తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 చివరిలో జరిగినప్పటి నుంచి ఈ కాలమంతా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పరిపాలనను గమనిస్తుండటం, తనను తాను సమీక్షించుకోవటంగా సాగింది. ఈ రెండూ ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సమీక్షలన్నవి ఎన్నికల తర్వాత ఏడాదిన్నరకు 2025 ఏప్రిల్‌లో హనుమకొండలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ నుంచి మొదలై, ఇటీవలి వరకు పార్టీ శ్రేణులతో పలు విడతలుగా సాగాయి. వీటన్నింటి సారాంశాన్ని తీసుకుంటూ ఇప్పుడు పార్టీ సభ్యత్వ నమోదుతో ఆరంభించి భవిష్యత్తు వైపు ముందడుగులు పడనున్నాయి.
‘తెలంగాణ ఆత్మగల్ల యోధులను తయారు చేసుకోవాలె. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత కావాలి. తెలంగాణకు రక్షణ కవచంగా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలె. రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్‌గా తీర్చిదిద్దాలి. తెలంగాణకు కించిత్ అవమానం జరిగినా తట్టుకోలేని కమిటెడ్ క్యాడర్ అవసరం. మనమే వారిని ఎంపిక చేసుకొని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుకోవాలె. వారికి నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఉండాలి. ఇకముందు ఎన్నికల్లో పోటీకి ముఖాలు చూసి టికెట్లు ఇవ్వటం ఉండదు. పరిస్థితి గతంవలె ఉండదు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే వారికే అవకాశం. -ఇది కేసీఆర్ ముందే చేస్తున్న హెచ్చరిక.
బీఆర్ఎస్ ముందడుగులు ఎట్లా ఉండనున్నాయో పార్టీ అధినేత మాటల్లో చేస్తున్న సూచనలలో రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. అందుకు నిర్వచనాలు చెప్పినట్టయితే అర్థమయ్యేది ఎంతైనా ఉంటుంది. వాటిలో గతంలో జరిగిన కొన్ని పొరపాట్లపై సమీక్షతో మునుముందు వాటిని సరిదిద్దుకునే దృష్టి కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో పార్టీని పటిష్టంగా నిర్మించేందుకు ఇది ఒక తప్పనిసరి అవసరం. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపి ప్రజలకు మద్దతుగా నిలుస్తున్న పనికి ఇది అదనం కానున్నది.
దీనికి సంబంధించి కొన్ని వివరాలను చూద్దాము. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిగా పార్టీ అవసరమన్నది కేసీఆర్ మొదటనే గుర్తించిన విషయం. కానీ ఎందువల్లనైతేనేమి ఆ కార్యక్రమం ముందుకు సాగలేదు. వారధి అనే మాటకు చాలా అర్థం ఉన్నది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వం, లేదా అధికార పక్షం కార్యక్రమాలను, ఆలోచనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోగలది పార్టీ యంత్రాంగం. అదే విధంగా ప్రజల అనుభవాలను, అభిప్రాయాలను, సూచనలను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలది కూడా ఆ యంత్రాంగమే. ఈ విధంగా పార్టీ అనేది రెండు వైపులా ప్రయాణించే హైవే అన్నమాట. ఈ పని మరే వ్యవస్థా చేయలేదు. ఇది మొక్కలలో జైలమ్-ఫ్లోయెమ్ నిర్మాణం వంటిదన్నమాట. వారధి అంటూ కేసీఆర్ మాట్లాడినప్పుడు తన ఉద్దేశం అదేనని భావించాలి.
ఈ అవసరం కేవలం పార్టీ నాయకుల ద్వారా తీరేది ఎంత మాత్రం కాదు. నాయక శ్రేణులలోని వారికి పనులు అనేకం ఉంటాయి. గమనించవలసిందేమంటే, జైలమ్-ఫ్లోయెమ్ వ్యవస్థలో దొర్లే లోటుపాట్లను, మంచి చెడులను క్షేత్రస్థాయి నుంచి అగ్ర నాయకత్వ స్థాయికి అక్కడి నుంచి తిరిగి ప్రజలకు ఎప్పటికప్పుడు తీసుకుపోయేందుకు ఉపయోగపడేది పార్టీ యంత్రాంగం మాత్రమే. అసలైన ప్రజాస్వామ్య సూత్రాలు నిక్షిప్తమై ఉండేది కూడా ఇందులోనే. ఇందులో మరొక రహస్యం ఉన్నది. ఈ విధమైన పార్టీ వారధి ఎంత క్రియాశీలంగా ఉంటే, నాయకశ్రేణులు కూడా పార్టీ సిద్ధాంతాలకు, ప్రభుత్వ లక్ష్యాలకు అంత కట్టుబడి పని చేస్తారు.
ఒక పార్టీకి యుద్ధకాల విధులు, శాంతి కాలపు విధులు అని రెండుంటాయి. యుద్ధ కాలమంటే ఎన్నికలు, అప్పుడప్పుడు తలెత్తే అసాధారణ పరిస్థితులు. తక్కినదంతా శాంతి కాలం. ఒక పార్టీకి రెండు విధాలైన పరిస్థితులూ ఉంటాయి గనుక, రెండు విధాలైన విధులనూ పార్టీ నిర్వర్తించాలి. అప్పుడే పార్టీ గాని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం గాని సంతృప్తికరంగా పని చేసి బలపడతాయి. వాస్తవంగా అట్లా జరగకపోవటం ఒక
పెద్ద బలహీనతగా మారుతున్నది.
ప్రస్తుతం సంవత్సరం పొడవునా, సర్వకాల సర్వావస్థలలో యుద్ధకాలం తరహా కార్యక్రమాలు మాత్రమే మనం చూస్తున్నాము. పరిస్థితి బట్టి యుద్ధాలు చేసినా అందుకు సమాంతరంగా శాంతి విధులు నిర్వర్తించే విభాగాలు ఉండాలి. అవి లేవు కనుకనే పార్టీలు పునాదుల స్థాయిలో, అనగా ప్రజల మధ్య క్షేత్రస్థాయిలో బలపడటం లేదు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. కేసీఆర్ పాలనలో ఒక రాష్ట్రంగా తెలంగాణకు, మరొక స్థాయిలో వివిధ ప్రజావర్గాలకు ఉపయోగపడేవి అనేకం జరిగాయన్నది వాస్తవం. ఈ మాటలను ఆయన విమర్శకులు కూడా బహిరంగంగా కాదు గాని జనాంతికంగా అంగీకరిస్తారు. విశేషమేమంటే తమ వల్ల జరిగిన మంచిని ప్రజలకు తామే సరిగా చెప్పలేకపోయామన్నది స్వయంగా కేసీఆర్ అంగీకరించిన మాట. దానితో ప్రతిపక్షాలు, కొందరు విమర్శకులు చేసిన అసత్య ప్రచారాలు చెల్లుబడి అయ్యాయి. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన. అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు వంటి పథకాలు. ఒకేసారి పూర్తి నిధులు ఉండవు గనుక ప్రభుత్వ బడ్జెట్‌ను బట్టి ఏటా క్రమంగా వాటిని అందరికీ తప్పక చేర్చుతామని కేసీఆర్ భరోసా ఇచ్చిన మాట నిజం. కానీ ఆ మాట క్షేత్రస్థాయిలో సామాన్యులకు చేరేది ఏ విధంగా? ఆ పనిని నాయక శ్రేణులు గాని, దిగువ శ్రేణులు గాని చేయలేదు, లేక చేయలేకపోయాయన్నది వాస్తవం. వారధి అనేది ప్రస్తావనకు వచ్చేది ఇక్కడనే. వాస్తవానికి ఇది సందర్భం కాదు గనుక చర్చించలేము గాని, అప్పటి టీఆర్ఎస్ అనే గాక మొత్తం తెలంగాణ ఉద్యమానికే ప్రచార విభాగమన్నది ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు లేని లోటు మొదటి నుంచీ ఉన్నది. అందువల్ల కలిగిన నష్టాలు ఉన్నాయి. అవేమిటనే వివరాల్లోకి ఇక్కడ పోవటం లేదు. ఇప్పుడు సమీక్షల తర్వాత ఆ లోటు వారధి నిర్మాణంతోపాటు ఇతరత్రానూ తీరగలదని భావించాలి.
ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాటలు, చేతలను చూద్దాము. గత ఎన్నికల తర్వాత హనుమకొండలో జరిగిన రజతోత్సవ సభలో ఆయన, పార్టీ సభ్యత్వం, కమిటీల నియామకం, శిక్షణల విషయం ప్రకటించారు. అందుకు కొనసాగింపుగా ఈ ఏప్రిల్ 27న పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందుకు శ్రీకారం చుటుతూ ఆయన అన్న మాటలను గమనించండి. అందుకు నిర్వచనాలు చెప్పుకొనే ముందు తన మాటలను యథాతథంగా చూడటం అవసరం. అవి ఈ విధంగా ఉన్నాయి: తెలంగాణ ఆత్మగల్ల యోధులను తయారు చేసుకోవాలె. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత కావాలి. తెలంగాణకు రక్షణ కవచంగా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలె. రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్‌గా తీర్చిదిద్దాలి. తెలంగాణకు కించిత్ అవమానం జరిగినా తట్టుకోలేని కమిటెడ్ క్యాడర్ అవసరం. మనమే వారిని ఎంపిక చేసుకొని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుకోవాలె. వారికి నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఉండాలి.
ఇకముందు ఎన్నికల్లో పోటీకి ముఖాలు చూసి టికెట్లు ఇవ్వటం ఉండదు. పరిస్థితి గతంవలె ఉండదు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే వారికే అవకాశం. ఇది ముందే చేస్తున్న హెచ్చరిక.గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారనుకుంటే ఫలితం రాదు. రాశి కన్నా వాసి ముఖ్యం. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, గుండెలో తడి ఉన్న తెలంగాణ బిడ్డలే లోక్‌సభలో ఉండి ఉంటే.. (తేజస్వి సూర్య వాఖ్యలను ప్రస్తావిస్తూ) . ఇంటర్ మొదలు యూనివర్సిటీల వరకు అన్ని సంస్థల్లో మన విద్యార్థి విభాగాలు ఉండాలి. యువజన, కార్మిక, మహిళా, రైతు సంఘాలు ఏర్పడాలి. పార్టీ కార్యక్రమాలకు సమాజంలోనూ విస్తృత ప్రచారం జరగాలి. సోషల్ మీడియా అవసరమే గాని అందుకు పరిమితం కావొద్దు, అని కేసీఆర్ అన్నారు. ఇది జరిగిన రెండు వారాలకు, సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేసిన తర్వాత, ఈ మే నెల 12న నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో, సభ్యత్వం ఏ పద్ధతిలో సాగాలో నిర్దిష్టమైన సూచనలు చేశారు.
తిరిగి ఏప్రిల్ 27 నాటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వెళదాము. ఆ కార్యక్రమంలో కేసీఆర్ చెప్పిన మాటలను యథాతథంగా గమనించిన మీదట, అందుకు వేరే భాష్యాలు చెప్పవలసిన అవసరం లేదు కూడా. గత కొన్ని మాసాలుగా నాయకులు, కార్యకర్తలతో జరిపిన సమీక్షలు, ఇతరత్రా తనకు వేర్వేరు విధాలుగా అందుతూ వస్తున్న క్షేత్రస్థాయి సమాచారాలు, వాటన్నింటిని మదింపు చేసిన మీదట ఆయనకు కలిగిన స్పష్టతలు అన్నీ తన మాటల్లో ప్రతిఫలించాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనలు కూడా దానిని బట్టి అర్థం చేసుకోవటం కష్టం కాకూడదు.
గమనించదగిన మరొక విశేషం ఏమంటే, అవగాహనలు, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయని పేరుబడిన కేసీఆర్, ఈ సారి అంతే సూటిగా హెచ్చరికలు కూడా ప్రకటించారు. రాగల రోజుల్లో అంతే ఖచ్చితంగా ఉంటాననే సూచనలను కూడా ఆయన పంపిన పక్షంలో బీఆర్ఎస్ మహా బలోపేతం కాగలదు. అది పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి, ప్రజలకు, మౌలిక అస్తిత్వానికి మేలు చేస్తుంది.
-టంకశాల అశోక్