ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 10 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై గురువారం జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరెంట్ కోతలు, యూరియా సమస్యపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు అధికారులను నిలదీశారు. గుండారం, అల్మాస్పూర్లో కరెంటు కోతలపై కాంగ్రెస్ సర్పంచ్‌లు ముడావత్ సరోజ, నాగెల్లి వెంకట్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సర్పంచులై ఉండి ఏం చేస్తున్నారని తమను రైతులు, గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రామాల్లో యూరియా సమస్యలు, యాప్‌తో పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ సర్పంచ్‌లు అందె సుభాష్, బాల్రాజ్నర్సాగౌడ్, అజ్మీరా తిరుపతినాయక్ అధికారులను నిలదీశారు. సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు.