తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్రవాహం తమ అస్తిత్వ గొంతుకను వినిపించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని సంఘాలను ఐక్యం చేసే రాజకీయ ప్రక్రియను కేసీఆర్ చేపట్టి, టీఆర్ఎస్ అనే ఉద్యమ రాజకీయ పార్టీని నెలకొల్పారు. 14 ఏండ్ల మహాసంగ్రామం ఏ రీతిగా చెప్పినా తరగనిది. అదొక వొడవని ముచ్చట.
రాష్ట్రం కోసం పోరాడి నిలిచిన కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టారు. పదేండ్లపాటు పాలనా పగ్గాలను అందించారు. కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో తెలంగాణను తీర్చిదిద్దేందుకు చేపట్టిన పునర్నిర్మాణమే అన్ని రంగాల్లో మనం సమున్నతంగా నిలిచేందుకు దోహదపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సాగు, తాగునీటి సమస్యలు తీరాయి. ఎగువ భూములకు నీళ్లందవని 70 ఏండ్లుగా పాలకులు తెలంగాణ భూములను ఎండబెట్టారు. నీళ్ల కోసం తెలంగాణను కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం తెలంగాణకు ప్రాణాధారమైంది. గోదావరి జలాలను ఒడిసిపట్టి ఎగువ భూములకు మళ్లించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఎండిన దుక్కుల గొంతు నింపి కోటి ఎకరాలకు నీళ్లందిం చేందుకు కేసీఆర్ చేసిన కృషే తెలంగాణను దేశానికి ధాన్యాగారం చేసింది. రైతుబంధు పథకం రైతుకు రక్ష కాగా, దళితబంధు పథకం అట్టడుగునున్న దళిత వర్గాల ఆత్మబంధువైంది. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని వెనక్కి గుంజి విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నించిన శక్తుల ఆటలు కట్టించి, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకు న్నాం. అన్ని రంగాల్లో కొత్త రాష్ట్రం శిరసెత్తుకుని నిలిచింది. తెలంగాణను దేశానికే మోడల్‌గా చూపింది కేసీఆర్ దార్శనిక ఆలోచనలు, ఆయన ఆచరణాత్మక కృషి అన్నది మరువరాదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచి పరిపాలనను ఉద్యమ ఉత్తేజంతో నడిపి మహోజ్వల తెలంగాణగా తీర్చిదిద్ది, చీకట్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అన్నది నిజం.
పాలక పార్టీలన్నీ 60 ఏండ్లుగా తెలంగాణ అస్తిత్వాన్ని అణగదొక్కి పాలించాయి. అణచివేతలు, అవమానాలకు, దోపిడీకి గురైన తెలంగాణ సంకెళ్లు తెగి స్వపరిపాలనకు చరిత్రే ఇష్టంగా సంతకం చేసిన రోజు జూన్ 2. తెలంగాణ జలదోపిడీ నుంచి బయటపడి కాళేశ్వరాన్ని నిర్మించుకుంది. గోదావరి జలాలపై కన్నేసిన వాళ్లు అవకాశం చూసి నీళ్లు మళ్లించుకోవాలని చూస్తున్న ఇప్పటి కుట్రలను జూన్ 2 స్ఫూర్తితో ఎదుర్కోవాల్సి ఉంది. పెద్దమనుషుల ఒప్పందాలను ఉల్లంఘన చేసిన పెద్దలే ఇప్పుడు నీతివాక్యాలు వల్లిస్తూ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టారు. గోదావరి గట్ల మీద ‘మా నీళ్లు మాకేనని’ కాపలా కాయాల్సిన పరిస్థితి నేడు నెలకొంది.
కరెంట్ కోతల్లేని తెలంగాణను మళ్ళీ చీకట్లు కమ్ముకునేటట్టు చేస్తున్న పాలకులను నిగ్గదీయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు తమ హక్కుల కోసం మళ్లీ ‘సకలజనుల సమ్మెలు’ కాబోతున్నారు. ఆనాడు 1969 ఉద్యమం ఎగిసిపడితే, ఇప్పుడు స్వరాష్ట్రం సిద్ధించిన పదేండ్లకే తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వం కోసం పెనుగులాడవలసిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, పాలించిన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. స్వరాష్ట్ర సిద్ధించాక దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పాలనలో తిరిగి తెలంగాణ తల్లడిల్లే దశలోకి వెళ్లే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోకపోతే తిరిగి తెలంగాణ ప్రమాదంలో పడే స్థితికి చేరుకుంటుంది. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ తిరిగి తెర్లు కాకుండా చూసుకోవాలని జూన్ 2వ తేదీ బలంగా గుర్తుచేస్తున్నది. ఉద్యమ కాలంలో కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సికింద్రాబాద్‌లో జరిగిన సింహగర్జనలు తిరిగి తెలంగాణ గళ గర్జనలుగా మారే స్థితి వచ్చేస్తున్నది. దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలే దశకు ఎందుకు వచ్చిందో పునరాలోచన చేసుకోవాలి.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన పాలకులు పక్కదారిపడితే ఎదురు తిరిగి ప్రశ్నించాలని ఉద్యమస్ఫూర్తిగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన జూన్ 2వ తేదీ గుర్తుచేస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతుగా ఎదిగిన తెలంగాణ అన్నదాత ఎందుకు ఆత్మహత్యల ఉరితాడై వేలాడుతున్నాడో పౌర సమాజాలు ఆలోచించాలి. చేనేత కార్మికుల చావులు, విశ్వకర్మల ఆత్మహత్యలు మళ్లీ మొదలవుతుండటం బాధాకరమని జూన్ 2వ తేదీ గుర్తుచేస్తున్నది. ఎన్నెన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ కళ్ల నీళ్లు ఎందుకు పెట్టుకుంటున్నదో జూన్ 2 సాక్షిగా పౌరసమాజాలు, ఆలోచనాపరులు ఆలోచించాలి. ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అన్న పాట రాసిన కవే ‘పూసిన పున్నమి వెన్నెలలోన తెలంగాణ వీణ’ అని పచ్చటి దుక్కులపై పొర్లి పరవశంతో రాశారు. ఇప్పుడు ఆ రెండు పాటల మధ్య సందిగ్ధ సంధికాలం ముందుకొచ్చింది. మళ్లీ తెలంగాణ అస్తిత్వం కాపాడుకునేందుకు ధూం ధాంలు ఎగిసిపడే కాలం వచ్చిందని పరోక్షంగా జూన్ 2వ తేదీ హెచ్చరిస్తున్నది. జూన్ 2న స్వప్నం సాకారం చేసుకున్న తెలంగాణకు జూన్ 2 స్ఫూర్తితో ఉద్యమాన్ని పదునుపెట్టుకోవటం తెలుసు. తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం జూన్ 2న ప్రతినబూని ముందుకు సాగుదాం.