ఢిల్లీ: భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) మాజీ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ (66) శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. భారత ఫుట్‌బాల్‌కు ఏకంగా 12 ఏండ్ల పాటు పనిచేసి ఎనలేని సేవలందించిన ఆయన.. అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 2010లో ఏఐఎఫ్ఎఫ్లో చేరిన ఆయన 2022 దాకా సమాఖ్యలో సేవలందించారు.
వృత్తిరీత్యా చార్టర్ట్ అకౌంటెంట్ అయిన కుశాల్.. ఏఐఎఫ్ఎఫ్కు రాకముందు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలు సంస్థల్లో పనిచేశారు. ఆయన హయాంలోనే భారత్.. 2017లో ఫిఫా అండర్-17 యూత్ వరల్డ్ కప్‌నకు ఆతిథ్యమిచ్చింది.
ఆ టోర్నీ చరిత్రలో అత్యధిక మంది చూసిన ఈవెంట్‌గా అది రికార్డులకెక్కింది. దాంతోపాటు 2022లో ఏఎఫ్సీ ఉమెన్స్ ఆసియా కప్, ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు దక్కడంలోనూ ఆయనదే కీలకపాత్ర. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లోనూ ఆయన పాత్ర ఉంది. 2017లో ఆయన హయాంలోనే ఇండియన్ ఉమెన్స్ లీగ్ ప్రారంభమైంది. కుశాల్ మృతికి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే నివాళి అర్పించారు.