అంతర్జాతీయంగా రగులుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ జ్వాలలు ఇకడి మహానగర రోడ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని, బిటీ మెటీరియల్ కొరత ఏర్పడింది. గడిచిన పది రోజులుగా సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరంలో రోడ్ల మరమ్మతులు, కొత్త బీటీ రోడ్ల నిర్మాణ పనులు ఎకడికకడ పడకేశాయి. ఎంతలా అంటే ట్రై కార్పొరేషన్లలో కొత్త బీటీ రోడ్ల నిర్మాణ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రానంతగా.. ఈ నేపథ్యంలోనే సీఎంసీ, ఎంఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లలో బీటీ రోడ్ల పనుల టెండర్లు వరుసగా ఆరు సార్లు పిలిచినా.. స్పందన లేకపోవడమే ఇందుకు నిదర్శనం.
సిటీబ్యూరో, సెప్టెంబరు 10 (నమస్తే తెలంగాణ) : నగరంలో బీటీ మెటీరియల్ కొరతతో రోడ్ల మరమ్మతుల్లో జాప్యం జరుగుతున్నదని స్వయంగా ఇంజినీర్లు కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రత్యామ్నాయ చర్యలు లేకపోగా.. కనీసం పేమెంట్ల జారీపై తమిళనాడు రాష్ట్ర తరహాలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ట్రై కార్పొరేషన్ల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారి వాహనదారులకు ముప్పు తిప్పలకు గురి చేస్తున్నది. భారీగా ఏర్పడిన గుంతలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యవసర రోడ్డు మరమ్మతులకు వాడే షెల్ మ్యాక్ బ్యాగులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో రోడ్లు అధ్వానంగా మారాయి.
పది రోజులుగా నిలిచిన సరఫరా
చైన్నె, ఎక్కువగా వైజాగ్ నగరంలోని ప్లాంట్ల నుంచి నగరానికి అందాల్సిన బీటీ మెటీరియల్ గత పది రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది. యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయ మారెట్లో ముడిచమురు ధరలు పెరగడం, దిగుమతులు నెమ్మదించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాంట్రాక్టర్ల వద్ద నిల్వలు లేకపోవడంతో ఇప్పటికే ప్రారంభించిన రోడ్డు పనులు సగంలోనే ఆగిపోయాయి. అంతేకాకుండా ఒకప్పుడు కిలో బీటీ రూ.43లకు లభిస్తే ..యుద్దం కారణంగా ఇప్పుడు రూ. 82లకు చేరింది. ఒక్కో ట్యాంకర్ రూ.30 లక్షల వరకు అవుతుందని, ఈ భారం కాంట్రాక్టర్ మోసే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ప్లాంట్ల వద్ద గంటల తరబడి వేచి చూసిన తర్వాత స్టాక్ అయిపోయింది అని చెప్పి వాహనాలను వెనకి పంపేస్తున్నారని, దీనివల్ల సమయం, డీజిల్ వృథా కావడమే కాక పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. .అటూ ఇటూగా మెటీరియల్ వచ్చినా, వేళ్లమీద లెకపెట్టే కొన్ని వాహనదారులకే పరిమితంగా ఇస్తున్నారని, ఇది ఏమాత్రం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
స్పందన కరువు… కాంట్రాక్టర్ల వెనుకంజ
మరమ్మతుల కోసం అధికారులు పిలుస్తున్న టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి కనీస స్పందన కరువైంది. బిటుమిన్ ధరలు విపరీతంగా పెరగడం, మెటీరియల్ దొరకకపోవడంతో నష్టాలు వస్తాయనే భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ట్రై కార్పొరేషన్ పరిధిలో కొన్ని పనులకు సంబంధించి ఏకంగా ఆరు సార్లు టెండర్లు పిలిచినా ఒక కాంట్రాక్టర్ కూడా టెండర్ దాఖలు చేయకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులకు, కమిషనర్లకు నివేదించారు.
పెండింగ్లో ఉన్న పాత ఫిర్యాదులను పరిషరించాలన్నా, వీఐపీ రోడ్లను రాకపోకలకు వీలుగా మార్చాలన్నా తక్షణమే సరిపడా బిటి మెటీరియల్, షెల్ మ్యాక్ బ్యాగులను సరఫరా చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి తీవ్ర సంక్షోభం తలెత్తినా సరారు ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పనులకు అవసరమైన బీటీని ప్రత్యేకంగా తెప్పించేందుకు ‘గ్రీన్ ఛానెల్’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
నరకప్రాయంగా ప్రయాణం
ప్రభుత్వ నిర్లక్ష్యం, అంతర్జాతీయ పరిణామాల మధ్య నగర రోడ్లు దారుణంగా తయారయ్యాయి. వర్షాలు, తాజా పరిస్థితి కారణంగా రహదారులపై గుంతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాహనదారులు, బాటసారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు యంత్రాంగాన్ని సరిదిద్దడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. సంక్షోభాన్ని అధిగమించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల్లో బీటీని సరఫరా చేసి రోడ్ల పనులను వేగవంతం చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.