న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలు, ఆందోళనల మధ్యే ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు లోక్‌సభ బుధవారం సిఫారసు చేసింది. ఎలాంటి చర్చ లేకుండానే గనులు, ఖనిజాల అభివృద్ధి బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్షాలు తమ నిరసనలతో హోరెత్తించాయి.
మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఈ బిల్లును తెచ్చారంటూ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులో మైనారిటీ వ్యతిరేక నిబంధన ఒక్కటైనా చూపాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సవాల్ విసిరారు. కొద్దిసేపు వాయిదా అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సభ మళ్లీ సమావేశమై ‘గనులు, ఖనిజాల బిల్లు’ను ఆమోదించింది. ఇంతలో జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనల అంశాన్ని ట్రెజరీ బెంచ్ లేవనెత్తడంతో స్పీకర్ సభను గురువారం 11 గంటలకు వాయిదా వేశారు.
విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై చర్చ కోసం లోక్‌సభ స్పీకర్‌కు అధికారిక లేఖ సమర్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఒకవేళ ఈ రోజు చర్చ మొదలైతే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తాను ఈ చర్చా కార్యక్రమం మొత్తానికి హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలకు సుదీర్ఘ అంతరాయాలు కలిగిన అనంతరం, వర్షాకాల సమావేశాలు ముగియడానికి సరగ్గి ఒక రోజు ముందు హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హోం మంత్రి అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్లో అమిత్ షా ఇచ్చే ఉపన్యాసాన్ని వినడానికి ప్రతిపక్షానికి ఆసక్తి లేదన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలని దేశంలోని యువత కోరుకుంటున్నదని ఆయన చెప్పారు.