O Panneerselvam : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్ర మాజీ సీఎం, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పనీర్ సెల్వం అధికార డీఎంకేలో చేరారు. శుక్రవారం డీఎంకే కార్యాలయంలో సీఎం స్టాలిన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పనీర్ సెల్వంతోపాటు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ రవీంద్ర నాథ్, ఎమ్మెల్యే అయ్యప్పన్, ఇతర కీలక నేతలు కూడా డీఎంకేలో చేరారు.
మాజీ సీఎం, దివంగత నేత జయలలితకు, ఆమె పార్టీ ఏఐఏడీఎంకేకు పనీర్ సెల్వం అత్యంత విధేయుడిగా ఉండేవారు. ఆమె జైలులో ఉన్న సమయంలో పనీర్ సెల్వం సీఎంగా చేశారు. మొత్తం మూడుసార్లు ఆయన సీఎంగా చేశారు. జయలలిత మరణం అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ సీఎం పళనిస్వామికి, పనీర్ సెల్వంకు మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదే సమయంలో పార్టీలో పనీర్ వర్గం, పళని స్వామి వర్గం అంటూ రెండు గ్రూపులు తయారయ్యాయి. ఈ విబేధాలు కొంతకాలం క్రితం పనీర్ సెల్వంను బహిష్కరించే వరకు వెళ్లింది. బహిష్కరణ అనంతరం పనీర్ తిరిగి ఏఐఏడీఎంకేలోకి చేరాలని భావించినా పళనిస్వామి సానుకూలంగా స్పందించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పనీర్ సెల్వం తన కుమారుడు, తన అనుకూల నేతలతో కలిసి డీఎంకేలో చేరారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పనీర్ సెల్వం డీఎంకే తరఫున తన సొంత నియోజకవర్గమైన బోడి మెట్టు నుంచి పోటీ చేయనున్నారు. పనీర్ చేరికతో దక్షిణ తమిళనాడులో డీఎంకేకు ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అక్కడ తేవార్ల ఆధిపత్యం ఎక్కువ. దీంతో తేవార్లకు చెందిన పనీర్ సెల్వం ఓటు బ్యాంకు కలిసొస్తుందని పార్టీ విశ్వాసం. డీఎంకేలో చేరిన సందర్భంగా పనీర్ మాట్లాడుతూ పళనిస్వామి వైఖరితో ఏఐఏడీఎంకే రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నారు. అతడి అహంకారం, అధికార దుర్వినియోగం కారణంగా పార్టీ ఎన్నికల్లో గెలిచే పరిస్తితి లేదని పనీర్ అన్నారు.