గతం అభివృద్ధి అస్తిత్వం.. వర్తమానం ఉద్యమం బాధ్యత.. భవిష్యత్ వికాసం గతం వర్తమానాన్ని.. వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుంది..
విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది. చెరసాలలు ఉరికొయ్యలు వెలుగును వంచించలేవనే నాటి పోరాట రగల్‌జెండా నినాదిలిప్పుడు తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నయి. తీవ్ర నిర్బంధాలు, చెరసాలను ఛేదించుకొని పెట్టుబడిదారుల కుట్రలను తిప్పికొట్టిన ఝార్ఖండ్ జనమిచ్చిన దిమ్మదిరిగే ప్రజాతీర్పు దేశంలోని పీడిత, తాడిత రాష్ర్టాలకిప్పుడు ఆదర్శమే కాదు, ఓ భరోసా కూడా. ప్రజా తీర్పు ముందు నిర్బంధం బలాదూరేనని, రాక్షస సామ్రాజ్యవాద పర్వతాలను ప్రజాతీర్పు కూల్చుతుందనే ఓ నమ్మకం ఏర్పడింది. బీజేపీ కుతంత్రాలు, పెట్టుబడిదారుల కుట్రలకు బలయ్యేవారికి ఝార్ఖండ్ ప్రజాతీర్పు ఓ ఆశాదీపం. ప్రజాస్వామ్య పంథాకు సరికొత్త అర్థం.
ఝార్ఖండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలు సాధారణ ఎన్నికలే అయి నా ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలుగా వాటిని చూడాలి. బలం, బలగంతో కేంద్రంలోని బీజేపీ, స్థానిక వనరులను కొల్లగొట్టేందుకు అం బానీ, అదానీ రూపంలో అనేకమంది పెట్టుబడిదారులు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత సీఎంలంతా గిరిగీసి గిరిజనుల తీర్పును శాసించే ప్రయత్నం చేశారు. అంతకుముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. హేమంత్ సోరెన్‌పై ఈడీ దాడులు చేయించి, ఆయనను జైలుపాలు చేసింది. ఝార్ఖండ్ రాష్ట్ర హక్కుల కోసం పురుడుపోసుకున్న జేఎంఎం పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ కూడా గతంలో శతవిధాలా కుట్రలు పన్నింది. హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్‌ను ముడుపుల కేసులో జైలుపాలు చేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రజల కోసం జైళ్లకు వెళ్లేందుకు సోరెన్ కుటుంబం అదరలేదు, బెదరలేదు.
ప్రజాస్వామ్య పంథాలో తాజాగా ఝార్ఖండ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఆ రాష్ట్ర ప్రజానీకం డబ్బులకు లొంగిపోకుండా వాళ్ల వివేచన, విచక్షణ పరంపరను కొనసాగించారు. కాబట్టే, ఇవాళ హేమంత్ సోరెన్ నాయకత్వంలో జేఎం ఎం మరోసారి సర్కార్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఈ సందర్భంగా ఝార్ఖండ్‌లోని గిరిజనుల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం, ఆ ప్రాంత అస్తిత్వం, వనరులను కాపాడేందుకు పురుడుపోసుకున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ, భారత రాష్ట్ర సమి తి భావ సారూప్యతలను పోల్చుకునే సందర్భం ఇది. జేఎంఎం పార్టీ నేతృత్వంలో, శిబూ సోరెన్ నాయకత్వంలో ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం మహోత్తరమైన పోరాటాలు జరిగాయి. అందుకే, జేఎంఎం పోరాటస్ఫూర్తిని అధ్యయనం చేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఉద్యమ సమయంలో అనేకసార్లు శిబూ సోరెన్‌ను తెలంగాణకు ఆహ్వానించారు. అంతేకాదు, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం హోదాలో కేసీఆర్ ఝార్ఖండ్‌ను సందర్శించారు కూడా. అయితే, రాక్షస రాజ్య కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తూ వస్తున్న ఝార్ఖండ్ ప్రజల పోరాట పటిమ తెలంగాణలో పునరావృతం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
దేశ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే బీజేపీ లేక కాంగ్రెస్ పార్టీలకు కేంద్రంలో కొద్దికాలం మాత్రమే ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చా రు. ఎక్కువ కాలం ప్రాంతీయ పార్టీల సహకారంతోనే రెండు జాతీయపార్టీలు దేశాన్ని పాలించాయి. 1980 నుంచి ఇప్పటివరకు రెండే రెండు సార్లు జాతీయపార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చిందనేది చరిత్రను చూస్తే అవగతమవుతుంది. అంటే దేశంలో ప్రాంతీయ పార్టీలే ఆయా ప్రాంత ప్రజల అస్తిత్వ, ఆత్మగౌరవ పార్టీలని దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాలి. కేరళ నుంచి కశ్మీర్ వరకు అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ.. తెలంగాణలో బీఆర్ఎస్.. ఝార్ఖండ్‌లో జేఎంఎం.. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ.. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే.. ఒడిశాలో బీజేడీ.. ఏపీ లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ.. ఇట్లా చెప్పుకుంటే పో తే జాబితా చాలా పెద్దదే. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలే దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసేందుకు ఎన్నోసార్లు జాతీయపార్టీ లు ప్రయత్నించాయి. కానీ, ఆయా ప్రాంతాల ప్రజలు తమ అస్తిత్వ పార్టీలను కాపాడుకున్నారు. ప్రతిసారి వాటికి ప్రాణం పోశారు. ఇది ముమ్మాటికీ సత్యం.
రేవంత్ సర్కారుపై జనం కదం తొక్కుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పీడీత తాడిత, బాధి త జనానికి అండంగా నిలుస్తున్నది. ఝార్ఖండ్‌లో వచ్చిన ఎన్నికల తిరుగుబాటు ఇప్పుడు తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌పై కూడా ప్రజాక్షేత్రంలో వస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలన, రేవంత్ ఏడాది విధ్వంసంపై సమగ్ర చర్చ గ్రామాల్లో జరుగుతున్నది.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేస్తే ఇక్కడి అస్తిత్వ పార్టీకే మళ్లీ ప్రజలు పట్టం కడతారన్న నమ్మకం ఏర్పడింది. ఝార్ఖండ్ తీర్పుతో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ సర్కారు కొలువుదీరి ఏడాది కావస్తున్నా ఏ వర్గం సంతోషంగా లేదు. పైగా రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను నామరూపాల్లేకుండా చేస్తానని చెప్తూ.. ఆయన మీద కోపంతో బీఆర్ఎస్ సర్కార్ అమలుచేసిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న తీరు, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం, అక్రమ కేసులు పెడుతుండటం, తిట్ల పురాణాలను చూసి ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌ను ఈసడించుకుంటున్నారు. మన ఇంటి పార్టీ లేని లోటు, ఇంటిమనిషి లేని సందర్భం గురించి తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. రాజ్యం రూపంలో జరుగుతున్న రాక్షసత్వంపై జనంలో విసుగు వస్తున్నది. అందుకే, ఏడాదిలోపే ‘ఈ పాలన ఇక చాలు’ అనే మాటలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయి. పాలన దారితప్పింది. అంతేకాదు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మలినం చేస్తున్న మకిలి రాజకీయాలను చూసి తెలంగాణ ఊరూ వాడా క్షోభిస్తున్నది. ఏడాదిలోనే తెలంగాణలో రైతాంగ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ సొంత గడ్డ కొడంగల్ నుంచే భూమి కోసం, భుక్తి కోసం గిరిజనులు విముక్తి పోరాటం జరిపారు. కాంగ్రెస్ పాలకుల తీరుతో రాష్ట్రం రావణకాష్ఠంలా మండుతున్నది. నేత కార్మికుల ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు, విషాహారంతో విద్యార్థుల మరణాలు, ఆటోడ్రైవర్ల బలవన్మరణాలతో పాటు ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు తదితర వర్గాలు ఆందోళన బాటపడుతున్నారు. కేసీఆర్ పాలనలోని ఆలనాలాలనకు, ఇప్పటి రేవంత్ పాలనలోని అరాచకత్వాలను పోల్చుకొని ఊళ్లకూళ్లు తాము తప్పు చేశామని దుఖఃపడుతున్నాయి. ఫార్మా విలేజి కోసం బలవంతంగా తమ భూములను గుంజుకుంటున్న తీరును చూసి లగచర్ల ప్రజలు ‘అనవసరంగా అందలమెక్కిస్తిమి కదా’ అని కైగట్టి పాటలు పాడిన సందర్భాలను మనం చూశాం. ఓ పక్క ఏడాదిలోనే అన్ని రంగాలను విధ్వంసం చేసిన కాంగ్రెస్ వైఫల్యాలు, మరో పక్క పదే పదే కేసీఆర్‌పై తిట్ల పురాణం, సందు దొరికితే చాలు కేటీఆర్‌ను జైళ్లో వేయాలన్న ప్రతీకారం, ఉద్యమ పిడుగు హరీశ్‌రావును అడ్డుకోవాలనే కసి తప్ప తెలంగాణ అంటే ప్రేమ, మన సంస్కృతి, సం ప్రదాయాలను కాపాడాలన్న తపన రేవంత్ సర్కార్‌లో మచ్చుకైనా కనిపించడం లేదు.
రేవంత్ సర్కారుపై జనం కదం తొక్కుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పీడీత తాడిత, బాధి త జనానికి అండంగా నిలుస్తున్నది. ఝార్ఖండ్‌లో వచ్చిన ఎన్నికల తిరుగుబాటు ఇప్పుడు తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌పై కూడా ప్రజాక్షేత్రంలో వస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలన, రేవంత్ ఏడాది విధ్వంసంపై సమగ్ర చర్చ గ్రామా ల్లో జరుగుతున్నది. అంతెందుకు, తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలపై మరాఠా జనం ఆ పార్టీకి దిమ్మతిరిగే సమాధానమే ఇచ్చారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 102 స్థానాల్లో పోటీ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ సహా మంత్రులంతా పనిగట్టుకొని ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేశారు. అయినా పట్టుమని 10 శాతం ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రాలేదు. రేవంత్ 13 నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా.. ఒకే ఒక్క చోట ఆ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ వైఫల్యాలను అక్కడి జనం ఎండగట్టారనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది.
ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన తెలంగాణ గడ్డకు చైతన్యం, పోరాటస్ఫూర్తి ఎక్కువ. అందుకే, తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రతీ ఊరూవాడా సమాలోచనలు జరుపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఝార్ఖండ్ తరహాలోనే తీర్పు ఉంటుందన్న భావన, భరోసా తెలంగాణ సమాజంలో బలంగా ఉన్నది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు అవసరమని, అనివార్యమని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. అందుకే, కేసీఆర్ కోసం వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నది.