బీసీలు సంఘటితమై రాజ్యాంగబద్ధ్దమైన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైనది. బీసీల ఉద్యమం మహత్తర సామాజిక దేశీయ ఉద్యమం. ఇది ఉత్పత్తి కులాల ఉద్యమం. వృత్తి కులాల సమాహారం అంటే దేశం సమగ్ర రూపం. రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం మహత్తర దేశీయ ఉద్యమం, దేశభక్తీయుత ఉద్యమం. అనాదిగా పలు రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి. కాంగ్రెస్కు ఈ విషయంలో వందేండ్లు మోసం చేసిన అనుభవం ఉన్నది. బీజేపీ పాలనలో బీసీలను మోసపుచ్చుతూనే ఉన్నది.
బీసీలను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్న విషయమై స్వాతంత్య్రం రాకపూర్వమే మహాత్మా జ్యోతిబాఫూలే హంటర్ కమిషన్ను అడిగారు. దేశంలోని శూద్రులు, అతి శూద్రులకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాలని నివేదిక ఇచ్చారు. ఫూలే ఇదే విషయాన్ని స్పష్టంగా గులాంగిరి దగ్గర నుంచి తన అన్ని రచనల్లోనూ చెప్పారు. ఫూలే వేసిన ఆ ప్రశ్నే ఇప్పటికీ దేశంలో శేషప్రశ్నగానే మిగిలి ఉన్నది.
రాజ్యాంగ రచన సభలోనే అంబేద్కర్ బీసీల రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారు. అగ్రవర్ణ భావజాలంతో పలువురు ఆనాడు దానిని అడ్డుకొన్నారు. 1931 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు కానీ బీసీలకు మాత్రం ఇవ్వలేదు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల జీవనవిధానాలను అధ్యయనం చేయడం కోసం కమిషన్ను నియమించాలని ఆయన కోరారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళల ఆస్తి హక్కు, సమానహక్కుల వాటా కోసం పోరాడారు. ఈ రెండింటిపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు.
తెలంగాణ నేల నుంచి బీసీ సామాజిక ఉద్యమం ప్రస్తుతం పదునెక్కుతున్నది. తెలంగాణ తన కాలాన్నంతా వర్గ పోరాటాలకే ఇచ్చేసింది. కీలకమైన వర్ణపోరాటాన్ని విస్మరించింది. ఇపుడు జరుగాల్సింది వర్గపోరాటం కాదు, వర్ణపోరాటమని గుర్తించాలి. బీసీల రాజకీయ సంకల్పానికి సాహిత్య, సాంస్కృతిక రంగం భావజాల ఆయుధాన్ని అందించాలి. బీసీల్లో ఎదిగొచ్చిన రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, కళాకారులు, వత్తినైపుణ్య యోధులంతా కలిసి బీసీల దేశీయ ఉద్యమాన్ని తల్లిరుణం తీర్చుకొనే బాధ్యతగా కదలి రావలసి ఉన్నది.
బీసీలు, ఎంబీసీలు, సంచార, అర్ధసంచార, విముక్తి జాతులు, అనాథలనంతా ఒక్కతాటిపైకి తెచ్చి ఒక్కమాటపై నిలిపే దేశీయ బీసీ ఉద్యమం నిర్మాణయుతంగా నిర్మించవలసిన తరుణమిది. సాయుధ విప్లవ వర్గపోరాటాన్ని విరమించిన తర్వాత ఇక ఇపుడు జరుగాల్సింది
వర్ణపోరాటమని ఇకనైనా గుర్తిస్తే మంచిది. ఇది వర్గాలతో నిర్మితమైన దేశం కాదు. వర్ణవ్యవస్థ,వృత్తికులాలతో నిర్మితమైన దేశం.
2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజక వర్గాల పునర్విభజన బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం ప్రవేశపెట్టే అవకాశమున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన తెలంగాణలో 26 ఎంపీ స్థానాలు,179 వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశమున్నది. పునర్విభజన బిల్లు ద్వారా చట్టబద్ధంగా బీసీలకు సగానికి పైగా స్థానాలు దక్కాలి. బీసీలకు మొత్తంగా స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్లు లేవు. ఆ పని జరుగకుండా పునర్విభజన బిల్లు పెడితే ఆ వర్గాలకు మరింత నష్టం జరుగుతుంది.
కులగణన జరిగి ఉంటే బీసీలకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటులో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. బీసీలకు స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. ఇది జరుగాలంటే రాజ్యాంగ సవరణ జరుగాలి.
తమిళనాట డీఎంకేలాగా దక్షిణాది తెలంగాణ నుంచి ఈ ఉద్యమానికి గంట కట్టి నడిపించే నాయకత్వం అవసరం ఉన్నది. నారీ వందన్ అభియాన్ 2023 బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చబోతున్న సమయంలో మహిళల వాటాలో బీసీ మహిళల ప్రాతినిధ్యం లేకుంటే తీరని అన్యాయం అవుతుంది. బీసీ వర్గాలకు చట్టబద్ధ్దమైన రిజర్వేషన్లు లేనందున నియోజకవర్గాల పునర్విభజన ఈ వర్గాలకు మరింత నష్టం చేకూరుస్తుంది. తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది ఉండగా అందులో బీసీల ప్రాతినిధ్యం సరిగా లేదని ఆ వర్గాలు మదనపడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో మంత్రి పదవుల సంఖ్య 27కు పెరిగితే అందులో చట్టబద్ధ్దమైన స్థానాలు లేకుండా బీసీలకు సమ వాటా వస్తుందనుకోవటం భ్రమే. స్వాతంత్య్రం నాటినుంచి నేటివరకు మన అసెంబ్లీలో బీసీలు ఎప్పుడూ 20% మించి లేరు. ప్రస్తుతం 119 ఎమ్మెల్యే స్థానాల్లో 19 మందే బీసీలు ఉన్నారు. ప్రస్తుతం బీసీలంతా సంఘటితమై ఒక్కతాటిపైకి వచ్చి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకునే దిశగా దీర్ఘకాలిక ఉద్యమం కొనసాగించక తప్పదు.
దేశంలో నియోజవర్గాల పునర్విభజన ద్వారా పార్లమెంటులో, రాష్ర్టాల్లో సీట్లు భారీగా పెరుగుతాయి. కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వలన వారు గతం కంటే ఘోరంగా నష్టపోతారు. పార్లమెంటులో స్థానాలు 816కి పెరుగుతాయి. కానీ బీసీలకు ఏ విధంగానూ ప్రయోజనం ఉండదు. పెరియార్ స్ఫూర్తితో ఉద్యమించే మహోద్యమం వచ్చినప్పుడే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లభిస్తాయి.
-జూలూరు గౌరీశంకర్