రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల మత్స్యకార కుటుంబాలు గత రెండేండ్లుగా ఒడ్డుకుపడ్డ చేపల వలె గిలగిలా కొట్టుకుంటున్నాయి. తెలంగాణ తొలి ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు అమలుపరిచిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను తలచుకుంటూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డుపరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గాలు కనిపించక వారు తల్లడిల్లిపోతున్నారు.గత రెండేండ్లుగా తాము అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక గతాన్ని తలచుకుంటూ లోలోపల కుమిలిపోతున్నారు.
రెండేండ్ల కిందట రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నీరుగార్చింది. సీజన్ ముగిసి ఇప్పటికే ఆరు నెలలైనా ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను వదలలేదు. దీంతో వచ్చే ఏడాది కూడా తమ జీవితాలు అంధకారంలో మగ్గాల్సిందేనా? అంటూ మత్స్యకార కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.
తిరోగమనంలో తెలంగాణ మత్స్యరంగం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచి వరుసగా ఎనిమిదేండ్ల పాటు రూ.వందల కోట్లు ఖర్చుచేసి అమలుచేసిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోని మత్స్యకారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించింది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి చేపల ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. కాళేశ్వరంలో భాగంగా గోదావరిపై నిర్మించిన ఆనకట్టలు, వాటికి అనుబంధంగా నిర్మించిన జలాశయాలు, వాటికి అనుసంధానంగా తవ్విన ప్రధాన, ఉపకాలువల ద్వారా చెరువులను నింపడంతో వేసవికాలంలోనూ చెరువులన్నీ జలకళతో కళకళలాడాయి. ఆ చెరువుల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మత్స్యకారుల ఆదాయం కూడా పెరిగింది.
సుమారు రూ.వెయ్యికోట్ల నిధులతో మత్స్యకారుల సంక్షేమం కోసం బీఆర్ఎస్అమలుపరిచిన ‘సమీకృత మత్స్యఅభివృద్ధి పథకం’, వరుసగా రెండు పర్యాయాలు అమలుచేసిన ప్రత్యేక సభ్యత్వ నమోదు, కొత్తగా మత్స్యసహకార సంఘాల ఏర్పాటు ఫలితంగా ఫిషరీస్ సొసైటీల సంఖ్యతో పాటుగా, మత్స్య సహకార సంఘాల్లో సభ్యుల సంఖ్య కూడా రెట్టింపైది.
ఉమ్మడి ఏపీలో సొసైటీ సభ్యత్వాన్ని వదులుకునే మార్గాలను మత్స్యకారులు వెతికేవారు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక తమ కుటుంబ సభ్యులకు మత్స్యసహకార సంఘాల్లో సభ్యత్వం దక్కించుకోవడం ఒక సామాజిక గౌరవంగా భావించే పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు చెందిన గ్రామీణ చెరువులను మత్స్యశాఖ అధీనంలోకి తీసుకురావడంతో చేపల పెంపకంలో గతంలో మత్స్యసహకార సంఘాలు ఎదుర్కొన్న చేదు అనుభవాలు కనుమరుగయ్యాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రెండున్నర లక్షలుగా ఉన్న మత్స్యసహకార సభ్యుల సంఖ్య పదేండ్లలో నాలుగున్నర లక్షలకు పెరిగింది. మత్స్య సహకార సంఘాల సంఖ్య మూడున్నర వేల నుంచి ఆరున్నర వేలకు చేరుకున్నది. మత్స్యకారుల వార్షిక సగటు ఆదాయం కూడా తొలి ప్రభుత్వ పదేండ్ల పాలనలో దాదాపుగా రెట్టింపైంది. మొత్తంగా మత్స్యకారుల కుటుంబాలు భవిష్యత్తుపై భరోసా పొందే స్థాయికి చేరుకున్నాయి. కానీ, గత రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో వారి జీవితాలు మళ్లీ తలకిందులయ్యాయి.
ఏమి మారెను, ఏమి మారెనురా?: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా అసమర్థతను అంచనా వేయడానికి తెలంగాణ మత్స్యరంగాన్ని పరిశీలిస్తే సరిపోతుంది. ఈ రెండేండ్లలో ఇద్దరు మత్స్యశాఖ కమిషనర్లను మార్చడం మినహా కొత్తగా చేసిందేమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ‘మత్స్య అభివృద్ధి సంస్థ’ (ఫిషరీస్ కార్పొరేషన్) ఏర్పాటు అంశం బుట్టదాఖలైంది. ‘మత్స్య సహకార సంఘాల సమాఖ్య’కు ఎన్నికలు నిర్వహించి, రాష్ట్రస్థాయిలో పాలక మండలిని నియమించాలనే హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. గతంలో సరఫరా చేసిన చేప పిల్లలకే ఇంతవరకూ బకాయిలు చెల్లించకపోవడంతో ఈసారి చేపపిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. అధికార వర్గాలకు కమీషన్లను భారీ మొత్తంలో అందుకునేందుకు ఆస్కారమున్న ఆంధ్ర రొయ్యపిల్లల పంపిణీ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నది. రాష్ట్రంలో కొత్త సొసైటీల ఏర్పాటు, కొత్తగా సభ్యత్వాల నమోదుపై అధికారులు కనీసం స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ‘మత్స్య మార్కెటింగ్ సొసైటీ’ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముదిరాజులు కూడా పూర్తిస్థాయి మత్స్యకారులేనని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనేక పద్ధతుల్లో, అనేక సందర్భాలలో తేల్చిచెప్పినప్పటికీ కొన్ని జిల్లాలలో ఆ సామాజిక వర్గం వారికి మత్స్యసహకార సొసైటీలలో సభ్యత్వాన్ని కల్పించే విషయంలో మత్స్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.
తారుమారు లెక్కలు, తలకిందుల నివేదికలు: తెలంగాణ ఆవిర్భావం నాటికి, 2014లో 2.46 లక్షల టన్నులుగా నమోదైన తెలంగాణ వార్షిక చేపల ఉత్పత్తి 2023-24 సంవత్సరానికి 4.53 లక్షల టన్నులకు చేరుకున్నది. అంటే, దాదాపు రెట్టింపైంది. కానీ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25, 2025-26ల కాలంలో తెలంగాణలో చేపల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కానీ, అధికారులు మాత్రం 2024-25లో సుమారు 4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి నమోదైనట్టు తప్పుడు లెక్కలు తయారుచేశారు. 2016లో ప్రారంభించిన ‘ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం’లో భాగంగా అత్యధికంగా సుమారు 68 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసిన సందర్భాలు కూడా రాష్ట్రంలో నమోదయ్యాయి. కానీ గత ఏడాది (2024-25) ఈ ప్రభుత్వం కనీసం సగం కూడా పంపిణీ చేయలేదు. ఈ సంవత్సరం (2025-26) రూ.122 కోట్లతో 24 వేల చెరువుల్లో కనీసం 83 కోట్ల చేప పిల్లలను, రూ.24 కోట్ల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ, సీజన్ పూర్తయినప్పటికీ ఇంతవరకూ ఇందులో సగం కూడా పంపిణీ చేయలేకపోయారు. ఫలితంగా రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలు తమ ఆదాయ వనరులను కోల్పోనున్నాయి.
మత్స్యకారులపై కక్షగట్టిన కాంగ్రెస్: గత రెండేండ్లుగా రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నది. అయినా రాష్ట్రంలోని చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు గాని; వాగులు, ఉప నదుల మీద చెక్‌డ్యాం గాని నిర్మించిన దాఖలాల్లేవు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో, వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన చెక్‌డ్యాంలను కుట్రపూరితంగా పేల్చివేస్తున్న సంఘటనలను మనం పదే పదే చూస్తున్నాం. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన సంఘటన ఫలితంగా గోదావరిపై గత ప్రభుత్వం నిర్మించిన బ్యారేజీలన్ని వట్టిపోవడంతో వేల మంది మత్స్యకారులు జీవనాధారాలను కోల్పోయారు. అనేక హామీలతో తెలంగాణ సమాజాన్ని నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాలలాగానే తమ సంక్షేమం కోసం సరికొత్త పథకాలను అమలుపరుస్తారని ఎదురుచూసిన మత్స్యకారుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మత్స్యకారుల మీద కక్షగట్టిందా? అనే అనుమానాలు వ్యక్తం కావడంలో ఆశ్చర్యమేమున్నది?
(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్’పూర్వపు అధ్యక్షులు,‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)
-పిట్టల రవీందర్