హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న ఆర్థిక సాయం రూ.5 లక్షలు సరిపోవడం లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గురువారం ‘ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వ నిధులు’ అంశంపై ప్రశ్నోత్తరాల చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణ కార్మికుల సమస్య ఉందని, ఇంటి నిర్మాణానికి మేస్త్రీలు, లేబర్ చార్జీలు కలిపి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అవుతున్నదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంటి నిర్మాణ సామగ్రి, ఇసుక, ఐరన్ ధర పెరుగడంతో రూ.6 లక్షల్లో పూర్తయ్యే ఇంటి నిర్మాణ వ్యయం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు చేరిందని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ 750 స్కేర్ ఫీట్లు ఉంటే బిల్లు ఆగుతున్నదని, తొలి విడతకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని కొంతమంది ఫోర్‌వీలర్ కొని ట్యాక్సీలు నడుపుకోవడానికి హైదరాబాద్ వచ్చారని ఆయన గుర్తుచేశారు. పలుచోట్ల అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారని మండిపడ్డారు. లబ్ధిదారుల్లో అనేకమంది పెరిగిన ధరలకు భయపడి ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం లేదని, పనులు ప్రారంభించిన వారు భార్యల బంగారం కుదువ పెట్టి, అప్పులు తెచ్చి ఇండ్లు కట్టుకునే దుస్థితి ఉన్నదని చెప్పారు. కొంతమంది అర్హులైన పేదవారికి ఇంటి స్థలాలు లేవని, వారి విషయంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.
మంత్రి పదవి ఇచ్చేది అధిష్ఠానమేనని, సీఎం రేవంత్‌రెడ్డి కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇస్తామని గతంలో అధిష్ఠానం మాట ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం, నేను ఎప్పుడూ తిట్టుకోవాలని కొందరు చూస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో నాకు అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని, మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు అని చెప్పడం తన నైజం అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మంత్రి పదవి కోసం రేవంత్‌రెడ్డితో రాజీ చేసుకున్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం సీఎంను కలిశానని, నియోజకవర్గంలో అభివృద్ధి జరుగాలంటే సీఎం, డిప్యూటీ సీఎంలను కలువాల్సిందేనని చెప్పారు. సీఎంను కలిస్తే కంప్రమైజ్ అని, కలువకపోతే గ్యాప్ పెరిగిందటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని తెలిపారు. కొండా సురేఖ విషయంలో సీఎం హర్ట్ అయ్యారని, వీక్ అయితానని అధినాయకత్వంతో చెప్పుకొని ఉంటారని పేర్కొన్నారు. కొండాపై అధిష్ఠానానికి సీఎం చెప్పుకోవడంలో తప్పేమీ లేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఇవ్వడానికి, మిగిలిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆనందేశి రాఘవేందర్, బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్లో ఉన్న టీఎస్ఐడీసీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మేది వినోద్ రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. ఫోన్‌పే ద్వారా రూ.5,000 తీసుకున్నారు. సెక్రటేరియట్లో బాధితుడి నుంచి గురువారం రూ. లక్ష తీసుకునే క్రమంలో వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు నిందితుల నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు 1వ అదనపు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు.