హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో దళితులపై అపారమైన ప్రేమ ఒలకబోస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి..రాహుల్‌గాంధీని ఒప్పించి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసి చేతల్లో నిరూపించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇందుకు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. గడ్డం ప్రసాద్ అంటే తమకు ఎంతో గౌరవమని స్పష్టంచేశారు. ‘దేశంలో ఏ రాష్ట్రంలోనైనా స్పీకర్‌ను అదే హోదాతో గౌరవిస్తారు.. కానీ దళిత స్పీకర్.. బీసీ స్పీకర్..రెడ్డి స్పీకర్ అని ఉండరు.. కానీ తెలంగాణలో మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిని కూడా కులానికి ఆపాదిస్తూ మాట్లాడటం కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నం’అని వ్యాఖ్యానించారు. గడ్డం ప్రసాద్‌కుమార్ కులం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియదని, కానీ మొన్న అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులు పదేపదే ఆయన దళితుడని ప్రస్తావించి అవమానించారని చెప్పారు. వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఎందరో దళితనేతలను అగౌరపరిచిన ఘనత వహించిందని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిశోర్గౌడ్తో కలిసి తలసాని విలేకరులతో మాట్లాడారు.
ప్రజాసమస్యలను లెవనెత్తేందుకు అసెంబ్లీకి వెళ్తున్న కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన వార్తను చూపుతూ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎత్తి చూపారు. ‘1994లో నేను, ఎల్ రమణ ఎమ్మెల్యేలుగా ఉన్నం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో నాతో పాటు మరో నలుగురైదుగురే ఉంటరు.. కానీ ఏనాడూ అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టినట్టు చూడలేదు. ఎప్పుడూ వినలేదు.. కానీ మొదటిసారి రేవంత్‌రెడ్డి హయాంలోనే చూడాల్సి వస్తున్నది’ అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్‌తో కలిసి పనిచేసిన.. కానీ ఇలాంటి విచిత్రమైన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు’ అని ఎద్దేవాచేశారు. మగ ఎమ్మెల్యేల దగ్గర ఆడ పోలీసులు, మహిళా ఎమ్మెల్యేల దగ్గర పురుష పోలీసులను పెట్టడం.. మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి పురుష సభ్యులు దూరారని ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉన్నదని చెప్పారు. అసెంబ్లీ పరిసరాల్లో సెప్టెంబర్ 7న పెద్దసంఖ్యలో పోలీసులను మొహరించడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు. దీనివెనుక ఉన్న కుట్రను అధికారపక్ష సభ్యులే అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని దుయ్యబట్టారు. అసెంబ్లీ బయట నడిరోడ్డుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు పిడిగుద్దులు గుద్ది గాయపరిచారని చెప్పారు. వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకొని ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం బూటకపు నాటకానికి తెరలేపిందని విమర్శించారు.
కేసీఆర్ నివాసం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గర దళితులు డప్పు కొడితే బీఆర్ఎస్ నాయకులు శుద్ధి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు శోచనీయమని తలసాని వాపోయారు. ఎర్రవల్లికి వెళ్లిన తూంకుంట నర్సారెడ్డి.. కుంభం అనిల్ దళితులా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఇంత అడ్డగోలుగా మాట్లాడటం దుర్మార్గమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. సంధ్యారావు అనే సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ పేరును సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ప్యానల్ స్పీకర్‌గా పెట్టి అసెంబ్లీ నడుపడం చూస్తే ఎంతో వింతగా అనిపించిందని తలసాని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కేసీఆర్ కోరుకున్నారని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అద్భుతంగా నిర్మించిన సచివాలయానికి ఆ మహనీయుడి పేరుపెట్టి గౌరవించారని గుర్తుచేశారు. అలాంటి మహానేత చనిపోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సభ్యులు పోలీసులపై దాడిచేశారని చర్చపెట్టిన అధికారపక్షం.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ‘కేసీఆర్ అంటే గౌరవమని కాంగ్రెస్ సభ్యులు చెప్పడం కాదు.. నైతికత ఉంటే ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను సభ నుంచి బహిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు చెందిన ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా అనేక అవినీతి ఆరోపణలు చేశారని తలసాని గుర్తుచేశారు. వాటికి సమాధానం చెప్పాల్సిన రేవంత్‌రెడ్డి వారి ఇంటి పంచాయితీని బీఆర్ఎస్కు రద్దుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే కొండా సురేఖ బిడ్డ చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించి నిజనిజాలు నిగ్గుతేల్చాలని సవాల్ విసిరారు. వెయ్యి రోజుల పాలనావైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు, ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను తప్పించుకొనేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని నిప్పులుచెరిగారు.