరో కాదు.. ముఖ్యమంత్రి సన్నిహితులు. కేవలం తమ కమీషన్ల కోసం సంస్థకు 100 శాతం నష్టం వచ్చే నిర్ణయం తీసుకోవడం అంటే.. సింగరేణిని నిలువునా ముంచడమే! మేడారం జాతర పనుల టెండర్లు, ఎక్సైజ్‌శాఖ హోలోగ్రామ్ కాంట్రాక్టులు, సినిమా టికెట్ రేట్ల జీవోలు.. ఇలా ప్రతి దాంట్లోనూ ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ‘మూటల పంచాయితీ’ నడుస్తున్నది. తన సంతకం లేకుండానే జీవోలు వస్తున్నాయని ఒక మంత్రి.. తన శాఖ నుంచి ప్రాజెక్టులను వేరే శాఖకు మార్చుకున్నారని ఇంకో మంత్రి చెప్తున్నారంటే ఇక్కడ పాలన కన్నా వాటాల పంపకాలే ముఖ్యం అన్నమాట!
పోలీసుల తీరు చూస్తుంటే జాలేస్తున్నది. ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను, అడ్డొస్తున్న ఐఏఎస్ అధికారులను బలిపశువులను చేస్తున్నారు. డీజీపీ.. మీ రూల్ బుక్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? సీఎం సన్నిహితుడు రోహిన్‌రెడ్డి ఒక పారిశ్రామికవేత్తను గన్‌తో బెదిరించి పైసలు వసూలు చేశారని స్వయంగా ఒక మంత్రి కూతురు చెప్తే మీ నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతున్నది? జర్నలిస్టుల మీద చూపించే ప్రతాపం.. ఈ ’దండుపాళ్యం ముఠా’ మీద ఎందుకు చూపించడం లేదు?
రేవంత్‌రెడ్డి.. మీరు విపక్షాలపై కుట్రలు చేసే సమయాన్ని పాలనపై పెడితే బాగుంటుంది. హరీశ్‌రావును నోటీసులతో భయపెట్టాలనుకోవడం.. ఆకాశంపై ఉమ్మి వేయడమే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘పస లేదు’ అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన తర్వాత కూడా మళ్లీ అదే పాత రాగాన్ని అందుకోవడం చూస్తుంటే, ఈ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల ఎంతటి ‘గౌరవం’ ఉన్నదో తెలుస్తున్నది. సృజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణం బయటపడగానే ప్రభుత్వం గజగజ వణికిపోతున్నది. ఆ సెగ నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం అనేది ఒక ‘చీప్ పొలిటికల్ స్టంట్”. తమ స్కామ్‌లు బయటపడ్డ ప్రతిసారీ విపక్ష నేతలకు ఒక నోటీసు పంపడం ఈ ప్రభుత్వానికి రివాజుగా మారింది.
హరీశ్‌రావుపై దాడి చేయడం అంటే, తెలంగాణ ప్రజల ఆశలపై దాడి చేయడమే. అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు ఆడుతుంటే, హరీశ్‌రావు వాస్తవాలతో ముఖం పగల కొడుతున్నారనే అక్కసుతోనే కాంగ్రెస్ పాలకులు ఈ నోటీసుల నాటకం ఆడుతున్నారు. కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక, అభివృద్ధిని గాలికి వదిలేసి, కేవలం విపక్ష నేతలపై విచారణలు, నోటీసులతోనే 25 నెలలుగా కాలక్షేపం చేస్తున్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో విఫలమైన రేవంత్.. హరీశ్‌రావును ఇబ్బంది పెడుతున్నాననిని భ్రమపడుతూ మానసిక ఆనందం పొందుతున్నారు. కానీ మీ నోటీసులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, హరీశ్‌రావు ప్రజల గొంతుకగా గర్జిస్తూనే ఉంటారు.
రాజకీయంగా బీఆర్ఎస్ను, హరీశ్‌రావును ఎదుర్కోలేకనే ‘సిట్’ను అడ్డు పెట్టుకుని దొడ్డిదారిలో యుద్ధం చేస్తున్నారు. చేతగానివాళ్లే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోరాడతారు. ధైర్యం ఉన్నవాళ్లు నైతిక బలంతో ప్రజల్లోకి వస్తారు. నోటీసులతో నోరు నొక్కాలనుకోవడం మీ మీ అక్రమ కేసుల జైలు గోడలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆపలేవు. ‘మీరు ఎన్ని కుట్రలు చేసినా, సింగరేణిని మీరు మింగాలని చూసినా.. ఈ గడ్డపై ప్రజలు మిమ్మల్ని క్షమించరు’. ఆట మొదలైంది.. మీ దోపిడీ పతనమే అంతం!
(వ్యాసకర్త: శాసనమండలిలో బీఆర్ఎస్ విప్)
దేశపతి శ్రీనివాస్