న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: అమెరికన్ డాలర్‌ను వదిలివేయాలని బ్రిక్స్ యోచిస్తున్నదా? డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని ఈ కూటమి కనుగొనగలదా? ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శిఖరాగ్ర సదస్సు కోసం బ్రిక్స్ నాయకులు ఈ వారాంతంలో ఢిల్లీలో సమావేశమవుతున్న తరుణంలో ఈ కీలక ప్రశ్నలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2025 బ్రిక్స్ ప్రకటన అమెరికా డాలర్‌ను నేరుగా ప్రస్తావించకుండా దానికి బదులుగా స్థానిక కరెన్సీలలో ఆమోదయోగ్యమైన ఆర్థిక సహాయ యంత్రాంగాల కోసం పిలుపునిచ్చింది.
ఇది సరిహద్దు వాణిజ్య, ఆర్థిక రంగంలో డాలర్ ఆధిపత్యంపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి ఈ కూటమి చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు సంకేతం. ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీని గానీ లేదా డాలర్‌ను భర్తీ చేసే ఉద్దేశపూర్వక అజెండాను గానీ తాము సమర్థించడం లేదని పదేపదే స్పష్టం చేసినప్పటికీ ఈనెల 12, 13 తేదీలలో సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ తన బ్రిక్స్ భాగస్వాములతో డీ-డాలరైజేషన్(డాలర్ రహిత ఆర్థిక వ్యవస్థ)పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ప్రపంచంలో ఆధిపత్యం కలిగిన కరెన్సీగా ఉన్న అమెరికా డాలర్‌ను తొలగించాలని 2025లో బ్రిక్స్ కూటమి స్పష్టంగా ఒత్తిడి చేయలేదు. దీనికి బదులుగా ప్రాజెక్టులు, కార్యక్రమాల కోసం వినూత్న ఆర్థిక పద్ధతులు, విధానాలను సులభతరం చేయడం, విస్తరించడంపై బ్రిక్స్ ఇంటర్‌బ్యాంక్ సహకార యంత్రాంగం దృష్టి సారించడాన్ని కూటమి నాయకులు స్వాగతించారని 2025 శిఖరాగ్ర సదస్సు ప్రకటన పేర్కొంది. స్థానిక కరెన్సీలలో ఆర్థిక పెట్టుబడికి ఆమోదయోగ్యమైన విధానాలను అన్వేషించే ప్రయత్నాలకు కూడా నాటి సదస్సు మద్దతు తెలిపింది. ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీని ప్రతిపాదించడానికో లేదా అమెరికా డాలర్‌ను పూర్తిగా భర్తీ చేయడానికో కాకుండా, వాణిజ్య , ఆర్థిక లావాదేవీల్లో జాతీయ కరెన్సీల వినియోగాన్ని విస్తరించాలని కూటమి విస్తృత అజెండాను ఈ ప్రకటన నొక్కి చెప్పింది.
ఉమ్మడి బ్రిక్స్ కున్సీ విధానం విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నది. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని భారత్ సమర్థించినప్పటికీ ప్రత్యేక బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు మాత్రం ఎప్పుడూ మొగ్గు చూపలేదు. అమెరికా డాలర్ స్థానాన్ని భర్తీ చేయడం భారత్ విధానం కాదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ గత ఏడాది స్పష్టం చేశారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ పాత్ర ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి దోహపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టులో వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక బ్రిక్స్ కరెన్సీకి భారత్ అనుకూలంగా లేదని ఆయన పేర్కొన్నారు. అయితే సరిహద్దు వాణిజ్య, పర్యాటక చెల్లింపులను సులభతరం చేయడానికి బ్రిక్స్ దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను అనుసంధానించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రతిపాదించింది. సులభతరమైన సరిహద్దు లావాదేవీల కోసం బ్రిక్స్ దేశాలు తమ వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలను సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను అనుసంధానించే ఆలోచనలో ఉన్నాయని ఆగస్టులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
వాణిజ్యం, పెట్టుబడులలో యువాన్(చైనా కరెన్సీ) వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా విస్తరించేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆగస్టులో తన పదేండ్ల వ్యూహం కింద ప్రణాళికలను వెల్లడించింది. ఈ కరెన్సీ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసేటపుడే మారకపు రేటు స్థిరత్వాన్ని కూడా కాపాడాలని ఆ కేంద్ర బ్యాంక్ యోచిస్తున్నది. అయితే రష్యా మాత్రం పాశ్చాత్య ఆంక్షలు , డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అందుబాటుపై ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే తాము అధికారికంగా డాలర్ రహిత ఆర్థిక లావాదేవీలను సమర్థించడం లేదని రష్యా పేర్కొన్నట్లు తెలుస్తున్నది. రష్యా డీ-డాలరైజేషన్‌కు ప్రయత్నించడం లేదని, ఆమోదయోగ్యమైన ఏ చెల్లింపు పద్ధతికైనా సిద్ధంగా ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈనెల 8న అన్నారు. ఢిల్లీలో జరుగనున్న బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని భావిస్తున్న కొన్ని రోజుల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బ్రిక్స్ సదస్సు కోసం బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లతో ఢిల్లీ సంసిద్ధంగా ఉంది. భారత్ మండపంలో జరిగే ఈ సదస్సులో అనేక దేశాలకు చెందిన ఉన్నత స్థాయి నాయకులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. శిఖరాగ్ర సదస్సును దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన భద్రతా, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. భద్రత నిర్వహణ కోసం మొత్తం 7,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించగా నగరవ్యాప్తంగా వాహనాల రాకపోకలను 4,800 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తారు.
కొన్ని రోజులుగా నెలకొన్న దౌత్య పరమైన ఉత్కంఠకు తెర దించుతూ తమ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా ప్రభుత్వం గురువారం ధ్రువీకరించింది.