హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/కందుకూరు: ఆర్థిక ఇబ్బందులతో ఓ రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన ప్రముఖ రియల్టర్, హోమ్ ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి(49) కొంతకాలంగా హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటూ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. పటాన్చెరు సమీపంలో 280 ఎకరాల్లో భాగస్వాములతో కలిసి వెంచర్ ఏర్పాటు చేశారు.
ఆ భూమికి సంబంధించిన వివాదాలు, లిటిగేషన్లతో వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్టు సమాచారం. అప్పుల బాధ ఎక్కువ కావడంతో నేదునూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాంరెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి బావ ప్రవీణ్‌రెడ్డి కందుకూ రు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృ తదేహాన్ని ఉస్మానియా దవాఖాన కు తరలించారు. ఆత్మహత్య వెనుక ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో తలకిందులైన రియల్టీ
ఒకప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలిచి, పెట్టుబడుల ప్రవాహంతో దేదీప్యమానంగా వెలిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నేడు తీవ్ర గందరగోళం, ఆర్థిక అంధకారంలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పాలసీలతో వ్యాపారం నిలదొక్కుకోలేకపోతున్నది. మౌలిక వసతుల ప్రాజెక్టులపై నెలకొన్న తీవ్ర అనిశ్చితి, అనుమతుల మంజూరులో జాప్యానికి తోడు, అట్టడుగుకు పడిపోయిన క్రయవిక్రయాల కారణంగా నగర రియల్టీ రంగంలో ఆకలి కేకలు, చావుడప్పులు మోగుతున్నాయి. శరవేగంగా దూసుకెళ్లిన స్థిరాస్తి వ్యాపారచక్రం ఒకసారిగా ఆగిపోవడంతో, దశాబ్ద కాలంగా కోట్ల రూపాయల పెట్టుబడులతో వెంచర్లు చేపట్టిన డెవలపర్లు, బిల్డర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చికుకుపోయారు.
ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హోమ్ ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్య ఘటన ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైన రియల్ వ్యాపారానికి అద్దం పడుతుండగా, కూలుతున్న ఆర్థిక పునాదులను తేటతెల్లం చేస్తున్నది. పటాన్చెరు వెంచర్‌కు సంబంధించి ఎదురైన భూ వివాదాలు, రాజకీయ వేధింపులు, అనుమతుల్లో ఆలస్యం రాంరెడ్డిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలుస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు కొనుగోలుదారులను భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుతం 22ఏ నిషేధిత జాబితా కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. పెట్టిన పెట్టుబడులు ఇప్పట్లో వెనక్కి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ అస్పష్టమైన విధానాలు, స్థిరాస్తి రంగానికి సరైన రక్షణ లేకపోవడంవల్లే రాంరెడ్డి వంటి ప్రముఖ వ్యాపారులు బలికావాల్సి వస్తున్నదని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వ్యాపార వర్గాల్లో ధైర్యాన్ని నింపే చర్యలు చేపట్టాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.