నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అత్యంత కీలకమైనది. ఒకరకంగా చెప్పాలంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాతే పెద్ద సంఖ్యలో పేద పిల్లలకు ఉన్నత విద్య చేరువైంది. అంతటి గొప్ప పథకానికి రేవంత్ సర్కార్ మెల్లగా తూట్లు పొడుస్తున్నది. కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, జవాబుదారీతనం లోపించిందని సాకులు చెప్పి విద్యార్థులే కళాశాలలకు ఫీజు చెల్లించేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవోను తీసుకొచ్చింది. విద్యార్థులకు ప్రభుత్వం డబ్బులిస్తుందని, ఆ డబ్బులను పిల్లలు కాలేజీలో కట్టాలని ఆ జీవో సారాంశం. తద్వారా, లేని విద్యార్థులు ఉన్నట్టు చూపిస్తున్న పలు కాలేజీల అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని, విద్యార్థులే చెల్లింపులు చేయడం ద్వారా తల్లిదండ్రులకు కళాశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నించే హక్కు పెరుగుతుందని సర్కార్ వాదన. పాలక పెద్దలు కాగితాల మీద వింత వాదనలతో సమర్థించుకుంటున్నా జీవో అమల్లో మాత్రం విద్యార్థులకు సంకటంగా మారే అవకాశం ఉన్నది.
కొత్త నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం విద్యార్థుల ఖాతాలో డబ్బులు పడిన 7 పనిదినాల్లోగా విద్యార్థులు ఆ మొత్తాన్ని సంబంధిత కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించని విద్యార్థులపై కాలేజీలు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశాన్ని ఈ జీవోతో కల్పించారు. చదువుకునే విద్యార్థులను నేరస్తులుగా చూసేలా ఈ నిబంధన తేవడం రేవంత్‌రెడ్డికి తెలంగాణలోని పేదపిల్లల పట్ల ఉన్న చిన్నచూపునకు స్పష్టమైన నిదర్శనం.
ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసే పరిస్థితులే ఉంటే ఏ ఇబ్బందీ లేదు. కానీ వాస్తవంలో అలా ఉన్నదా? ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిల కోసం కాలేజీలు ప్రభుత్వం మీద, ఫీజులు చె ల్లించాలని విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థులకు పరీ క్షలకు ముందు హాల్‌టికెట్లు, ఉత్తీర్ణులైన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేసుకోవడానికి కాలేజీలకు కొత్త జీవో.. ఓ ఆయుధంగా మారే ప్రమాదం ఉన్నది.
ప్రభుత్వం కొత్త జీవో ప్రకారం.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేసే వరకు కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాలేజీలు అలా ఆగేందుకు సిద్ధపడే పరిస్థితే ఉంటే.. బకాయిల గురించి ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? అందుకే ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా, మరోవైపు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోనివ్వకుండా చేస్తే తాము కాలేజీలను ఎలా నడుపాలని పేర్కొన్నాయి. హైకోర్టు కూడా ఈ వాదనను సమర్థించింది. విద్యార్థుల నుంచి కాలేజీలు ముందస్తుగా ఫీజులు వసూలు చేయకూడదన్న ప్రభుత్వ నిబంధనలపై స్టే విధించింది. సర్కార్ డబ్బులు ఇవ్వకపోతే, విద్యార్థులు ఫీజులు కట్టకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్నే ఎదురు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను కాదని, కాలేజీలు ఫీజులు అడగకూడదంటూ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కూడా ధర్మాసనం హెచ్చరించింది.
హైకోర్టు ఆదేశాల్లోని అంతరార్థం ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయాలి. కానీ, ప్రభుత్వం, కాలేజీలు దీనిని అర్థం చేసుకుంటాయా? ప్రభుత్వం సమయానుసారం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తుందా..? అంటే ఆ ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. అంతిమంగా హైకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకొని కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, ఒకవేళ విద్యార్థుల నుంచి ముందే ఫీజులను వసూలు చేస్తే .. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక విద్యార్థులకు వారి డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలన్న నిబంధన ఉన్నది. కానీ, కాలేజీలు అంత ఈజీగా డబ్బులు చెల్లిస్తాయా? ముందే ఫీజు కట్టాలనడం పేదలపై భారం మోపడం కాదా? రీయింబర్స్మెంట్ నిధులు ఎలాగైనా విద్యార్థుల ఖాతాల్లోకే వస్తాయి కనుక ముందే ఫీజులు చెల్లించాలని ఇప్పటికే కాలేజీలు పట్టుబడుతున్నాయి.
ఇక దీంట్లో మరో కోణం కూడా దాగి ఉన్నది. పేద కుటుంబాల విద్యార్థుల ఖాతాల్లో ఒక్కసారిగా వేల రూపాయల ఫీజు జమ అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు వారం రోజుల్లోపు మళ్లీ సర్దుబాటు చేయవచ్చు, ఆ డబ్బును సొంత అవసరాల కోసం వాడుకోవచ్చు. మళ్లీ డబ్బు సర్దుబాటు కాకపోతే విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి రావచ్చు. విద్యార్థులను ఫీజులను ముందే చెల్లించేలా చేయడం ద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చే ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చని ఆ తర్వాత ప్రభుత్వం రీయింబర్స్మెంట్ పథకాన్ని క్రమక్రమంగా నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.
కాలేజీల అక్రమాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోకుండా, మౌలిక వసతులపై మెరుగైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయకుండా విద్యార్థులపై భారాన్ని నెట్టి, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. విద్యకు ప్రాధాన్యం ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంలేదు. ఇప్పటికైనా బకాయిలను విడుదల చేస్తూ కాలేజీలపై భారాన్ని, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలి. కాలేజీలు విద్యార్థుల నుంచి ముందే ఫీజులు వసూలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే పేద పిల్లలు భయం లేకుండా చదువుకోగలుగుతారు. పేద విద్యార్థులు ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే దృక్పథం పాలకులకు ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల పట్ల ఆవేదనతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలన్న సంకల్పం, ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదమున్నది. ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలకు సాకులు వెతకడం, కొర్రీలు పెట్టడం మానుకొని చిత్తశుద్ధితో వ్యవహరించాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తున్నది.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
సర్దార్ రవీందర్ సింగ్ 9440073073