కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా? ఎవరెస్టును చూసి నక్క ఊళ వేస్తే ఎవరెస్టుకు ఏమైనా నష్టమా? ఆకాశంపై ఉమ్మి వేస్తే ఆకాశానికి ఏమైనా అవుతుందా? సూర్యుడిపై కోపగిస్తే సూర్యుడికి ఏమైనా అనర్థం జరుగుతుందా? అలాగే అసూయతో మహోన్నత శిఖరం లాంటి కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగినంత మాత్రాన ఆయన విలువ ఏమైనా తగ్గుతుందా? స్టేచర్ అనేది పదవిలో ఉండదు. పదవిని అలంకరించే వ్యక్తిలోనూ ఉండదు. పదవి మనకు ఎప్పుడూగౌరవ ప్రతిష్ఠలను తీసుకురాదు. ఆ పదవిని చేపట్టే వ్యక్తి చేసే పనులే పదవికి, వ్యక్తికి స్టేచర్‌ను, గౌరవ ప్రతిష్ఠలను తీసుకువస్తాయి. ఆ పదవికి, వ్యక్తికో వ్యక్తిగత స్టేచర్ ఉండి ఉంటే రేవంత్‌కు ఆ స్టేచర్ వ చ్చి ఉండేది. ఇప్పుడు స్టేచర్ గురించి ఆయన కేసీఆర్‌పై ఏడ్వవలసిన పని ఉండేది కాదు.
గుడిమెట్లపై ఉండేదీ రాయే, గర్భగుడిలో ఉం డేదీ రాయే కావొచ్చు కానీ, వేటి మర్యాద వాటికే ఉంటుంది. ఉలి దెబ్బలను ఓర్చుకొని, ఓ రూపం సంతరించుకొని, ప్రాణం పోసుకున్న విగ్రహాన్ని మొక్కుతాం. మెట్లపై ఉం డే రాయిని తొక్కుతాం. కేసీఆర్ చేసిన మహోద్యమాలు ఆయనను దేవుడిగా మార్చాయి. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఒక స్టేచర్‌ను తీసుకువచ్చాయి. ఉద్యమమెరుగనివారు, అభివృద్ధి అంటే తెలియనివారు తమకు ఆ స్టేచర్ లేదని సంస్కారాన్ని మరిచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
పాలనా వైఫల్యాలతో రేవంత్‌రెడ్డి సతమతమవుతున్నారు. ఇంట ప్రజల తిట్లు, బయట అధిష్ఠానం అక్షింతలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన ఎప్పుడూ సహనం కోల్పోతున్నారు. ఢిల్లీకి గులాంగా మారి సలాం కొడుతున్నా అధిష్ఠానం ఆదరించకపోవడంతో ఆయనలో ఫ్రస్ట్రే షన్ తారాస్థాయికి చేరుతున్నది. అందుకే పరుష పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. కేసీఆర్‌తో ఎదురుపడి రణం చేయలేక మరణం గురించి మాట్లాడుతున్నారు. రోజురోజుకూ దిగజారుతూ ముఖ్యమంత్రి పదవికి ఉన్న ప్రతిష్ఠను పలుచన చేస్తున్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ఎప్పుడో చతికిల పడ్డది. కాంగ్రెస్ చేస్తున్న పిచ్చి ప్రేలాపనలను చూసి ప్రజలు ఆయనతోపాటు కాంగ్రెస్‌ను కూడా ఎప్పుడో స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. వెంటిలేటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీ హస్తవాసిని మార్చాలని రేవంత్‌రెడ్డి ఇలా బజారు భాష మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ పార్టీ వెంటిలేటర్‌పై నుంచి మార్చురీకే వెళ్తుంది కానీ, మళ్లీ ఇంటికి రాదు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని మార్చురీ నుంచి కాటికి సాగనంపడం ఖాయం.
ధర్మరాజుకు కుడి, ఎడమ భుజాల వలె తన అనుజులు భీమార్జునులు ఉన్నట్టే.. కేసీఆర్‌కు భీమార్జునుల్లా కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. ఏడాది కాలంగా కేటీఆర్, హరీశ్‌రావు సంధిస్తున్న వాగ్బాణాలనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ సంధించే పాశుపతాస్ర్తాలను తట్టుకోవడం తన వల్ల కాదు కాబట్టే.. శాసనసభ సమావేశాల మొదటిరోజే మళ్లింపు రాజకీయాలకు తెరదీశారు.
ఓ వైపు కేసీఆర్ సభకు రావాలని, తమకు సలహాలివ్వాలని చెప్తూనే.. మరణం అనేది లేకుండా తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా మనీషి కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు. వంద తప్పులు చేసిన తర్వాత శిశుపాలుడిని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వధించాడు. ప్రజలను కష్టాల కడలిలో ముంచడమే కాకుండా తమ అభిమాన నేత కేసీఆర్‌పై రాయలేని భాషలో దుర్భాషలాడుతూ విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక్కో తప్పు శిశుపాలుడి వంద తప్పులతో సమానంగా తూగుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి అన్యాయాన్ని ప్రజలు అంతమొందించకుండా ఉంటారా?
-(వ్యాసకర్త: రాజ్యసభ సభ్యులు)
వద్దిరాజు రవిచంద్ర