నిన్నంతా ఆకలికి వేలాడిన నేల, కరువు తరిమితే వలసై తలో దిక్కు చెల్లాచెదురైన పల్లె నేడు పంటను వాగ్దానం చేస్తున్నది. ఊపిరి ఆగిపోయే ముందు, అప్పుల మర్మం తప్ప పేగు బంధాలకు అప్పగింతలకేం మిగలని కన్నీటి ధారల పాలమూరులో నేడు సిరులు పండనున్నాయి. ఏరంచు ఊరు.. ఊరంచు ఏరు… ఎటుపార జూసిన ఎడారిలా పాలమూరు అనే ఉద్యమ గీతమే నాడు వాస్తవ జన జీవితం. కానీ నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాకారం కావడంతో కనుచూపు మేర పచ్చదనం కనుల విందు చేయనుంది.
దత్తత తీసుకుంటామని ప్రకటించిన పాలకుల చేతిలో దగా, దారి చూపిస్తారని నమ్మిన స్థానిక నేతల నయవంచనే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా జనరాశులకు దశాబ్దాల శాపమైంది. పత్రికల్లో పాలమూరు వలస కూలీల మృతి వార్తలకు నిత్యం చోటుదక్కేది. అమ్రాబాద్ నుంచి ఆలంపూర్ దాకా అంబలి కేంద్రాల ముందు భిక్షగాళ్లలా పాలమూరు ప్రజలు వరుసలో నిలబడి పడిన మనోవేదన తలచుకుంటేనే దుఃఖమొస్తుంది.
ఈ దుస్థితిని చూసే కేసీఆర్ తెగతెంపుల సమరానికి త్యాగమై కదిలారు. బీఆర్ఎస్ స్థాపించిన మొదటి రోజుల్లో ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి గద్వాల్ తేరు మైదానం దాకా చేసిన పాదయాత్రలోనే పాలమూరు భవిత కోసం ప్రతిన బూనారు. నడిగడ్డలో కొలువైన మల్దకల్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిండు మనస్సుతో కృష్ణ, తుంగభద్ర నదీ జలాలతో స్వామివార్ల పాదాలు కడిగి తీరుతామని మొక్కుకున్నారు. ఇది సాధ్యమేనా…? ప్రజా ప్రతినిధులు లేరు, బలవంతులు, ధనవంతులు తోడేరారు, కరపత్రాలు తప్ప దిన పత్రికల్లో చోటే లేదు, పబ్బలో పుట్టి మఖలో మాయమయ్యే నినాదమేనని అందరూ అనుకున్నారు. కానీ ప్రజా యోధుడి సంకల్పానికి పంచ భూతాలు ఆశీర్వచనాలందించాయి. ప్రాణాలు పరిచి ప్రజా సమూహాల విశ్వాసాన్ని పొందగలిగారు కేసీఆర్. రాసిపెట్టుకున్న ప్రణాళికలు, నీటిపై కన్న కలలు, పొలాల సాలులో విత్తుకున్న ఆశయాలు అన్నింటినీ ఆచరణలో అద్భుతం గా పండించారు. జలధారకు దారే లేని మహేశ్వరం, ఇబ్రహీంపట్నానికి నీటిసిరులు వడివడిగా నడిచొస్తాయని ఎవరూహించారు? ఇది కడుపులో అగ్గి ఉన్న పాలకుడు మొండి చేతులతో సముద్రాన్ని ఈదినట్టు, సాహసోపేతంగా సాధించి ప్రజలకు పంచిన అద్భుత జల జీవితం.
కన్న కొడుకే తల్లిని ఉరేసినట్లుగా, ఓట్లేసి పెంచిన ఈ జిల్లా పెద్ద నాయకులంతా సీమాంధ్ర పాలకులతో కూడి ప్రజలకు పాడెకట్టే పనితీరునే చూపించారు. నదులపై వాలిన కుట్ర రాబందుల వల్ల జూరాల ప్రాజెక్టులో ఏనాడూ కనీసం 7 టీఎంసీలను నిల్వ చేసుకున్నదీ లేదు. అదే లక్ష ఎకరాలకు ప్రతిపాదించిన కేసీ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుకొని, కాలువలు విశాలపరుచుకొని రాయలసీమలోని 3 లక్షల ఎకరాలకు నీటిని పారించేశారు. దానివల్లే రాష్ట్ర ఆవిర్భావం నాటికి 35 లక్షల సాగు భూమి కలిగిన పాలమూరులో నీరు అందించింది కేవలం 2 లక్షల ఎకరాలకే అనేది విషాద వాస్తవం. కానీ ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ ప్రభుత్వ నీటి పారుదల చర్యల వల్ల తొమ్మిదేండ్లలోనే దాదాపు 16 లక్షల ఎకరాలకు పైగా రెండు పంటలకు జల సిరులు పారుతున్నాయి. గతంలో మనసు లేని సర్కార్లపై నమ్మిక కోల్పోయి, వానమ్మ కరుణ కోసం పాలమూరు ఎన్ని పూజలు చేసిందో? ఆనాడు బీచుపల్లి వంతెన మీది ఆగిన కేసీఆర్ రూపాయి బిళ్లను కళ్లకద్దుకొని కరుణ కోసం కృష్ణమ్మను వేడుక్కున్నట్లు, ఎన్ని నాణేలను నీటిలోకి విసిరి రైతులు మొక్కుకున్నారో లెక్కే లేదు.
మొక్కులే కాదు కాళేశ్వరంను పూర్తి చేసినట్లే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కోసం కృష్ణా నీటి చుట్టూ బొంగరమైపోయారు కేసీఆర్. అడ్డం పడుతున్న రాజకీయ పిశాచాలను, న్యాయ, సాంకేతిక అవాంతరాలను తొలగించేందుకు జల తపస్సునే చేశారు. ఫలితమే సముద్రమట్టానికి 500మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అత్యద్భుత జల శిఖరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పొలాల్లోకి పరుగులు పెడుతున్నది. దాదాపు 13 లక్షల నూతన ఆయకట్టుకు రెండు పంటల సాగుకు సమృద్ధిగా నీరందబోతున్నది. సారవంతమైన నేలలు, శ్రమ జీవులు, గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన పాలమూరు జిల్లాలో ఈ నీటి కోలాటం కొత్త చరిత్రను నిర్మిస్తున్నది.
అమ్రాబాద్ నుంచి ఆలంపూర్ వరకు సోమశిలలా పచ్చని సోయగాలు పరుచుకుంటున్నాయి. పదండి పోదాం పాలమూరుకు.. ఆకుపచ్చని అందాలను ఆస్వాదించడానికి. పోగొట్టుకున్నచోటే వెతుక్కొన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజారాశులు మానవ వికాసంలో నూతన పొద్దుపొడుపులవుతున్నారు. ఎంత లో ఎంత మార్పు? ఎండిన పంట, కబేళాకు అమ్ముకున్న ఎద్దును గుర్తు చేసుకొని గుండెలు పగిలేలా వలవలా ఏడ్చిన నిన్నటి పాలమూరు నేడు వరి వసంతమై విస్తరించింది. వలసల జిల్లానే ఉపాధి కేంద్రమై ఇరుగు పొరుగు రాష్ర్టాలకు అన్నం పెడుతున్నది. జిల్లా ప్రజల నుదుటి మీద ముడతలు మాయమై, చేతి రేఖల సాలులో సిరులు నాటుకుంటున్నారు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఈ నెల 16న నార్లాపూర్ లో పాలమూరు ప్రజల పండగ ఆకాశమంత పందిరిగా మారి ప్రజా సంబురమవుతున్నది. ఆ రోజు సీఎం కేసీఆర్ నార్లాపూర్‌లో ప్రారంభిస్తున్నది నీటి పంపును కాదు సిరుల వాగును. రైతు లోకం కోసం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల లాంటి సాకారం ద్వారా సాహసాలతో దేవులాడితే దేవుడైనా దొరుకుతాడనే తెలంగాణ జనం నానుడిని సీఎం కేసీఆర్ నిజం చేశారు. వర్ధిల్లు కేసీఆర్… రైతన్నలవే కాదు, నిన్నటి దాకా నీటి కోసం అలమటించిన జీవకోటి దీవెనలూ మీకుండి తీరుతాయి.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్ 98853 52242