‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు’ అని చరిత్ర రుజువు చేసింది. వ్యవసాయ ప్రాధాన్యం గల రాజ్యానికి రైతే పాలకుడైతే, ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇవాళ తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యమే నడుస్తున్నది. రైతు సంక్షేమం మొదలుకొని, సర్వజనుల సంక్షేమం దాకా తెలంగాణ పథకాలు.. దేశానికి రోల్మాడల్గా నిలిచాయి. అందుకే దేశ ప్రజలంతా బీఆర్ఎస్ తరహా పరిపాలన కావాలని కోరుకుంటున్నారు.
2001 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించి సాధించిన పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల హయాంలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమయ్యాయి. నాటి తెలంగాణ నాయకులు సమైక్య నాయకులకు కొమ్ముకాయటం వల్ల మన ప్రాంతం తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.
ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నాడే తెలంగాణ ప్రజలకు అన్నిరంగాల్లో న్యాయం జరుగుతుందని ఉద్యమ నేతగా ఉన్నపుడే సీఎం కేసీఆర్ చెప్పారు. అనంతరం 2014లో స్వరాష్ట్రం సిద్ధించాక, ఉద్యమ నాయకు డే పాలనా సారథియై స్పష్టమైన కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఆ సంకల్పం నెరవేరింది. సాగునీటి కోసం రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిచేసింది.
కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడున్నరేండ్ల అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి, అందరి దృష్టినీ ఆకర్షించింది తెలంగాణ రాష్ట్రం. ‘సంపదను సృష్టించాలి, దాన్ని ప్రజలకు పంచా లి’ అన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు ఉన్న తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) ఇపుడు రెట్టింపు అయింది. జాతీయ సగటును మించి వృద్ధిరేటు సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రం ఆవిర్భావానికి ముందు తలసరి ఆదాయం రూ.95, 361 ఉంటే.. ఆరేండ్లలో రూ.3,12,398 కు ఎగబాకి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇలా సృష్టించిన సంపదతో దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో తెలంగాణ ప్రజలకు కనీస జీవన భద్రత ఏర్పడింది.
ఇక నిరుద్యోగులకు ఉపాధి కోసం ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో చేసే ఉద్యోగాలే అన్న అపోహ ఉంటుంది అందరిలో. కానీ, టీఎస్ పీఎస్సీ ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలేకాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితోపాటు, విద్యుత్తు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలు, విశ్వ విద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో నియామకాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కిందకే వస్తాయి.
కేవలం ప్రభుత్వశాఖల్లోనే కాకుండా నిరుద్యోగులకు పరిశ్రమల్లో, ఐటీ తదితర ప్రభుత్వేతర రంగాల్లోనూ అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా అనేక విధాలుగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షా 40 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు సీఎం కేసీఆర్. మరో లక్ష ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ నడుస్తున్నది. త్వరలోనే 5 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్నారు.
అలాగే, ప్రభుత్వేతర పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేండ్లలో 17 లక్షల 21 వేల మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఐటీ రంగంలో రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. బహుశా ఏ రాష్ట్రంలో, ఇంత తక్కువకాలంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రతా కల్పించబడలేదు. అలాగే ఇప్పటికే విధుల్లో ఉన్న ప్రభుత్వ-ప్రభుత్వరం గ ఉద్యోగులకు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తరహా లో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా లబ్ధి చేకూర్చే చర్యలు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఇట్లా తెలంగాణలోని అన్నిరంగాల్లో అభివృద్ధి శరవేగంగా సాగుతున్నది.
అందుకే, బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణను ఆగం పట్టిస్తరు. ఈ సందర్భంగా ఇటీవలే సూర్యాపేట సభలో రైతు పాలకుడైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ‘రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినయ్. వరి కోతలప్పుడు పంట కల్లాల కాడికి అడుక్కునేటోళ్లు వస్తారు గదా. అట్లా వీళ్లంతా మళ్ళా మీ దగ్గరకొస్తరు. వీళ్ళేమైనా కొత్తవాళ్లా?.. ఒక్క అవకాశం ఇయ్యండి అంటరు. ఎన్ని అవకాశాలు ఇచ్చినం. ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు అవకాశం ఇచ్చినం. కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్లు, పొడుగ్గున్నోళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులైండ్లు. మంత్రులైండ్లు. వాళ్లు ఎన్నడైనా రైతుల కష్టాలు తీర్చాలని ఆలోచించిండ్రా, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి, రైతుల పంటలకు మద్ధతు ధర ఇప్పించాలని ఎన్నడైనా చూసిం డ్రా? అందుకే మీరంతా మీ గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టాలె. తెలంగాణ అభివృద్ధి ఎవరితోటి సాధ్యమైతదో ఆలోచించాలె’ అన్న మాటలను ప్రజలంతా అర్థం చేసుకొని అనుసరించాల్సి ఉన్నది. తెలంగాణలో ఈ అభివృద్ధి యజ్ఞం ఇట్లనే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ రైతు ప్రభుత్వాన్నే గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం మనముందున్నది. కనుక రైతు పాలకుడికే పట్టం కడుదాం.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు)