దుబాయ్: మహిళల ఆసియా కప్‌లో ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్.. ఆ దిశగా మరో అడుగు ముందుకేస్తూ టోర్నీ చరిత్రలో పదో సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ముగిసిన తొలి సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. టీమిండియా నిర్దేశించిన 150 పరుగుల ఛేదనలో.. స్పిన్నర్ల ధాటికి బంగ్లా 109/7కే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్ ఇన్ బ్లూ..
షెఫాలి వర్మ (40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) అర్ధశతకానికి తోడు హర్మన్‌ప్రీత్ కౌర్ (24 నాటౌట్), రిచా ఘోష్ (21) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. బంగ్లా తరఫున షోర్నా అక్తర్ (22), దిలారా అక్తర్ (21) టాప్ స్కోరర్లు. దీప్తి శర్మ (3/26), తెలుగమ్మాయి శ్రీచరణి (1/14), ప్రేమ (1/21) స్పిన్ మాయకు 2018 చాంపియన్లు ధాటిగా ఆడలేకపోయారు. శుక్రవారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరిగే రెండో సెమీస్‌లో గెలిచే విజేతతో భారత్ ఈనెల 13న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
షెఫాలి మెరుపులు
టోర్నీలో మంచి టచ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మందాన (2) రెండో ఓవర్లోనే ఔటై నిరాశపరిచినా షెఫాలి మాత్రం ధాటిగా ఆడింది. వ్యక్తిగత స్కోరు 1, 11 వద్ద బంగ్లా ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. సుల్తానా ఖటున్ వేసిన నాలుగో ఓవర్లో స్ట్రెయిట్, లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్‌లు బాదింది. రబేయ ఓవర్లో ప్రతీక (20) సైతం బంతిని స్టాండ్స్‌లోకి పంపడంతో పవర్‌ప్లేను భారత్ 45/1తో ముగించింది.
అయితే రబేయనే వేసిన పదో ఓవర్లో షాట్ ఆడబోయిన ప్రతీక.. కవర్స్‌లో దిలారా అక్తర్ చేతికి చిక్కడంతో 50 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరుఫా 11వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన షెఫాలి.. ఫహిమ బౌలింగ్‌లో సింగిల్‌తో ఈ టోర్నీలో రెండో అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. ఆ మరుసటి ఓవర్లో 6, 4, 4తో ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చిన ఆమె.. ఐదో బంతికి డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫర్జానాకు క్యాచ్ ఇవ్వడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆఖర్లో రిచా, హర్మన్ మెరుపులతో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది.

Deepthi Sharma
స్పిన్ దెబ్బకు విలవిల్లాడి..
టీ20ల్లో రికార్డు ఛేదన (ఇప్పటివరకు బంగ్లా అత్యధిక ఛేదన శ్రీలంకపై 146)కు దిగిన నిగార్ సుల్తానా సేన.. భారత స్పిన్నర్ల మాయకు 20 ఓవర్లకు 109/7 మాత్రమే చేయగల్గింది. మొదట చరణి పవర్ ప్లే ఆఖరి ఓవర్లో జువారియ (14)ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచింది. టీ20ల్లో ఈ ఆంధ్రా అమ్మాయికి ఇది 50వ వికెట్. 8వ ఓవర్లో బంతినందుకున్న దీప్తి.. దిలారాను వెనక్కిపంపింది. పది ఓవర్లకు ఆ జట్టు స్కోరు 46/2 మాత్రమే. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్.. బంతిని ప్రేమ, షెఫాలి, దీప్తి, చరణికే ఇవ్వడంతో బంగ్లా వేగంగా ఆడలేకపోయింది. భారీ ఆశలు పెట్టుకున్న శోభనా మోస్త్రి (18) కూడా దీప్తి 14వ ఓవర్లో వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అవగా నిగార్(19)ను ప్రేమ ఔట్ చేసింది. లోయరార్డర్లో షోర్నా మెరుపులతో ఆ జట్టు వంద పరుగుల మార్కును దాటగలిగింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లకు 149/6 (షెఫాలి 64, హర్మన్‌ప్రీత్ 24*, సుల్తానా 2/30, రబేయ 1/22); బంగ్లాదేశ్: 20 ఓవర్లకు 109/7 (షోర్నా 22, దిలారా 21, దీప్తి 3/26, నందని 2/10)