HomeOpinionsThe Telangana Govt Has Presented An Annual Budget Of Rs 324234 Crore For The Year 2026 27
ఆర్భాటపు బడ్జెట్లో మిగిలేది ఆయాసమే!
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది. సంపద పెంచడం, పంచడం రెండూ లేవు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయ వృద్ధి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేతుల్లో డబ్బులు కనిపించేవి. కానీ నేడు ప్రతీ వర్గం ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. మరి ప్రభుత్వం చెప్తున్న తలసరి ఆదాయం పెరిగిందన్న లెక్కలు విడ్డూరంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చూపుతున్న అంకెల్లో సంపద ఎవరి జేబుల్లోకి వెళ్లిందో కూడా ప్రభుత్వమే చెప్పాలి మరి!
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26లో ప్రభుత్వం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ పెట్టగా, కేటాయింపులు పెంచింది. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు గొప్పగా చెప్తున్నప్పటికీ వాటిని ఖర్చు పెట్టడంలేదు. 2024-25 బడ్జెట్‌ను రూ.2.91 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులో రూ.70వేల కోట్లను ఖర్చు చేయలేదు. ఈ విషయాన్ని 2025-26 బడ్జెట్ సమయంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు. బడ్జెట్లో రూ.70 వేల కోట్లు ఖర్చుపెట్టలేదంటే అది చాలా పెద్ద వైఫల్యమే. ఏదో ఒకటి ముందు చెప్పేద్దాం, ఖర్చు సంగతి తర్వాత చూద్దాంలే అన్నట్టుగా కాంగ్రెస్ పాలకులు వ్యవహరిస్తున్నారు.
అంకెలు ఆడంబరంగా, చేతలు దిగదుడుపుగా ఉంటున్నాయి. తలసరి ఆదాయం విషయానికి వస్తే ప్రభుత్వం రూ.4,18,931 అని చెప్పింది. నిరుడు కంటే పెరిగినట్టు పేర్కొన్నది. కానీ మరోవైపు ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉన్నది. నిజంగానే ప్రజల తలసరి ఆదాయం పెరిగినట్టయితే కొనుగోలు శక్తి పెరగాలి. కానీ పరిస్థితి అలా ఎందుకు లేదు? పోయిన సంవత్సరం కొన్ని నెలలపాటు ద్రవ్యోల్బణం మైనస్‌లోకి కూడా వెళ్లింది.
కేసీఆర్ హయాంలో గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. వ్యవసాయం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. సంపద సృష్టి, పంపి ణీ జరిగాయి. మెరుగైన సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రజల వద్ద డబ్బులు ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి మెరుగ్గా ఉన్నది. అంటే ద్రవ్యోల్బణం పెరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక పాజిటివ్ పాయింట్ సూచిక. 5-6 శాతం ద్రవ్యోల్బణం పెరిగితే చాలా సానూకాల అంశమే. కేసీఆర్ హయాంలో సంపద సృష్టించి, పేదలకు పంచారు. అందుకే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. కానీ కాంగ్రెస్ పాలనలో సంక్షేమం కుంటుపడింది. పెరిగిన సంపద సామాన్య ప్రజల చేతిలోకి కాకుండా కొద్దిమంది చేతిలోకి వెళ్లిందని, మెజారిటీ జనాలకు పంపిణీ జరగలేదని స్పష్టమవుతున్నది.
ఇదే కదా బడేభాయ్ మోదీ, చోటేభాయ్ రేవంత్‌రెడ్డి తరహా పాలన. సంక్షేమం అంటే గిట్టదు. అదానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు దోచిపెట్టడం అంటేనే నచ్చే వాళ్లకు పేదలకు సంక్షేమ ఫలాలు పంచడం నచ్చదు. కేసీఆర్ పాలనలో సంపదను పేదలకు పంపిణీ చేశారు. అందుకే మోదీకి, రేవంత్‌కు కేసీఆర్‌పై కోపం. వాళ్ల లెక్కలో సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలి గానీ పేదలకు పంచకూడదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు భారీగా తెచ్చుకుంటున్నామని భట్టివిక్రమార్క చెప్పారు. సఖ్యతగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. కానీ అది సఖ్యత కాదు, లాలూచీ. మోదీ మాట ప్రకారం అదానీ కోసం రేవంత్‌రెడ్డి సేవ చేస్తున్నారు. అదానీ వ్యాపారాలకు రేవంత్ గేట్లు తెరుస్తుంటే మోదీ సఖ్యతగా ఉంటున్నారు.
రాష్ట్రంలో అదానీ దోపిడీ వ్యాపారానికి కేసీఆర్ గేట్లు తెరవలేదు. అందుకే ఆయన పట్ల మోదీకి కోపం. దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్లకు, ముఖ్యంగా అదానీకి దోచిపెడుతున్నారని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ విమర్శిస్తారు. కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న దోపిడీని గుర్తించడంలేదు. కేంద్ర ప్రభుత్వంతో తమతో సఖ్యత ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుకొంటున్నారు.
ప్రభుత్వం మరో విచిత్రమైన వాదన వినిపించింది. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రీజినల్ రింగ్‌రోడ్డు బయటకు తీసుకెళ్తామని భట్టి తన ప్రసంగంలో పేర్కొన్నారు. సాధారణంగా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు జిల్లాల్లో ఉంటాయి. వీటి కోసం పరిశ్రమలు జిల్లాల్లో స్థానికంగానే ఉండాలి. తెలంగాణ మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలి. కానీ ఆర్ఆర్ఆర్ అవతల ఒకేచోట పరిశ్రమలు పెడుతామని చెప్పడం విడ్డూరం. నగరంలో ఎక్కడపడితే అక్కడ ఫార్మా పరిశ్రమలు ఉంటే కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్య నియంత్రణ కష్టం. కాబట్టి ఫార్మా పరిశ్రమలు ఒకే చోట ఉండాలని, కాలుష్య నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
ఫార్మాసిటీ కోసం భూములు సేకరించింది. రేవంత్‌రెడ్డి మాత్రం వికేంద్రీకరణ జరగాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఒకేచోట, ఒకేచోట ఉండాల్సిన ఫార్మా పరిశ్రమలను ఏడెనిమిది చోట్ల ఏర్పాటు చేస్తామని వింత విధానాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కోసం రూ.18వేల కోట్లు ఇస్తామని బడ్జెట్లో చెప్పింది. కానీ ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టింది. ఎలాగూ ఇచ్చేది లేదని ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, బడ్జెట్లో ఊరికే చెప్పినట్టు కనిపిస్తున్నది. రుణమాఫీ విషయంలోనూ రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. ఇక ఆరు గ్యారెంటీల కోసం రూ.50,713 కోట్లు వెచ్చిస్తామని ప్రభుత్వం తెలిపింది.
కానీ ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు మినహా ఆరు గ్యారెంటీల్లో ఒక్క స్కీమ్ కూడా అమలు కావడంలేదు. అమలు కాని పథకాల పేరుతో కేటాయింపులు చేయడంలో అర్థంలేదు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ నిలదీస్తున్న ప్రజల పట్ల సర్కార్ పరిహాసం చేసినట్టు జనం ముఖం మీద వెక్కిరించినట్టు అనిపిస్తునది. గ్యారెంటీలు అమలు చేయాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వాటికి చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో డిమాండ్ చేసినప్పుడు పాలక పెద్దలు ఎందుకు అంగీకరించలేదు? అంటే ఆరు గ్యారెంటీలు, వాకి కేటాయింపులు అన్నీ ఉత్తముచ్చట్లే.
ప్రాజెక్టుల్లో పూడికలు తీస్తున్నామని భట్టి చెప్పారు. అది పూడిక తీయడం కాదు. ఇసుక తవ్వుకొని దందాలు చేయడం. పిల్లర్లకు దగ్గరలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కానీ వందలాది లారీలతో ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పూడికలు తీయాల్సింది చెరువులకు. కానీ ప్రభుత్వం ఇసుక మాఫియాకు కొమ్ముకాసినట్టుగా వ్యవహరిస్తున్నది. చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో తులం బంగారం ప్రస్తావన మభ్యపెట్టే మాటలు ఇంకా చెప్తున్నది. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు.
ఇప్పటివరకు 67 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని భట్టివిక్రమార్క చాలా అద్భుతమైన విషయం చెప్పారు. భట్టి చెప్పిన వాటటిలో ఇదొక్కటి మాత్రం ముమ్మాటికీ నిజం. ఎందుకంటే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహిం చి, ఫలితాలు వెల్లడించింది కేసీఆర్ హయాం లోనే. కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపత్రాలు మాత్రమే ఇచ్చింది. కానీ మొత్తం తమ ఖాతా లో వేసుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు మళ్లీ లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్తున్నది. 2 లక్షల ఉద్యోగాల కథ కంచికిపోయింది. కొత్తగా లక్ష ఉద్యోగాల కథ కూడా అరచేతిలో వైకుంఠమే.
కేసీఆర్ హయాంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ (ఎస్వోటీఆర్) గణనీయంగా పెరిగింది. అది 2014-15 రూ.29,288 కోట్లు ఉండగా 2022-23 రూ.లక్ష కోట్ల పైచీలుకు పెరిగింది. అంటే ఏటా 18 శాతానికి పైగా వృద్ధి చెందింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వ్యవసాయ స్థిరీకరణ, పంటల దిగుబడి, సంక్షేమం వంటి మెరుగైన పథకాల వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోతున్నది. విద్యారంగానికి 18 శాతం కేటాయించాలని విద్యా కమిషన్ ఆర్భాటంగా నివేదికలో చెప్పింది. కానీ ప్రభు త్వం 8 శాతమే కేటాయించింది. ఖర్చు చేసేది ఎంతనో! ఇలా కాంగ్రెస్ హయాంలో కుదేలైన రంగాలు ఎన్నో. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఐటీ రంగంలోనూ హైదరాబాద్ వెనుకబడింది.
కేసీఆర్ హయాంలో అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చిందని అడ్డగోలు ప్రచారం చేస్తున్నది. కేంద్రం పార్లమెంట్లో చెప్పిన లెక్కల ప్రకారమే కేసీఆర్ పాలన పూర్తయ్యే నాటికి రాష్ట్ర మొత్తం అప్పు రూ.3.5 లక్షల కోట్లు. ఇందులో ఉమ్మడి రాష్ట్రం నుంచి వాటాగా వచ్చిన అప్పు రూ.70 వేల కోట్లు. కేసీఆర్ పాలనలో అప్పు రూ. 2.8 లక్షల కోట్లు. మరి కాంగ్రెస్ నేతలు చెప్తున్న రూ.8 లక్షల కోట్ల లెక్కకఎక్కడిది? రెండున్నరేండ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు రూ.3.47 లక్షల కోట్లు. కేసీఆర్ చేసిన అప్పుతో అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు చేపట్టారు. రెండేండ్లలోనే భారీగా అప్పు తెచ్చి, రేవంత్ చేసిన పనేంటి? ఒక్కటైనా ఉన్నదా? కాబట్టి భట్టి ఆర్భాటంగా, కవితాత్మకంగా చదివిన బడ్జెట్ లెక్కలు అమలయ్యేది లేదు, ఆయాసమే మిగిలిపోతుంది.