Sircilla | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు భారీగా మోహరించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టుల పరంపర ప్రారంభమైంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, యువజన, విద్యార్థి నేతలు, ఆటోడ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. పలువురిని ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకోగా.. మరికొందరిని రాత్రి నుంచే స్టేషన్లకు తీసుకెళ్లారు.
సీఎం సభలో ఆరు గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, పెండింగ్ బిల్లులు, యూరియా, విద్యుత్, రైతు సమస్యలు, ఆటోడ్రైవర్ల ఇబ్బందులు, మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలపై ప్రశ్నలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక కాలనీలోనూ పోలీసులు భారీగా నిఘా ఏర్పాటు చేశారు. సభకు ప్లకార్డులతో వెళ్లకుండా కార్మిక నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.

Sircilla Kancherla Ravi
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాష్ట్రస్థాయి నాయకుల కదలికలపైనా పోలీసులు దృష్టి సారించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను సీఎంకు వివరించేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్ కూడా పోలీసుల చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఎక్కడా చెప్పలేదు. అయినా ఉదయం నుంచే అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను సీఎంకు చెప్పాలనుకుంటున్నాం. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని నాగరాజు యాదవ్ పేర్కొన్నారు.

Thota Aagaiah
బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటి వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం సభ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణం వైపు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
సిరిసిల్ల పట్టణంలో అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఇంటికి పోలీసులు వెళ్లి ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, సీనియర్ నాయకుడు దిద్ది రాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల కార్మిక కాలనీలో పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. సీఎం సభ సందర్భంగా ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శించవద్దని కార్మిక నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. యువజన నాయకులు, విద్యార్థి నాయకులు సభకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

Vemulawada
వేములవాడ నియోజకవర్గంలోనూ పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. సీఎం సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్న నాయకులను ముందుగానే స్టేషన్లకు తరలించడం కనిపించింది.

Thangallapally
తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన నాయకులను తరలించేందుకు పోలీసు వాహనాలు సరిపోకపోవడంతో టాటా ఏస్ వాహనాలను కూడా వినియోగించారు. మండలంలోని పలువురు నాయకులను రెండు బృందాలుగా విడదీసి తంగళ్లపల్లి, ఇల్లంతకుంట పోలీస్స్టేషన్లకు తరలించారు. తంగళ్లపల్లి మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్యను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Jillella
జిల్లెల్లలో పట్టాల కోసం ఆందోళన చేస్తున్న దళిత రైతులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు.

Yellareddypet1
ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు ఆటోడ్రైవర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలువురిని బలవంతంగా గంభీరావుపేట వైపు తరలించారు. పోలీసుల వాహనంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్ల సమస్యలను సీఎంకు వివరించే అవకాశం లేకుండా తమను అదుపులోకి తీసుకున్నారని నాయకులు పేర్కొన్నారు.
గంభీరావుపేట ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Veernapalli
వీర్నపల్లి మండలంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Mustabad
ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడే ఉంచారు.

Chandurthy1
చందుర్తి మండల బీజేవైఎం అధ్యక్షుడు మోత్కుపల్లి రాజశేఖర్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మండలంలోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

Boienpally
బోయినపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కట్టెరపాక కొండయ్యను కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కొంకటి శేఖర్, దేశాయిపల్లి సర్పంచ్ నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, మన్వాడ సర్పంచ్ కట్ట గోవర్ధన్, బీఆర్ఎస్ యువజన నాయకులు మల్లారపు చందు, దూస మధు, వర్ధవెల్లి మాజీ సర్పంచ్ రాజు, తిరుపతి, తోంటి మధుకర్, నాగుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మోతె ఎల్లారెడ్డి, గురిజాల కోటి, కోనుకటి చంద్రయ్య ఉన్నారని పేర్కొన్నారు.
మేడిపల్లి మండలంలో బీఆర్ఎస్కు చెందిన సర్పంచులు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటన ముగిసే వరకు వారిని స్టేషన్లలోనే ఉంచేలా చర్యలు చేపట్టారు.