హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదట.. పైగా ఈ మూడు రోజుల ఘటనలతో ప్రభుత్వా నికే మంచి పేరొచ్చిందట. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉవాచ. ప్రస్తుత పరిణామాలపై తాను చేయించిన ఫ్లాష్ సర్వేలో ప్రజలు ప్రభుత్వాని కి మద్దతుగా నిలిచినట్టు తేలిందని సెలవిచ్చారు. అసెంబ్లీలో మీటింగ్ హాల్లో గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ప్రజలిచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్లో రాజకీయం గా రాణించలేరని పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. శుక్రవారం 22ఏ నిషేధిత భూములపై అసెంబ్లీలో చర్చ పెడుదామని చెప్పారు. ఈ సందర్భంగా తప్పిదాలను ధరణిపై నెట్టేద్దామని చెప్పినట్టు సమాచారం.
ప్రతిపక్షం కాదు.. ప్రభుత్వమే పలుచనైంది
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మెజారిటీ ఎమ్మెల్యేలు అభ్యంతరం, అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ మూడు రోజుల పరిణామాలతో ప్రతిపక్షం కాదు.. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలుచనైందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. మనం అలా చేసి ఉండాల్సి కాదని మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఘటనలను తప్పుపట్టినట్టు తెలిసింది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ నివాసంపైకి దండయాత్రను ప్రోత్సహించడం కాంగ్రెస్కు తీవ్ర నష్టం చేసినట్టు పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఈ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగిందని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేత, పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంటిపై దాడికి వెళ్లడం ఏందనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమయ్యాయని పలువురు ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలిసింది. ఇక బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం కూడా నష్టం చేసినట్టు తెలిసింది. ఒక అంశాన్ని ఎక్కువగా ఎత్తుకొని, అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనను తేలిగ్గా తీసుకోవడం మహిళా సమాజంలో వ్యతిరేకత పెంచాయని అభిప్రాయపడినట్టు తెలిసింది. మహిళా ఎ మ్మెల్యేలు కంటతడి పెట్టినా పట్టించుకోకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పినట్టు తెలిసింది.
ప్రభుత్వమే పారిపోయిందనే సంకేతాలు
ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, ఆ తర్వాత వారిని సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సింది కాదనే అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రతిపక్షం ఎప్పటినుంచో 22ఏ నిషేధిత భూములు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నీటి హక్కులకు సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. వారిని సస్పెండ్ చేయకుండా ప్రతిపక్ష సభ్యులు సభలో ఉండగానే వీటిపై చర్చ పెడితే బాగుండేదనే చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు చర్చ పెట్టడం వల్ల ఏం లాభమని ప్రశ్నించారని సమాచారం. ప్రతిపక్షాన్ని బయటకు పంపి ప్రభుత్వమే సొంత డబ్బా కొట్టుకుంటుందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందనే ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు చర్చ పెట్టకుండా, వారిని ఎదుర్కోలేక ప్రభుత్వమే పారిపోయిందని ప్రజల్లోకి సంకేతాలు వెళ్తాయని చెప్పినట్టు సమాచారం.