పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పత్రికల్లో ఒకేరోజు రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగెడ్డ గ్రామం బీసీకి రిజర్వ్ చేసిన ఒక గ్రామ పంచాయతీ. ఆ గ్రామ సర్పంచ్ పదవిని ఓ మహిళ వేలం పాటలో రూ.73 లక్షలకు కైవసం చేసుకుంది. ఇదొక్క వార్త అయితే మరో ఆసక్తికరమైన వార్త దాదాపు పాతిక మంది మాజీ సర్పంచ్‌లు ‘పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకండి, మేం సర్పంచ్‌లుగా గెలిచి సొంత డబ్బుతో గ్రామంలో అభివృద్ధి పనులు చేసి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక, అప్పులకు వడ్డీలు
చెల్లించలేక నిండా మునిగిపోయాం, మాలాగా మీ జీవితాల్ని సమస్యలమయం చేసుకోకండి.. ఎన్నికల్లో పోటీ చేయకండి’ అని హితవు పలుకుతూ తమ అప్పుల బాధలు చెప్పుకొన్నారు.
వేలం పాటలో రూ.73 లక్షలు పెట్టి కొనుక్కున్న వారి లక్ష్యం ఏమిటో? గ్రామంలోని ఏదైనా సమస్యపై సర్పంచ్‌ను ప్రజలు నిలదీయలేరు, నిలదీసే నైతిక అధికారం వారికి ఉండదు. వాళ్లేం ఓటు వేసి ఎన్నుకున్న సర్పంచ్ కాదు. తన వద్ద ఉన్న డబ్బుతో సర్పంచ్ పదవిని కొనుక్కున్నారు. ఈ ఒక్క గ్రామం అనే కాదు కొన్ని వందల గ్రామాల్లో ఇదే పరిస్థితి.
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలనేవి సాధారణ వార్తలుగా ఉండేవి. రోజు జరిగే మరణాలు కావడంతో రైతుల ఆత్మహత్యలు ఒకటి రెండు మాత్రమే జరిగితే పత్రికల్లో సింగిల్ కాలం వార్తలు అయ్యేవి. ఒకే రోజు ఓ పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే తప్ప మొదటి పేజీ వార్తలయ్యేవి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో పాటు, ప్రాజెక్టుల ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా పొలాలు పచ్చబడ్డాయి. వర్షాలు కూడా సహకరించడంతో పదేండ్లు తెలంగాణ పొలాలు పచ్చబడ్డాయి. వీటన్నింటితో వ్యవసాయ భూములు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించే ఓ మిత్రుడు నారాయణఖేడ్‌లో వెంచర్ చేస్తున్నామని చెప్తే అక్కడ కొనేవాళ్లున్నారా అని ప్రశ్నిస్తే నారాయణఖేడ్ మెయిన్రోడ్లో లక్ష రూపాయలకు గజం అమ్ముడు పోతుందని చెప్పారు. ఒకప్పుడు ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని నారాయణఖేడ్ లాంటి సరిహద్దు ప్రాంతంలోనూ గజం లక్ష అంటే ఆశ్చర్యం వేసింది. తెలంగాణ మొత్తం వ్యవసాయ భూముల ధరలు ఇలానే పెరిగాయి. పెరిగిన ఈ భూముల ధరల నుంచి రాజకీయ నాయకత్వం పుట్టుకొస్తుంది. వ్యవసాయ భూములకు రెక్కలు వచ్చి సంపద పోగుపడటంతో సంఘంలో గుర్తింపు కోసం రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే, ఏదో ఒక రాజకీయ పదవి కావాలి. బీఎండబ్ల్యు కారు, గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు స్టేటస్ సింబల్స్ ఎలానో ఒక రాజకీయ పదవి కూడా ఇప్పుడు అదే విధంగా స్టేటస్ సింబల్.
ఒక గ్రామం అంటే ఒకటో, రెండో కిలో మీటర్ల పరిధిలో ఉంటుంది. గ్రామంలో నాలుగైదు వార్డులు ఉండవచ్చు. వార్డు మెంబర్ అంటే ఓ రెండు వందల మంది ఓటర్లకు ప్రతినిధి. రెండు వందల మందికి ప్రతినిధిగా ఉండే వార్డు మెంబర్ కూడా తన కారుకు ఎరుపు రంగులో వార్డ్ మెంబర్ అని అదేదో గవర్నర్ కారు అన్నట్టుగా రాసుకుంటున్నారు. చట్టం ప్రకారం ఇది తప్పయినా పట్టించుకునేవారు ఉండరు.
ఎంత ధరయినా చెల్లించి వేలం పాటల్లో సర్పంచ్ పదవి దక్కించుకుంటున్న విజేతల వార్తల మధ్య రాజస్థాన్‌కు సంబంధించిన ఒక మహిళ గురించి తెలుసుకోవాలి. చవ్వి రాజావత్ 1977లో జైపూర్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించారు. ఎంబీఏ తర్వాత కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద ఉద్యోగం. సౌకర్యవంతమైన కార్పొరేట్ జీవితం. తాను చిన్నప్పుడు ఎంతో ఆనందంగా గడిపిన సోడా గ్రామంలో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని తెలిసి బాధ కలిగింది. తన జీవితపు వేర్లు గ్రామంలోనే ఉన్నా యి. గ్రామం నీళ్లు లేకుండా ఉంటే ఢిల్లీలో కార్పొరేట్ జీవితం పెద్దగా ఆనందం కలిగించడం లేదని భావించి గ్రామానికి వెళ్లి ఊరును తానెలా మార్చాలనుకుంటున్నదో ఆ ప్రణాళిక గ్రామస్థులకు వివరించి వారి మనసు దోచింది. అందరికీ నీరు, వర్షపు నీటిని ఒడిసిపట్టే వ్యవస్థ, సోలార్ పవర్, రోడ్లు, టాయిలెట్లు అందించింది. గ్రామంలో ఇప్పుడు 90 శాతం టాయిలెట్లున్నాయి. మహిళలు, యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి చూపించింది. 2011 ఐరాస ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ఆమెకు ఇది అంత ఈజీగా సాధ్యం కాలేదు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా చిత్తశుద్ధితో ప్రయత్నించి విజయం సాధించింది.
వేలం పాటల్లో లక్షలు, కోట్లు చెల్లించి పదవులు పొందినవారి నుంచి ఇలాంటి విజయాలు, పనితీరు ఆశించలేం, ఊహించలేం. ఇదొక్క గ్రామస్థాయి పదవుల్లోనే కాదు గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం అన్ని స్థాయిల్లోనూ ఇదే వైఖరి. హైదరాబాద్ శివారు నుంచి మెదక్ జిల్లా ప్రారంభమయ్యే ఓ నియోజకవర్గం ప్రజాప్రతినిధికి మైనింగ్‌తో పాటు ఎన్నో వ్యాపారాలున్నాయి. అతను గెలిచిన పార్టీ నుంచి అధికార పక్షంలో చేరుతాడని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే అతనికి పరిచయం ఉన్న వ్యక్తి చెప్పారు. అతని వ్యాపారాలు సాగాలంటే పార్టీ మారాలి, అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి వస్తాడని ముందే జోస్యం చెప్పాడు. ఆ జోస్యంలో సగం నిజమైంది. అక్కడ సీటు ఆశిస్తున్న మరో నేత ఇప్పటికే పత్రికల్లో ప్రకటనలకే కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇదంతా లాభసాటి వ్యాపారం కొనసాగించుకోవడం, స్టేటస్ సింబల్‌గా రాజకీయాలు తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలని కాదు. ఓట్ చోరీ ఎలానో వేలం పాటలతో కొనుక్కోవడం, ఎన్నికలను ఖరీదైన వ్యాపారంగా మార్చడం కూడా అలాంటిదే. ప్రజలకు సేవ చేయాలనే భావన ఉన్నవారు రాజకీయాల్లో ఉండలేరు. నేరస్థులు, అక్రమ సంపాదనపరులు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. ఇదేదో గ్రామస్థాయికి పరిమితమైన సమస్యగా భావించలేం. ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుచేసి, చెమటోడ్చి ప్రచారం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వండని సీఎంకు సన్నిహితుడైన మీడియా అధిపతి బహిరంగంగానే వెయ్యి కోట్ల ఖర్చు గురించి చెప్తున్నారు.
సీఎం అభ్యర్థి వెయ్యి కోట్లు ఖర్చుచేస్తే పోటీచేసిన ఒక్కో అభ్యర్థి ఎన్ని కోట్లు ఖర్చుచేశారో. సీఎం అభ్యర్థి అంత భారీగా ఖర్చు చేసింది కూడా రియల్ ఎస్టేట్ నడమంత్రపు సిరితోనే. కాంగ్రెస్ సీనియర్లు అందరినీ తొక్కేసి సీఎం పదవిని పొందింది రియల్ ఎస్టేట్ పెట్టుబడితోనే.వీరిని ప్రశ్నించే అవకాశం ప్రజలకు లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం పదవులు కొనుక్కున్న వారికి లేదు. ఒకప్పుడు పవిత్రంగా భావించిన రాజకీయం క్రమంగా సంపన్నుల ఖరీదైన క్రీడగా మారుతున్నది. గోల్ఫ్ ఎలా సంపన్నుల క్రీడనో, అలానే రాజకీయం కూడా నడమంత్రపు సంపన్నుల క్రీడగా మారుతున్నది.
-బుద్దా మురళి