నరేంద్ర మోదీ పరిపాలనా విధానాలు చూశాక.. ఎప్పుడో చదివిన చందమామ కథ ఒకటి గుర్తుకువచ్చింది. ‘24 గంటలు ప్రజల కోసం పనిచేసే మైథిలి మహారాజు సుధాంశుకు ఒక సందేహం వచ్చి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు. మైథిలి రాజ్యంలో సగం లేని, ఆర్థిక పరిపుష్టిలో పావలా వంతులేని ఉత్కళ రాజు వీర విజయుడు. ప్రతిరోజు ఏదో ఒక ప్రారంభోత్సవం చేస్తూ ప్రజల రాజుగా కీర్తించబడుతున్నాడట. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినా మనకు గుర్తింపు రావడం లేదు ఎందుకు?’ అని మంత్రులను అడిగాడట. రాజు ఆవేదన విన్న మంత్రి తిమ్మన్న.. ‘అయ్యా! మీ ఆవేదనలో న్యాయం ఉంది. కానీ అక్కడ జరగుతున్నదంతా ఒక నాటకం, ప్రజలు తమ సొంత డబ్బులతో కట్టుకున్న ధర్మసత్రాన్ని రాజు ఒక్కోరోజు ఒక్కో గదిని ప్రారంభిస్తున్నాడు. ఎవ్వరు ఏ కొత్త పనిచేసినా.. తను ప్రారంభిస్తూ జాతికి అంకితం చేసి తన ఖాతాలో వేసుకుంటున్నాడు’. అంటూ జరుగుతున్నది పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో విస్తుపోవడం సభ వంతయింది.
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు.. సామాన్యులపై పెట్రోల్, డీజిల్ భారాన్ని ఒక్క రూపాయి ఎందుకు తగ్గించలేకపోయారోనన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు.
ఇప్పుడు మోదీ ప్రభుత్వం చేస్తున్న జాతికి అంకితాలు సైతం అచ్చం ఉత్కళ రాజు కార్యక్రమాల వలెనే ఉంటున్నాయి. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వం చేయనన్ని జాతికి అంకితాలు ఈ బీజేపీ ప్రభు త్వం చేసింది. చిరుత పులులను పార్కులో వదిలిపెట్టడం మొదలుకొని, పట్టాలెక్కిన వందేభారత్ రైళ్ల వరకు అవసరం ఉన్నప్పుడల్లా, మీడియాలో మన ఫొటో కనిపించలేదే అని అనిపించినప్పుడల్లా.. జాతికి అంకితాలు చేసి రికార్డులను తిరగరాస్తున్నది. అదే అలవాటు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు అన్వయించింది. ఇప్పటిదాకా స్వతంత్రంగా ఉన్న దర్యాప్తు సంస్థలను తనకు పొసగని వారిపై ఉసిగొల్పేందుకు జాతికి అంకితం చేసింది. అడ్డూ అదుపు, నీతి న్యాయం విడిచి, రాజ్యాంగం కల్పించిన విచక్షణను మరిచి ఇష్టం వచ్చిన రీతిగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నది. ఇంగ్లీషులో Chicanery అనే ఒక పదం ఉన్నది. దానర్థం కుయుక్తులతో మోసగించడం. ప్రత్యర్థులకు అపఖ్యాతి అంటగడితే చాలు. మనం ఓట్లు రాల్చుకోవచ్చనే Chicanery విధానాలకు పాల్పడుతున్నది. ఇదే దూకుడు దేశాభివృద్ధిలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో, పెరుగుతున్న నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలను అదుపుచేయడంలో ఉంటే దేశం హర్షించేది. కానీ దేశంలో అదేం జరగడం లేదు.
బీజేపీ ప్రభుత్వం తాను అధికారంలోకి రావ డం కోసం హామీనిచ్చిన.. 15 లక్షలను పేదోళ్ల ఖాతాల్లో వేయలేదు. డాలర్‌తో రూపాయిని సమం చేయలేదు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేయలేదు. నిత్యవసరాల ధరలను ఆకాశం నుం చి భూమికి దించలేదు. స్కాంలను ఆపలేదు. ఆయన చేసిందల్లా రాజ్యాంగ సంస్థలను ప్రత్యర్థులపై ఉసిగొల్పి భయపెట్టి బతకడం. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి చేరుతున్నాయనగానే ఏదో ఒక సంచలనం లేవదీసి ప్రజల దృష్టి మరల్చడం, ఏ చిన్న నిర్మాణమైనా, ప్రారంభమైనా జాతికి అంకితం చేసి వార్తల్లో నిలవడం. ఇంతకు మించి మోదీ ప్రభుత్వం ఈ దేశానికి చేసిందేమీ లేదు. 2014లో దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేనాటికి అద్భుతంగా ఏం లేకపోయినా.. కొంతలో కొంత ప్రజాస్వామ్యం, సరళీకరణ ఆర్థిక విధానాలు సమ్మిళితమై ఉన్నట్టుగా అనిపించేది. ఎప్పుడైతే మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారో నాటి నుంచి పూర్తిగా పెట్టుబడిదారీ వర్గానికి దన్నుగా నిలిచే నిర్ణయాలకు పెద్దపీట వేస్తున్నారు. తమకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులకు రాజ్యాంగవ్యవస్థల ద్వారా రక్షణ కల్పించడం, ఎదురుతిరిగే వ్యక్తులను, వ్యవస్థలను రాజ్యాంగసంస్థలతో వేటాడి శిక్షించే అనాది ఆదిమానవ సంస్కృతికి తెరతీస్తున్నది.
దేశాన్ని బలోపేతం చేస్తానని అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. తన అనునయ వ్యాపారవేత్తలను మాత్రమే బలోపేతం చేసి సామాన్యులను నిరుపేదలుగా మార్చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే ‘ఒకే పన్ను- ఒకే దేశం’ అంటూ జీఎస్టీని ప్రవేశపెట్టి ప్రజలందరిచేత ప్రత్యక్షంగా, పరోక్షంగా ముక్కుపిండి పన్నులు కట్టించుకుంటూ.. అనుంగు వ్యాపార మిత్ర బృందానికి మాత్రం లక్షల కోట్లు మాఫీలు చేసి తన స్వామిభక్తిని చాటుకున్నది. నల్లధనం పేరుతో డీ మానిటైజేషన్ చేసి నిరుపేదలను ఆగం చేసింది. సామాన్యుల నడ్డివిరిచేలా ప్రతిరోజు వంటగ్యాస్ ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిత్యం వంచిస్తున్నది. అధికారం రాకముందు దేశదేశాల ధరల పట్టికలను సోషల్ మీడియాలో పెట్టి ఊదరగొట్టిన మోదీ సోషల్ మీడియా సైన్యం.. అధికారంలోకి వచ్చాక నిత్యం ధరలను పెంచుతూ పోతున్నది. ఒకవైపు సామాన్యులపై ధరల భారం మోపుతూ.. ఫ్రీబీల పేరిట సంక్షేమానికి మంగళం పాడే చర్యలకు పూనుకుంటూ.. దేశం వెలిగిపోతున్నదని ప్రతిరోజు ఊదరగొడుతుండటం ఆక్షేపణీయం.
భారత్ సూపర్ పవర్ ఎందుకు కాలేదు ? నిత్యం ఓట్లు, సీట్లంటూ పబ్బం గడిపే కుత్సిత రాజకీయాలు, పదవుల కోసం దేశం ఏమైనా పర్లేదనుకునే నాయకుల వైఖరులు దేశాన్ని భ్రష్ఠుపట్టిస్తున్నాయి. నడిపించే నాయకుడి మేధస్సును కొలవాల్సిన దేశంలో.. దేహంలోని ఛాతిని కొలిచే అజ్ఞానవంతమైన రాజకీయ కొలమానాలు కొలువుదీరినప్పుడు దేశ పురోగమనాన్ని ఇంతకుమించి ఆశించగలమా? ఇప్పుడు దేశంలో ఇదే జరుగుతున్నది.
ప్రపంచాన్ని శాసిస్తున్న లిథియం పోటీలో భారత్ పూర్తిగా వెనుకబడటానికి ప్రధాన కారణం బీజేపీ నాయకులే. వాస్తవంగా అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న 1999లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూకశ్మీర్‌లో లిథియం నిల్వలను మ్యాపింగ్ చేసింది. కానీ 23 ఏండ్లు దాటినా.. ఇంకా మనం లెక్కలు చూసుకునే దగ్గరే మిగిలిపోయాం.
21వ శతాబ్దపు తెల్లబంగారంగా పిలుస్తున్న లిథియం ఉత్పత్తిని అప్పుడే ప్రారంభించి ఉంటే ఈ రోజు ఇండియా సూపర్ పవర్‌గా నిలిచేది. కానీ, కేంద్రంలోని పెద్దలకు మతం మంటలు ఎగదోసి పబ్బం గడుపుకొనే ఆలోచనలు తప్పా.. ఏనాడూ సహజ వనరుల పరిశోధన, వినియోగం మీద దృష్టి లేదు. ప్రపంచ లిథియం నిల్వల్లో మనం 3వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రాసెసింగ్‌లో, మ్యానుఫ్యాక్చరింగ్‌లో చివరి స్థానంలో నిలవడం మన దేశ పాలకుల నిర్లక్ష్యం కాక మరేం అందాం? దేశాల ఆర్థ్ధిక ప్రగతి ప్రయాణంలో లిథియం ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని చైనా, అమెరికాలు ముందే గుర్తించి పోటీ పడుతుంటే మనం మాత్రం ఇంకా కనుక్కునే దగ్గర, కొనుక్కునే దగ్గరే మిగిలిపోయాం.
విచిత్రమైన విషయం ఏమంటే.. అన్ని దేశాల కంటే తక్కువ లిథియం నిల్వలు కలిగిన చైనా ఇవ్వాళ ప్రపంచ లిథియం అయాన్ బ్యాటరీల సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటే, చైనా కంటే ఎక్కువ నిల్వలు కలిగిన భారత్ మాత్రం ఇంకా దిగుమతుల దగ్గరే ఆగిపోయింది. ఇంకా లిథియం ముడిపదార్థాల కోసం ఏడాదికి రూ.170 కోట్లు, లిథియం ఆయాన్ బ్యాటరీల దిగుమతుల కోసం రూ.8,800 కోట్లు ఖర్చు చేస్తూనే ఉన్నాం. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమంటే ఇందులో 70 శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇది మన దేశ పాలకుల అజ్ఞానానికి, అచేతన స్థితికి నిదర్శనం కాక మరేం అందాం? ఇదేనా బీజేపీ చెప్తున్న ఆత్మనిర్భర్ భారత్?.
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు.. సామాన్యులపై పెట్రోల్, డీజిల్ భారాన్ని ఒక్క రూపాయి ఎందుకు తగ్గించలేకపోయారోనన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. బడా వ్యాపారులైన రిలయెన్స్, అదానీలు రష్యా ముడిచమురును పెట్రోల్‌గా మార్చి విదేశాలకు డాలర్లకు అమ్ముకొని అతి తక్కువ కాలంలోనే ప్రపంచ కుబేరులుగా మారేందుకు అవకాశం కల్పిస్తున్న పాలకులు ప్రజలకు మాత్రం రూపాయి తగ్గించేందుకు ససేమిరా అంటున్నారు.
Pp
ఇంత అన్యాయంగా, అజ్ఞానంగా, దూరదృష్టిలేకుండా ఉన్న కేంద్రంలోని నాయకులు.. ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించే కార్యాన్ని దినచర్యగా పెట్టుకున్నారు. ఇది దేశానికి ప్రమాదక రం. విజ్ఞులైన ప్రజలు వీరి ఆట క ట్టించాల్సిన అవసరం ఉన్నది. ఏ విజన్, రీజ న్ లేని కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిద్దాం, నిలదీద్దాం.. జాతికి అంకితాలు చేస్తున్న జాతిరత్నాన్ని ఇంటికి సాగనంపుదాం.. ఉజ్వలమైన భారత్‌ను నిర్మించుకుందాం.
శ్రీపాద రమణ