యువతరం గళమెత్తితే..!-2
1970లో గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమం విద్యార్థుల అసంతృప్తితో మొదలయ్యింది. ద్రవ్యోల్బణం, అవినీతి, ఆర్థిక ఇబ్బందులు యువతను రోడ్డెక్కించాయి. బిహార్‌లో విద్యార్థి ఉద్యమం మరింత పెద్ద రూపం దాల్చింది. జయప్రకాశ్ నారాయణ్ దానికి నాయకత్వం వహిస్తూ సంపూర్ణ క్రాంతికి పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ సమస్యలను దేశవ్యాప్తంగా ఉన్న అసంతృప్తితో కలిపారు. ఎమర్జెన్సీతో రాజకీయ పరిస్థితి మరింత తీవ్రమైంది. పౌరహక్కులు, రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య జవాబుదారీతనం ప్రధాన ప్రశ్నలయ్యాయి.
1977లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. కేంద్రంలో తొలి కాంగ్రెస్‌యేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఓటమికి విద్యార్థులే కారణం కాదు. ఎమర్జెన్సీ, ప్రజా అసంతృప్తి, ప్రతిపక్షాల ఐక్యత, ఇతర రాజకీయ పరిణామాలన్నీ కలిసి పనిచేశాయి. కానీ జేపీ ఉద్యమం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. యువత ఆగ్రహం ప్రజల విస్తృత అసంతృప్తితో కలిస్తే, దానికి రాజకీయ దిశ దొరికితే, అత్యంత బలమైన నాయకత్వం కూడా ఎన్నికల్లో కూలిపోవచ్చు.
( నిన్నటి తరువాయి భాగం)
అసోం ఉద్యమం యువత రాజకీయ శక్తి ఎంత దూరం వెళ్లగలదో చూపించింది. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వం లో సాగిన ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను పూర్తి గా మార్చేసింది. విద్యార్థి నాయకులు ఉద్యమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోలేదు. వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. అసోం గణపరిషత్ ఏర్పడింది. విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులయ్యారు. రాజకీయ నాయకులు మంత్రులయ్యా రు. ప్రఫుల్ల కుమార్ మహంతా 32 ఏండ్లకే ము ఖ్యమంత్రి అయ్యారు. అంటే అక్కడ ఉద్యమం నుంచి ప్రభుత్వం దాకా పూర్తి ప్రయాణం జరిగింది. యువత ఉద్యమాలు ప్రభుత్వాలను కేవలం కదిలించడమే కాదు, అవసరమైతే అవే అధికారాన్ని చేపట్టగలవని అసోం చూపించింది.
1990లో మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో యువత ఆందోళన తీవ్రమైంది. వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోవడానికి అనేక రాజకీయ కారణాలున్నా, మండల్ తర్వాత దేశ రాజకీయాలే మారిపోయాయి. వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారత పెరిగింది. కుల ఆధారిత రాజకీయ సమీకరణాలు బలపడ్డాయి. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరిగింది. మండల్కమండల్ రాజకీయ విభజన మరింత బలపడింది. అంటే యువత ఉద్యమం వెంటనే ప్రభుత్వాన్ని కూల్చకపోయినా, రాజకీయ అజెండాను శాశ్వతంగా మార్చగలదు.
అన్నా ఉద్యమం: ఆగ్రహం ఎవరిది? రాజకీయ లాభం ఎవరిది?
2011లో అన్నాహజారే నాయకత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. అన్నా నైతిక ప్రతీకగా నిలిస్తే, విద్యార్థులు, యువ ఉద్యోగులు, మధ్యతరగతి, కార్యకర్తలు, డిజిటల్ తరం ఉద్యమానికి అపారమైన శక్తిని ఇచ్చారు. అవినీతి దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. యూపీఏ2పై ప్రజల విశ్వాసం దెబ్బతిన్నది. అయితే ఉద్యమం సృష్టించిన రాజకీయ శక్తి అన్నా దగ్గరే ఆగిపోలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఆ ఉద్యమం నుంచి వచ్చిన శక్తిలో కొంత భాగాన్ని రాజకీయ పార్టీగా మలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయాలను మార్చింది. మరోవైపు, అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏర్పడిన అవినీతి వ్యతిరేక, మార్పు ఆకాంక్షను నరేంద్ర మోదీ, బీజేపీ 2014లో జాతీయ స్థాయిలో తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అందుకే అన్నా ఉద్యమం ఇచ్చిన గొప్ప రాజకీయ పాఠం ఇదే. ఆగ్రహాన్ని ఎవరు రగిలించారన్నది ఒక ప్రశ్న. ఆ ఆగ్రహాన్ని రాజకీయ అధికారంగా ఎవరు మలుచుకున్నారన్నది అసలు ప్రశ్న.
2023లో తెలంగాణ
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత అసంతృప్తి ఒక ముఖ్యమైన రాజకీయ అంశంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు, పరీక్షల రద్దు, నియామకాల ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగార్థుల్లో పెరిగిన అనిశ్చితి, ఇవన్నీ కలిసి యువతలో అసహనాన్ని పెంచాయి. బీఆర్ఎస్ ఓటమికి ఇవే కారణమని చెప్పడం సరైంది కాదు. ఎన్నికల్లో అనేక అంశాలు పనిచేస్తాయి. కానీ విద్యార్థులు, ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతలో ఏర్పడిన అసంతృప్తి రాజకీయంగా ప్రభావం చూపిందనేది మాత్రం స్పష్టమే. కాంగ్రెస్ ఆ అసంతృప్తిలో ఒక రాజకీయ అవకాశాన్ని చూసింది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, యువ వికాసం, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్య, ఉపాధి వంటి అనేక హామీలతో యువతకు తామే ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ఇచ్చింది. యువతలోని అసంతృప్తి అనుకూలంగా ఓటుగా మారి, కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేసింది.
హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ యువతకు చాలా పెద్ద హామీలను ఇచ్చింది. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, టీఎస్పీఎస్సీలో సంస్కరణలు, యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్‌తో కూడిన నియామక వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి, యూత్ కమిషన్, స్టార్టప్లుస్వయం ఉపాధికి మద్దతు, వడ్డీ లేని ఆర్థిక సహాయం వంటి హామీలు ఇచ్చింది. అదే విధంగా రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉన్నత విద్య, కోచింగ్, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, పరిశోధనకు సహాయం, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ పరిష్కారం, విశ్వవిద్యాలయాల బలోపేతం, కొత్త విద్యాసంస్థలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, విద్యార్థులకు వివిధ స్థాయిల్లో ఆర్థిక సహాయం, ఓవర్సీస్ విద్యా మద్దతు, అర్హులైన విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, తెలంగాణ ఉద్యమ అమరవీరులు, ఉద్యమకారులకు గుర్తింపు, సహాయం, ఇందిరా యువ వికాసం ద్వారా యువతకు స్వయం ఉపాధి, వ్యాపారం, జీవనోపాధి అవకాశాల కోసం ఆర్థిక సహాయం వంటి హామీలు ఇచ్చింది. ఇవి ఎన్నికల సభల్లో చెప్పి మరచిపోయే మాటలు కావు. ఇవి యువత భవిష్యత్తుపై పెట్టుకున్న అంచనాలు. అందుకే ప్రతి ఆలస్యం, ప్రతి అమలుకాని హామీ యువతలో ఒక కొత్త ప్రశ్నను పుట్టిస్తుంది.
మాట ఇచ్చారు.మరి అమలు ఎక్కడ? ఒక్కో హామీ…ఒక్కో ప్రశ్న… అన్నీ కలిస్తే ఒకే ఆగ్రహం:
రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రూ.4 వేల నిరుద్యోగ భృతి ఎక్కడ? రూ.5 లక్షల విద్యా భరోసా ఎక్కడ? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు తీరతాయి? ఇందిరా యువ వికాసం ద్వారా యువతకు నిజమైన ఆర్థిక సహాయం ఎప్పుడు అందుతుంది? అమ్మాయిలకు హామీ ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వానికి ఇవి వేర్వేరు శాఖల ఫైళ్లు కావచ్చు. కానీ యువతకు ఇవన్నీ ఒకే ప్రశ్నగా మారుతున్నాయి:
ఒక్క హామీ అమలు కాకపోతే ప్రభుత్వం దానిని ఒక పథకం సమస్యగా చూపవచ్చు. కానీ పది, ఇరవై హామీలు, ఎన్నో ఆశలు ఒకేసారి నెరవేరకపోతే యువత దానిని సర్కార్ వైఫల్యంగా భావిస్తున్నది. హిర్ష్మన్ చెప్పిన Exit, Voice, and Loyalty భావన ఇక్కడ గుర్తుకు వస్తున్నది. ఉద్యోగం లేని యువకుడు నిరుద్యోగాన్ని వదిలి వెళ్లలేడు. ఖరీదైన చదువును భరించలేని విద్యార్థి తన పరిస్థితి నుంచి బయటపడలేడు. రద్దయిన పరీక్షతో పోయిన సంవత్సరాన్ని తిరిగి తెచ్చుకోలేడు. అప్పుడు అతని చేతిలో మిగిలేది ఒక్కటే గొంతెత్తడం.
సీజేపీ: ఇప్పుడు ఉద్యమానికి మైక్ కాదు… మొబైల్ చాలు:
సీజేపీ చుట్టూ కనిపిస్తున్న కొత్త తరహా యువజన సమీకరణం ఈ మారుతున్న రాజకీయ స్వభావానికి సంకేతం. దీనికి ఒకే నాయకుడు ఉండకపోవచ్చు. ఒకే కార్యాలయం ఉండకపోవచ్చు. సంప్రదాయ రాజకీయ పార్టీలా హైరార్కీ ఉండకపోవచ్చు. కానీ సోషల్ మీడియా ఉన్నది. వైరల్ వీడియోలు ఉన్నాయి. మీమ్స్ ఉన్నాయి. వ్యంగ్యం ఉన్నది. వాట్సాప్ ఉన్నది. టెలిగ్రామ్ ఉన్నది. ఉద్యోగార్థుల నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక కొత్త తరహా రాజకీయ వేదికగా మారాయి. పేపర్ లీకులు, పరీక్షల విశ్వసనీయత, ఉద్యోగాలు, నియామకాలు, నిరుద్యోగం, సంస్థలపై నమ్మకం, ఇవన్నీ యువత భవిష్యత్తుతో ముడిపడిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఒక్కొక్కటిగా కాకుండా ఒకే సమస్యగా కనిపించడం మొదలైతే, డిజిటల్ ఉద్యమం మరింత పెద్ద రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉన్నది. గతంలో ఉద్యమం మొదలుపెట్టాలంటే సభ పెట్టాలి. ఈ రోజు ఒక మె సేజ్ చాలు. ఒక ఉద్యోగార్థి ఫోన్లో పెట్టిన వీడియో లక్షల మందికి చేరుతున్నది. ఒక హ్యాష్‌ట్యాగ్ గంటల్లోనే జాతీయ చర్చగా మారుతున్నది. ఒక వైరల్ పోస్టు ఒకప్పుడు వేల కరపత్రాలు చేయాల్సిన రాజకీయ పనిని కొన్ని గంటల్లో చేస్తున్నది.
సీజేపీ లేదా ఏ ఒక్క యువజన ఉద్యమం నేరుగా నరేంద్ర మోదీని లేదా బీజేపీని ఓడిస్తుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు. భారత ఎన్నికలు ఒక్క సమస్యతో నిర్ణయించలేరు. కులం, ప్రాంతం, సంక్షేమం, నాయకత్వం, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సమస్యలు, జాతీయ అంశాలు, అన్నీ కలిసి ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. అయినా చరిత్ర ఒక హెచ్చరిక ఇస్తున్నది. జేపీ ఉద్యమం తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయారు. అన్నా ఉద్యమం తర్వాత యూపీఏ2పై నమ్మకం దెబ్బతిన్నది. కేజ్రీవాల్ కొత్త రాజకీయ శక్తిగా ఎదిగారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా వచ్చిన మార్పు ఆకాంక్షను మోదీ, బీజేపీ తమవైపు తిప్పుకొన్నారు.
ఇప్పుడు NEET, UGC-NET, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, వీళ్ల సమస్యలు ఒకే రాజకీయ కదనంగా కలిసే పరిస్థితి వస్తే? పేపర్ లీక్ ఒక ఘటన కాదు, వ్యవస్థ వైఫల్యం అని భావిస్తే? నియామకాల ఆలస్యం ఒక పరిపాలనా సమస్య కాదు, యువత భవిష్యత్తుపై నిర్లక్ష్యం అని భావిస్తే? నిరుద్యోగం ఒక ఆర్థిక గణాంకం కాదు, ప్రభుత్వ వైఫల్యానికి కొలమానం అని భావిస్తే? అప్పుడు దాని రాజకీయ ప్రభావం చాలా పెద్దదిగా ఉండొచ్చు. సీజేపీ తప్పనిసరిగా ఎన్నికల పార్టీ కావాల్సిన అవసరం కూడా లేదు. అది సమస్యను నిర్వచించగలదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే రాజకీయ ఎజెండాను సెట్ చేయగలదు. మార్పు కోసం ప్రజల్లో డిమాండ్ పెంచగలదు.
చివరికి ప్రశ్న ఒక్కటే: ఆగ్రహాన్ని ఎవరు తమ రాజకీయ శక్తిగా మలుచుకుంటారు?
తెలంగాణలో ఇప్పుడు మరో రాజకీయ దశ మొదలయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్న భావన యువతలో పెరిగి, అది క్రమంగా రాజకీయ అసంతృప్తిగా మారింది. యువత ఆగ్రహం ఎవరి సొత్తూ కాదు. ఆగ్రహం ఒక రాజకీయ ఖాళీని సృష్టిస్తుం ది. ఆ ఖాళీని ఎవరు నింపుతారో వారికి రాజకీ య లబ్ధి కలుగుతుందనే విష యం చారిత్రక సత్యం. నాయకత్వం, సంస్థాగత బలం, విశ్వసనీయత, ప్రత్యామ్నాయ వ్యవస్థ, యువత లోని ఆక్రోశానికి తోడైతే, అది ఉద్యమరూపం దాలుస్తుంది. కేసీఆర్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ మార్పునకు సాధనంగా చూసిన యువత తో మళ్లీ నమ్మక సంబంధం నిర్మించాలి. కేసీఆర్‌కు ఉన్న అతిపెద్ద రాజకీయ బలం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. ఆయన తెలంగాణను వారసత్వంగా పొందలేదు. తెలంగాణను సాధించడమే తన రాజకీయ జీవితానికి ప్రధాన లక్ష్యం గా పెట్టుకుని పోరాడారు.
2001లో టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి 2009 నిరాహార దీక్ష వరకు, విద్యార్థుల భాగస్వామ్యం నుంచి జాతీయ రాజకీయ ఒత్తిడి వరకు సాగిన ఆ ప్రయాణం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యా యం. కానీ ఇప్పుడు కొత్తతరాన్ని గెలుచుకోవాలంటే ఆ చరిత్రను భవిష్యత్తుతో కలుపాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ కోసం పోరాడిన తరం ఒకటి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోనే పుట్టి పెరిగిన తరం మరోటి. రెండో తరానికి తెలంగాణ సాధన ఒక చరిత్ర. వాళ్లకు తెలంగాణ ఒక ఇప్పటికే ఉన్న వాస్తవం. వాళ్ల ప్రశ్నలు వేరు. అందుకే బీఆర్ఎస్ గతాన్ని గుర్తుచేయడంతో పాటు తెలంగాణ భవిష్యత్తుకు ఒక కొత్త రాజకీయ బ్లూ ప్రింట్ ఇవ్వాలని యువత కోరుకుంటున్నది. కేసీఆర్ చరిత్ర రాజకీయ సంభాషణను మళ్లీ తెరపైకి తీసుకురాగలదు. బీఆర్ఎస్ రాజకీయ సందేశం గతాన్ని గుర్తుచేస్తూనే భవిష్యత్తును చూపించేదిగా ఉండాలని మేధావులు భావిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడాం. తెలంగాణ సాధించాం. తెలంగాణను నిర్మించాం. ఇప్పుడు కొత్త తరానికి తగిన తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సిన సమయం వచ్చిందని చెప్పగలిగే సాహసం, ఆ మాటను నిజం చేసే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదనేది చారిత్రక సత్యం.
యువత నిరుద్యోగం
యువత నిరుద్యోగం ఒక గణాంకం కాదు. ఒక అనుభవం. యువత నిరుద్యోగాన్ని ప్రభుత్వం ఒక శాతంగా చూపించవచ్చు. కానీ యువత దానిని గణాంకంగా చూడరు. వారికి నిరుద్యోగం అంటే రద్దయిన పరీక్ష, ఆలస్యమైన నోటిఫికేషన్, రాని స్కాలర్షిప్, చెల్లించలేని కాలేజీ ఫీజు, కోచింగ్ కోసం తీసుకున్న అప్పు, వృథా అయిన సంవత్సరం, కుటుంబంపై పెరుగుతున్న భారం. అన్నింటికంటే ముఖ్యంగా వాయిదా పడుతున్న తమ భవిష్యత్తు. అందుకే యువత రాజకీయంగా కోరుకునేది చాలా సింపుల్..విద్య ఉండాలి, నైపుణ్యం రావాలి, ఉద్యోగం పొందాలి, ఆదాయం రావాలి భద్రత ఉండాలి, జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం ఉండాలి. ఈ గొలుసులో ఒక్కో లింక్ తెగిపోతే నిరాశ పెరుగుతుంది. చాలామందికి ఒకేసారి ఇదే అనుభవం ఎదురైతే ఆ నిరాశ సామూహికం అవుతుంది. సామూహిక నిరాశ నెట్‌వర్క్‌లను సృష్టిస్తుంది. నెట్‌వర్క్‌లు సంఘటితమైతే రాజకీయ ఒత్తిడి మొదలవుతుంది.
అక్కడి నుంచే ఉద్యమం పుడుతుంది. యువతను కేవలం ఒక ఓటుబ్యాంక్‌గా చూసే ప్రతీ ప్రభుత్వం రాజకీయంగా పెద్ద తప్పు చేస్తున్నట్టే. యువత ఓటుబ్యాంక్ కాదు. యువత ఒక అంచనా, ఒక ఆశ, ఒక భవిష్యత్తు. వాళ్లు అడిగేది చాలా చిన్న ప్రశ్నలు. చదువుకోగలనా? చదువు ఖర్చు భరించగలనా? పరీక్షను నమ్మగలనా? ఉద్యోగం వస్తుందా? వ్యాపారం మొదలుపెట్టగలనా? నా కష్టానికి విలువ ఉంటుందా? నా భవిష్యత్తు ఎక్కడ ఉన్నది? జాన్ రాల్స్ చెప్పినట్టు, Justice is the first virtue of social institutions. ఈ రోజు యువతకు న్యాయం అంటే పెద్ద పెద్ద సిద్ధాంతాలు కాదు. పరీక్ష సక్రమంగా జరుగాలి. నియామకం పారదర్శకంగా ఉండాలి, హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి, అర్హత ఉన్నవారికి అవకాశం దక్కాలి, కష్టపడే యువతకు భవిష్యత్తు కనిపించాలి.
చంద్రగుప్తుడి నుంచి సీజేపీ దాకా చరిత్ర మనకు ఒకటే చెప్తున్నది. యువత శాశ్వతంగా ఏ నాయకుడి సొత్తూ కాదు. శాశ్వతంగా ఏ రాజకీయ పార్టీ సొత్తూ కాదు. శాశ్వతంగా ఏ సిద్ధాంతానికీ బానిస కాదు. తన భవిష్యత్తుకే చెందుతుంది. ప్రభుత్వాలు హామీలతో యువతను తమవైపు తిప్పుకోవచ్చు. కానీ పనితీరుతో మాత్రమే వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోగలవు.
హామీ నెరవేరకపోతే నిరాశ వస్తుంది. నిరాశ ఆగ్రహంగా మారుతుంది. ఆగ్రహం సామూహికమైతే శక్తిగా మారుతుంది. శక్తి సంఘటితమైతే ఉద్యమంగా మారుతుంది. ఉద్యమానికి రాజకీయ దిశ దొరికితే, చరిత్రలో ఎన్నోసార్లు జరిగినట్టే, ఎంతటి బలమైన ప్రభుత్వమైనా ప్రజల కొత్త తీర్పును ఎదుర్కోవాల్సి రావచ్చు. గాంధీజీ చెప్పిన The future depends on what you do today. అనే మాట ప్రతీ ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక హెచ్చరిక. తదుపరి రాజకీయ మార్పు పార్లమెంట్లోనో, అసెంబ్లీలోనో మొదలవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక యూనివర్సిటీ క్లాస్రూమ్లోనో, ఒక హాస్టల్లోనో, ఒక కోచింగ్ సెంటర్లోనో, ఒక పరీక్షా హాల్లోనో, ఒక యువకుడి చేతిలోని స్మార్ట్‌ఫోన్ నుంచే మొదలవచ్చు. ప్రతి ప్రభుత్వం భయపడాల్సిన ప్రశ్న ఒక్కటే మా భవిష్యత్తుపై నమ్మకం పెట్టుకోమన్నారు. మరి మా భవిష్యత్తుతో మీరు ఏం చేశారు?
తెలంగాణలో ఇప్పుడు మరో రాజకీయ దశ మొదలయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్న భావన యువతలో పెరిగి, అది క్రమంగా రాజకీయ అసంతృప్తిగా మారింది. యువత ఆగ్రహం ఎవరి సొత్తూ కాదు. ఆగ్రహం ఒక రాజకీయ ఖాళీని సృష్టిస్తుంది. ఆ ఖాళీని ఎవరు నింపుతారో వారికి రాజకీయ లబ్ధి కలుగుతుందనే విషయం చారిత్రక సత్యం. నాయకత్వం, సంస్థాగత బలం, విశ్వసనీయత, ప్రత్యామ్నాయ వ్యవస్థ, యువతలోని ఆక్రోశానికి తోడైతే, అది ఉద్యమరూపం దాలుస్తుంది.
పెండ్యాల మంగళాదేవి