కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వం వల్ల ఎలాంటి గుదిబండ మీద పడుతుందోనని ఆందోళన చెందుతుండగానే బొగ్గు గనుల వేలం రూపంలో ప్రమాదం రానే వచ్చింది. ఈ నెల 21న హైదరాబాద్‌లో జరగనున్న వాణిజ్య బొగ్గు గనుల పదో విడత వేలం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. సింగరేణిని కాపాడుతామని గతంలో భరోసా ఇచ్చిన బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా ఈ వేలం ప్రారంభం కానుండటం గమనార్హం. హఠాత్తుగా ముంచుకొచ్చిన ఈ పరిణామంతో సింగరేణిలో మళ్లీ అలజడి మొదలైంది.
Singareni | సింగరేణిలో అలజడులు కొత్త కాదు. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి ఈ 135 ఏండ్లలో హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో సుదీర్ఘ పోరాటాలు జరిగాయి. సింగరేణి కార్మికులు ఆర్థిక పోరాటాలకే పరిమితమవుతారన్న అపోహలను పక్కకుపెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ కార్మికులు ప్రధాన భాగస్వాములయ్యారు. అలాగే సింగరేణిని బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్) పరిధి నుంచి కాపాడుకున్నారు. 1998-1999 ఆర్థిక సంవత్సరం నుంచి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ లాభాలను సాధించుకున్నారు.
లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్న సింగరేణి సంస్థపై వేటు వేయడం సరికాదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 780 మిలియన్ టన్నులకు గానూ 773.64 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. కానీ, సింగరేణి మాత్రం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ టన్నులకు గానూ 70.02 మిలియన్ టన్నులతో రికార్డు సృష్టించింది. లక్ష్యానికి మించి కష్టపడుతున్నా సింగరేణి భవిష్యత్తు గురించి ఆందోళనలు కొనసాగుతూనే ఉండటం బాధాకరం.
బొగ్గు గనుల నిబంధనల ప్రత్యేక చట్టాన్ని 2015లో పార్లమెంటు ఆమోదించింది. దాంతో పాటు ప్రభుత్వ బొగ్గు పరిశ్రమకు రక్షణగా ఉన్న బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం-1973ను 2018 జనవరి 18న కేంద్రం రద్దు చేసింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ 2020 జూన్ 18న కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదికన బొగ్గు గనులను కేటాయించే వేలాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రభుత్వ బొగ్గు పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. గతంలో జరిగిన బొగ్గు గనుల వేలంలో సింగరేణికి చెందిన కోయగూడెం, సత్తుపల్లి-3 గనులు ప్రైవేటుపరం అయ్యాయి. సింగరేణి యాజమాన్యం తెలంగాణలోని గనుల కోసం వేలంలో పాల్గొనకుండా ఒరిస్సాలోని నైనీ గనిని దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో తవ్వకాలు ప్రైవేటుకు అప్పగించారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 997.25 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. అయినప్పటికీ 268.24 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
పారిశ్రామికాభివృద్ధితో పాటు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు ప్రధాన ఇంధనం. మన దేశంలో 2,21,802.59 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 106 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిలో బొగ్గు ఆధారిత కేంద్రాలు 53 ఉన్నాయి. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవలసిన అవసరాన్ని ఇది నొక్కిచెప్తున్నది. కానీ, ప్రభుత్వం అనుసరిస్తున్న 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కమర్షియల్ మైనింగ్ కారణంగా ప్రైవేటు కంపెనీలు కూడా బొగ్గును ఉత్పత్తి చేస్తుండటంతో ప్రభుత్వ పరిశ్రమల మనుగడకు ముప్పు ఏర్పడింది. అంతేకాకుండా, బొగ్గు ధరల స్థిరీకరణ దెబ్బతింటున్నది. దాంతో విద్యుత్తు ఛార్జీలతో పాటు ఇనుము, ఉక్కు, సిమెంట్ ఇతర అనేక రంగాలలో ధరలు పెరుగుతున్నాయి. తద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నది. కార్మికుల వేతనాలు తగ్గి సామాజికాభివృద్ధి కుంటుపడుతున్నది.
2014 నుంచి బొగ్గు పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ మద్దతును ఉపసంహరించుకొన్నాయి. పైగా వివిధ పన్నుల రూపేణ 2022-2023లో కోల్ ఇండియా లిమిటెడ్ రూ.9,876 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. అధికారిక లెక్కల ప్రకారం.. సింగరేణి 2018-2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-2023 వరకు తెలంగాణ ప్రభుత్వానికి రూ.13,381.62 కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి రూ.15,267.14 కోట్లు, ఒడిశా ప్రభుత్వానికి 12.54 కోట్లను చెల్లించింది.
కోల్ ఇండియా 2014-2015లో 494.24 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా.. 2023-2024 నాటికి అది 773.64 మిలియన్ టన్నులకు చేరుకున్నది. అలాగే 52.54 మిలియన్ టన్నుల నుంచి 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి సింగరేణి ఎదిగింది. అయినప్పటికీ ప్రభుత్వం కనీస చేయూతను ఇవ్వడం లేదు. పైగా వేలం ప్రక్రియ ప్రాతిపదికన బొగ్గు గనులను కేటాయిస్తూ ప్రభుత్వ బొగ్గు పరిశ్రమ అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతున్నది.
ఇప్పటికే బొగ్గు తవ్వకాలకు సిద్ధంగా ఉన్న సత్తుపల్లి-3, కోయగూడెం గనులను వేలం కారణంగా సింగరేణి కోల్పోయింది. ఇప్పుడు 10వ విడత వేలంలో శ్రావణపల్లి బ్లాక్-1, 2లను కూడా కోల్పోతామనే ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. మంచిర్యాల జిల్లా మందమర్రికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌లకు రైల్వే రవాణా కూడా అందుబాటులో ఉన్నది. సింగరేణి యాజమాన్యం దాదాపు రూ.55 కోట్లు ఖర్చు చేసి 15.05 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చదరపు కిలోమీటరుకి 10.16 డెన్సిటీతో 129 బోర్లు వేసింది. అక్కడ జీ-6, జీ-10 నాణ్యత కలిగిన 10 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు 1999లోనే అన్వేషణ పూర్తి చేసింది. అందువల్ల సింగరేణికి వేలం ప్రక్రియ ద్వారా కాకుండా నేరుగా గనులను కేటాయించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని ప్రధాని మోదీ గతంలో హామీ ఇచ్చారు. అప్పటి హోం శాఖ సహాయ మంత్రి, ఇప్పటి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు. అందువల్ల తాజాగా జరిగే వేలంలో సింగరేణి బొగ్గు గనులను మినహాయించాలి. అంతేకాకుండా నేరుగా సింగరేణికే కేటాయించాలి. సింగరేణి ఆత్మనిర్భర్‌కు సహకరించాలని కార్మికులు కోరుతున్నారు.
మేరుగు రాజయ్య
94414 40791