రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ పాలకులు పరితపించారు. ఆ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాల్లో రాష్ట్రం ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సాధించిన ఫలితాల పట్ల ప్రపంచమే తెలంగాణ వైపు అబ్బురంగా చూస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ర్టాలు, ప్రజలు తెలంగాణ తరహా పాలనా విధానాలను, అభివృద్ధి సంక్షేమాలను కోరుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న ఫలాలను తామూ ఆస్వాదించాలని ఆరాటపడుతున్నది యావత్ దేశం. తెలంగాణ ప్రజల వలె సంతోషంగా జీవించే రోజులు తమకూ రావాలని దేశంలోని ప్రజలు పరితపిస్తున్నారు. అయితే దానికోసం కావాల్సిందొక్కటే.. ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి మాడల్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్ వంటి నాయకుడు ఈ దేశానికి కావాలె. అవును. ఈ దేశానికి నిబద్ధత గల పాలకుడు కావాలె. కార్పొరేట్లకు అమ్ముడుపోని నాయకుడు కావాలె. మాటలతో గారడీ చేయని నాయకుడు కావాలె. అలాంటి నాయకుడి అవసరం ఈ దేశానికి ఇప్పుడున్నది. ఈ దేశానికి కావాల్సింది రైతులపై మొసలి కన్నీరు కార్చే నాయకుడు కాదు, రైతు కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే నాయకుడు కావాలె. తమ ఆర్థిక సలహాదారుని చేత రైతుల ఆదాయం మీద పన్ను వేయండని వ్యాసాలు రాయించే నాయకుడు కాదు ఈ దేశానికి కావలసింది, నేనున్నాను మీరు నాగలి పట్టండని రైతులకు భరోసానిచ్చే నాయకుడు కావాలె. పెట్టుబడి సాయం అందించే పెద్ద చేతులు ఈ దేశానికి కావాలి. ఈ దేశం ఏండ్ల తరబడి నిశీధిలో మగ్గినా పట్టించుకోని నాయకుడు కాదు, తమ జీవితాల్లో వెలుగులు నింపే ఒక దళిత బాంధవుడు కావాలె.
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు దీరడానికి కారణం ఆయన గొప్పతనం కాదు, గుజరాత్ మాడల్ అభివృద్ధి అంతకూ కాదు. కాంగ్రెస్ పాలనా విధానాలతో ప్రజలు విసిగివేసారిపోయి ఉండటమే దానికి ప్రధాన కారణం. అంటే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి అధికారాన్ని బదలాయించిందనుకోవచ్చు. ప్రజలకూ బీజేపీ మినహా ప్రత్యామ్నాయం కనిపించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఏదో ఒక ప్రభుత్వం కొలువుదీరాలి కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అంతే తప్ప, నాటినుంచి నేటిదాకా బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు.
దేశంలో కావలసినన్ని సహజ వనరులున్నాయి. కానీ వాటిని వాడుకునే విధానాలు లేకపోవటం, ప్రజానుకూల విధానాలను అమలుచేసే సరైన నాయకుడు లేకపోవడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం. ఇప్పుడు ఈ దేశంలో ప్రజల బాగోగులు పక్కకు నెట్టివేయబడ్డాయి. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఈ దేశం ఇప్పుడు మతం రంగు పులుముకునే పనిలో నిమగ్నమైపోయింది. గుడులు, గోపురాలను ముందట వేసుకుంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే నాయకులు పనిగట్టుకొని ముందుకుపోతున్నారు. మైనారిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకొని మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అనేక పాట్లు పడుతున్నది.
నియంతృత్వ, మతతత్వ పార్టీకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్న సమయంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఉద్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారు. దేశానికి మాడల్ అంటే తెలంగాణ రాష్ట్రమే అని నిర్ధారించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలుచేస్తామని వచ్చిన ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు. ఇక మహారాష్ట్ర నాందేడ్‌లో జరిగిన సభ విషయానికి వస్తే.. మరాఠాల ఆదరాభిమానాలను చూస్తే ముచ్చటేసింది. ఆ సమావేశానికి వచ్చిన ప్రజలంతా అట్టడుగు, అణగారిన వర్గాలకు చెందినవారే. బడుగు, బలహీనవర్గాల ప్రజలే. కానీ నాందేడ్ బీఆర్ఎస్ సభాస్థలికి కేసీఆర్ వచ్చినప్పుడు ప్రజల కేరింతలు చూస్తే ఆశ్చర్యమేసింది. కేసీఆర్ పట్ల మరాఠాలకు ఇంతటి ఆదారాభిమానాలున్నాయా అనిపించింది. రోజంతా కష్టపడ్డా బుక్కెడు బువ్వ దొరుకని, అభివృద్ధి అంటే ఏమిటో తెలియని తండాల నుంచి వచ్చిన గోండులు కేసీఆర్‌ను తమను ఆదుకోవటానికి వచ్చినవాడిగా ఆరాధనాపూర్వకంగా, అభినందనాపూర్వకంగా చూశారు.
మాకూ పింఛన్ కావాలె, మాకూ రైతుబంధు కావాలె. మాకు రైతుబీమా కావాలె, మాకూ దళితబంధు కావాలె, నాయకుడంటే కేసీఆరే, ఆయన అవసరం ఇప్పుడు దేశానికి ఉన్నదంటూ ప్రజలు నినదిస్తుంటే… ‘ఓ తెలంగాణ తల్లీ ఈ మహాత్ముడిని కన్న నువ్వెంత అదృష్టవంతురాలివో..’ అంటూ కీర్తించబుద్ధయింది, కొనియాడబుద్ధయింది. కొట్లాటలు మాకు కొత్త కాదు, కేసులూ మాకు కొత్తేం కాదు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడాం, ఇప్పుడు దేశం కోసం కొట్లాడుతాం అంతే.. ఆ ఆకలి కేకలను చూస్తూ ఊరుకోలేం కదా..?
నాడు తెలంగాణ కోసం ఈ నాయకుడి వెంట బయల్దేరాం, నేడు దేశం కోసం నాయకుడి కోసం బయల్దేరుతాం. నవ్విన నాపచేనే పండుతుందనే ఓ పాత సామెత. తెలంగాణ కోసం బయల్దేరినప్పుడూ నవ్విన నోళ్లే, తెలంగాణ రాగానే శభాష్ అని కీర్తించారు. ఇప్పుడూ నవ్వుతున్నారేమో.. కానీ,
ఆ నోళ్లూ కీర్తించక మానవు. కాస్తా ఆలస్యం కావచ్చు, కానీ జరగడం మాత్రం ఖాయం.
అదానీ వంటి మోసగాళ్లకు కొమ్ముకాసే నాయకుల భరతం పడతాం.. భారతదేశాన్ని కాపాడుకుంటాం. కానీ, సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు భయపడే తత్వం తెలంగాణది కాదు. ఈ గడ్డ కన్న నాయకులది అంతకన్నా కాదు. తెగించి పోరాడే తత్వం ఉన్న నాయకుడు కేసీఆర్ ముందుకుసాగుతూనే ఉంటాడు. అండగా అహోరాత్రులు కష్టపడే ఆయన నిర్మించుకున్న సేనలు ఉండనే ఉన్నాయి. నాడు టీఆర్ఎస్ విజయం సాధించింది, నేడు బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది.
నాటి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమయ్యాను. ఇప్పుడు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినాదం ఇస్తున్న ‘భారత రాష్ట్ర సమితి’లో భాగమవుతాను. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుంది. ఇది దేశ ప్రజలకూ అర్థమయింది. కాకపోతే కాలమే తొందరగా రావాల్సి ఉన్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు)
-కాసర్ల నాగేందర్‌రెడ్డి
+61 478 311 563