ముంబై, సెప్టెంబర్ 10: ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ క్రమేణా బలహీనపడుతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నానాటికీ దిగజారుతున్నది. గత 4 రోజుల్లో 109 పైసలు పడిపోవడం గమనార్హం. గురువారం ఒక్కరోజే 44 పైసలు క్షీణించగా, బుధవారం 34 పైసలు పతనమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు రూపీ ఎక్సేంజ్ రేటు 95.52 వద్దకు పరిమితమైంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 102 డాలర్ల మార్కును దాటేసింది.
ఇది రూపాయి విలువను గట్టిగానే దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం భయాలు, కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు ప్రభావితం చేసినట్టు చెప్తున్నారు. హొర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకలకు అంతరాయం.. రూపీపై ఒత్తిడిని పెంచుతున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగింది మరి. రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నకొద్దీ డాలర్ వాల్యూ పెరుగుతూపోతున్నది.
పశ్చిమాసియా సంక్షోభం తీవ్రతరమైతే రూపాయి మారకం విలువ మళ్లీ రికార్డు కనిష్ఠానికి చేరడం ఖాయమనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలైన సంగతి విదితమే. దాదాపు ఆరున్నర నెలలుగా మిడిల్ ఈస్ట్ వార్ కొనసాగుతూనే ఉన్నది. ఉద్రిక్తతలు పెరిగినప్పుడు రూపాయి నష్టపోతుండగా, తగ్గినప్పుడు కోలుకుంటున్నది.
ఈ క్రమంలోనే మే 20న మునుపెన్నడూ లేనివిధంగా 96.86 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 97 మార్కును సమీపిస్తూ 96.95 దగ్గరకు చేరింది. దీంతో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.. రూపాయిని మరోసారి తీవ్రంగానే దెబ్బతీయవచ్చన్న అంచనాలున్నాయి. ఈ 4 రోజుల నష్టాలు వాటికి మద్దతిస్తుండగా.. గల్ఫ్ వార్పైనే అంతా ఆధారపడి ఉన్నదని అంటున్నారంతా.
రూపాయి నష్టాలు.. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసేలా ఉన్నాయి. కరెన్సీ మార్కెట్లో రూపీ మారకం విలువ పడుతున్నకొద్దీ దేశంలోకి వచ్చే ముడి చమురు సహా అన్నింటి చెల్లింపులూ భారమవుతున్నాయి. ఈ పరిస్థితి జీడీపీ, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం, ఉత్పాదకత, విదేశీ మదుపర్ల పెట్టుబడులు, కీలక రంగాలకు దెబ్బే. నిజానికి రూపీ బలోపేతానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నా.. అవి అంతగా ఫలించకపోవడం ఇప్పుడు కలవరపెడుతున్నది. మొత్తానికి గల్ఫ్‌లో నెలకొన్న అశాంతి.. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారింది.