దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రెండు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌కు చెంపపెట్టు వంటిది. న్యాయం వైపు నిలబడి కలబడితే ఎంతటి రాజకీయ జిత్తులు, కుయుక్తులు పన్నినా విజయం సాధ్యమేనని ఈ తీర్పు రుజువు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచి, అలుపెరగని పోరాటం చేసిన దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలకు ఇది ఘన విజయం. అందుకు వీరికి హృదయపూర్వక అభినందనలు.
అట్టడుగు వర్గం నుంచి వచ్చిన సత్యనారాయణ గతంలో బీజేపీలో కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్ పాలన పట్ల ఆకర్షితుడై బీఆర్ఎస్లో చేరారు. ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం, తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాట పటిమ చూపించిన దాసోజు శ్రవణ్ సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తితో బీఆర్ఎస్లో చేరి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. నిఖార్సయిన వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.
బీజేపీ అధిష్ఠానం వ్యూహాలు: దాసోజు, సత్యనారాయణల ఎదుగుదలకు బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేసింది. అందుకు గవర్నర్‌ను ఒక పావులా వాడుకున్నది. రాజకీయ లాభనష్టాల గణాంకాలతో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని అణగదొక్కే ధోరణి బీజేపీ అవలంబించింది. ఎరుకల, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన సత్యనారాయణ, శ్రవణ్‌కు పదవులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించిందని వస్తున్న ఆరోపణలలో నిజం ఉన్నది. ఈ వ్యవహారంలో, రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై కీలకపాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
స్కేప్‌గోట్ అయిన కోదండరాం: తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం.. ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ పంచన చేరి స్వీయ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకున్నారు. చివరికి ఆశించిన ఎమ్మెల్సీ పదవీ స్వీకరించారు. ఇవన్నీ ఆయన రాజకీయ పతనానికి, వ్యక్తిత్వ దిగజారుడుతనానికి నిరూపణగా నిలువబోతున్నాయి. రాజకీయ కర్మయోగిగా వెలుగొందాల్సిన ఆయన తనకు తానే బలి పశువయ్యారు.
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న బీజేపీపై దృష్టి కేంద్రీకరించాలి. రాజ్యాంగాన్ని త్రోసిరాజని ప్రభుత్వం నడుపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలి. ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి, స్వలాభం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా భావించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది రాజకీయ పోరాటమే కాదు, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరగాల్సిన యుద్ధం కూడా. సుప్రీం తీర్పు అనేది ఇద్దరు నాయకుల విజయమే కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు గౌరవం. ఒక చారిత్రాత్మక ఘట్టం. రాజకీయ గణాంకాల క్రీడలో కూడా న్యాయం సాధ్యమేనని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ప్రజలు, నాయకులు, రాజకీయపార్టీలు అందరూ ఈ తీర్పు నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
– (వ్యాసకర్త: న్యాయవాది)
తన్నీరు శ్రీరంగారావు