సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఈక్విటీ వాటాల విక్రయ ప్రక్రియలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘ఎల్అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌లో తనకు ఉన్న మొత్తం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు విక్రయించే ఒప్పంద ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. సంబంధించిన డెడ్‌లైన్‌ను ఎల్అండ్ టీ సంస్థ మరోసారి పొడిగించింది. ఈక్విటీ అమ్మకపు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు సెబీకి ఓ నివేదికలో పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులోని తన మొత్తం వాటాలను రూ. 1,461.47 కోట్లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు బదిలీ చేసేందుకు ఎల్అండ్టీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లావాదేవీల ప్రక్రియ ముగింపునకు సంబంధించి గతంలో సెప్టెంబర్ 19 ఉంటే, దాన్ని సెప్టెంబర్ 30 వరకు విధించుకున్న డెడ్ లైన్ ముగిసింది. సమయం చాలక గడువును మరో మూడు నెలల పాటు పెంచుకోవాల్సి వచ్చింది. వాటాల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఆర్థిక, చట్టపరమైన లావాదేవీలు పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుండటంతోనే సెబీకి సమాచారమిచ్చి ఈ గడువును డిసెంబర్ చివరి వరకు విస్తరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
స్పష్టతలేని టేకోవర్ ప్రక్రియ..
రుణాల సర్దుబాటు విషయంలో సర్కారు నుంచి ఎలాంటి స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో.. టేకోవర్ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం కోరుతున్న రూ. 15వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తే గానీ ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు. కనీసం సర్కారు ఈ విషయంలో ఏడాది కాలంగా రుణ సంస్థలను కూడా ఖరారు చేయలేకపోయింది. సర్కారు నిర్లక్ష్యంతో నెలవారీగా ఎల్ అండ్ టీ మోయాల్సిన ఆర్థిక భారం గుదిబండగా మారుతుందనే విమర్శలు ఉన్నాయి.