– విద్యార్థి సంఘాల డిమాండ్
దేవరకొండ, ఆగస్టు 18 : దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్న భాస్కర్ బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్వీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాలలో విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు. ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, ఏబీవీపీ నాయకుడు గోపీచంద్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు బుడిగ వెంకటేశ్, ముదిగొండ హరిదాస్ పాల్గొన్నారు.