Congress Govt | తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షాలతో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు జలమయ్యాయి. వరదల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. నివాస ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు వంతెన కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం సమీక్షలు, ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నది. ప్రకృతి విపత్తుపై సర్కారు స్పందనలో అనుభవ రాహిత్యమే కాదు, అలసత్వం కూడా కనిపిస్తున్నది. ఇదేదో విపక్షాలు చేస్తున్న విమర్శ కాదు. ప్రకృతి విపత్తు చుట్టుముట్టిన వేళ సర్కారు సకాలంలో ఆదుకోవడం లేదంటూ వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహమే ఇందుకు నిదర్శనం.
ఖమ్మంలో మున్నేరువాగు వంతెనపై వరదనీటిలో చిక్కుకుపోయిన బాధితులు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు ప్రాణభయంతో మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో స్థానికులే చొరవ తీసుకొని జేసీబీ, గజ ఈతగాళ్ల సాయంతో కాపాడారు. ఖమ్మంలోనే మరోచోట రెండో అంతస్థు వరకు నీరు చేరడంతో డాబాపై చిక్కుకుపోయిన వ్యక్తులను కాపాడటంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంటిలోని వారు కాపాడమంటూ పెట్టిన సందేశం ప్రజల మనసు కరిగించింది కానీ ప్రభుత్వాన్ని కదిలించలేకపోయింది. సొంతంగా గజ ఈతగాళ్లను పిలిపించుకుని వారు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు ఉండి ఏమి లాభమని బాధితులు ప్రశ్నిస్తుండటంలో వింతేముంది! వానలతో, వరదలతో జనం అవస్థలు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి రాకుండా ఇంటినుంచే టెలి కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు ఆదేశాలివ్వడంతోనే సరిపెట్టడం అనుభవరాహిత్యం మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యం కూడా.
సమస్యపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని కూడా క్షేత్రస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేయడం వల్ల స్థానికంగా పరిస్థితుల్లో మార్పు రాదు. సర్కారు సాయం అట్టడుగు స్థాయికి చేరుకోవాలంటే పై స్థానాల్లో ఉన్నవారు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడం తప్పనిసరి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందిని సమన్వయపరిచే బాధ్యత సర్కారు పెద్దలదే. అది లోపించడమే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారింది. సీఎం, మంత్రులు ఒకింత ఆలస్యంగా వరద ప్రాంతాల సందర్శనకు వెళ్లినప్పుడు బాధితులు గోబ్యాక్ అంటూ తిరగబడుతున్నారు. మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును స్థానికులు ఘెరావ్ చేయడం ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నది. బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగితే ప్రభుత్వం లాఠీలతోనే సమాధానం చెప్తుండటం మరో వైపరీత్యం.
ఇలాంటి ప్రకృతి సంక్షోభాలు గతంలోనూ వచ్చాయి. వానలు, వరదలు ముంచెత్తినప్పుడు ఇదివరకటి బీఆర్ఎస్ ప్రభుత్వ స్పందనను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గంటలోనే హెలికాప్టర్ పంపి బాధితులను ఆదుకున్న విషయాన్ని విశేషించి ప్రస్తావిస్తున్నారు. ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాలవారిని పోలీసుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలను పకడ్బందీగా చేపట్టడం తెలిసిందే. అదే సమయంలో ఆపత్కాలంలో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్వయ బాధ్యతలను చూసుకునేవారు. కానీ, ఇప్పుడంతా తారుమారైంది. భారీ వర్షాలతో ముప్పు పొంచి ఉన్నట్టు ముందస్తు సమాచారమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సిన వేగాన్ని అందుకోలేకపోయింది. ఇంకా ఉపద్రవం పూర్తిగా తొలగిపోలేదు. మరికొద్దిరోజులు వర్షాలు పడతాయని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చురుకుగా స్పందించి కేంద్ర విపత్తు సహాయక దళాలను, అవసరమైతే రక్షణ దళాలను అప్రమత్తం చేసి ప్రజలను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.