బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నది. కావాలనే మొదటి నుంచి ఏదో ఒక కిరికిరి పెడుతున్నది. రిజర్వేషన్ల అమలుకు కీలకమైన కులగణన సర్వే మొదలు బిల్లులు, తాజా ఆర్డినెన్స్ వరకు ఉద్దేశపూర్వకంగా అన్నింటిని ఏదో ఒక వివాదంలో పడవేస్తున్నది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేకపోవడమే అందుకు కారణం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉండగానే ఇటీవల ఆర్డినెన్స్ తీసుకురాగా, ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌ను పక్కనపడేసి, రాజకీయ లబ్ధి కోసం బిల్లుల ఆమోదం పేరిట ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ టూర్ డ్రామాకు తెరదీయడమే ప్రత్యక్ష తార్కాణం.
బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరిస్తున్నది. ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నది. ఏ మార్గం అనుసరిస్తే రిజర్వేషన్లు దక్కుతాయో చెప్పేందుకు తమిళనాడు, ఏ పద్ధతిని పాటిస్తే రిజర్వేషన్లు దక్కవో చెప్పేందుకు బీహార్ ఉదాహరణలు మన కండ్లముందే ఉన్నాయి. అయినా ‘తనకు తెలియదు, ఇతరులు చెబితే వినడు..’ అన్నట్టుగా అజ్ఞానంతో, మూర్ఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది.
2021లో వికాస్ కిషన్‌రావు గవాళి కేసులో జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు అన్ని రాష్ర్టాలకు ప్రామాణికం. ట్రిపుల్ టెస్ట్ పేరిట ఆ తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను సూచించింది. అందులో ముఖ్యమైనది డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని రాజకీయ వెనుకబాటుతనంతోపాటు సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ కమిషన్ నిర్ధారించాలి. ఆ డేటా ఆధారంగా అమలు చేసే రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో నిలబడతాయి. కానీ, నయవంచనకు మారుపేరైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని తారుమారు చేసేసింది.
రెగ్యులర్ బీసీ కమిషన్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. అప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ల సమీక్ష, రిజర్వేషన్ అమలులో లోపాలను సరిదిద్దేందుకు సిఫారసులు, బీసీ కులాల జాబితా రూపకల్పన తదితర పనులు మాత్రమే రెగ్యులర్ బీసీ కమిషన్ల విధి. రిజర్వేషన్లు పెంపు బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం రాజ్యాంగం విరుద్ధం. అంతేకాదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడం కూడా. రిజర్వేషన్ల పెంపునకు ఆర్టికల్ 340 ప్రకారం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2024 సెప్టెంబర్‌లో రెగ్యులర్ బీసీ కమిషన్‌కు డెడికేటెడ్ కమిషన్ హోదా కల్పిస్తూ జీవో 199 జారీచేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన మొదటి, అతిపెద్ద తప్పు ఇది. ఫెయిలైన కర్ణాటక మోడల్‌ను అమలు చేయడం మరో పెద్ద తప్పు.
2024 అక్టోబర్ 9న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సమీక్షించారు. 2024 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, వినతులు సేకరించాలని నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బీసీ కమిషన్ నిర్ణయించింది. 2024 అక్టోబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభిప్రాయ సేకరణ కోసం సమావేశం కూడా జరిగింది. 2024 నవంబర్ 6 నుంచి బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను గుర్తించిన బీసీ మేధావులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2024 అక్టోబర్ 30న ఆదేశించింది. చాలా ఆలస్యంగా మేల్కొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 4న రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే రాష్ట్రంలో కులగణన సర్వే మొదలైంది. హైకోర్టు మొట్టికాయలతో అప్పటివరకు ఉనికిలోనే లేని డెడికేటెడ్ కమిషన్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఓవైపు రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతుండగానే, అభిప్రాయ సేకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ జిల్లాల పర్యటనలు చేసింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, సక్రమంగా జరగలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం.
అంతకుముందు జిల్లాల పర్యటనలో సేకరించిన డేటాను బూసాని కమిషన్‌కు నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బీసీ కమిషన్ ఆ తర్వాత అందజేసింది. ఇటు బీసీ కమిషన్, అటు డెడికేటెడ్ కమిషన్ అజమాయిషీ లేకపోవడంతో కులగణన తప్పులతడకగా మారింది. మొదట డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కులగణన తప్పిదాలపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రభుత్వాన్ని నిలదీశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పారదర్శకత లేని ఈ సర్వే డేటా ఆధారంగానే బూసాని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీని ఆధారంగా రూపొందించిన రెండు ప్రత్యేక బిల్లులను 2025 మార్చి 25న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆర్టికల్ 200 ప్రకారం ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ ద్వారా పంపించారు. సంబంధిత డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. అయితే, ఈ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో హంగామా చేశారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2025 జూన్ 25న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో అప్పటికే రాష్ట్రపతికి పంపించిన బిల్లులను పక్కకు పడేసి హడావుడిగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారో, లేదో స్పష్టత రాకముందే మళ్లీ ఇప్పుడు బిల్లుల ఆమోదం పేరు మీద ఢిల్లీ నాటకానికి కాంగ్రెస్ పాలకులు తయారయ్యారు. ఆర్డినెన్స్ తెచ్చిననాడు స్వీట్లు పంచుకున్న సంగతి వారికి గుర్తులేదా?
బిల్లులను ఆమోదింపజేసుకోవాలనే ఉద్దేశమే గనుక ఉంటే ఆర్డినెన్స్‌ను ఎందుకు తీసుకొచ్చినట్టు? బిల్లులు ఆమోదం పొందవని భావించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉంటే ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో డ్రామాలెందుకు? రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కుల్లో పడేసి చేతులు దులుపుకోవాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రిజర్వేషన్ల హామీకి మంగళం పాడి పార్టీపరంగా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ కొత్త రాగం ఆలపిస్తున్నది. జనాభాకు తగ్గట్టుగా సీట్లు దక్కించుకోవడం మా హక్కు. దొడ్డిదారిన కాంగ్రెస్ ఇస్తుందో, లేదో తెలియని సీట్లు మాకెందుకు? కాంగ్రెస్ నైజం తెలియనిది కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఇస్తామన్న 34 సీట్లను ఎగ్గొట్టిన చరిత్ర కండ్లముందే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల హామీని బొందపెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్‌ను బీసీలు ‘స్థానికం’గా బొందపెట్టడం ఖాయం.
– (వ్యాసకర్త: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే) గంగుల కమలాకర్