గడిచిన దశాబ్ద కాలంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇటీవల ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించిన భారతదేశానికి ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నది. కరోనా వంటి గడ్డు పరిస్థితిని సైతం దాటుకొని సాగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రపంచశక్తిగా ఎదుగుతున్న మన దేశ ఆర్థికవ్యవస్థపై ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏయే రంగాలపై దీని ప్రభావం పడనున్నది? వ్యాపార, వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడబోతున్నది? వంటివి ఇప్పడు ఆసక్తికరమైన ప్రశ్నలు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మొదటగా ముడిచమురు రంగం మీద పడనున్నది. మన దేశం చమురు అవసరాల్లో సుమారు 80 శాతం దిగుమతులే. మొత్తం చమురు దిగుమతుల్లో 46 శాతం, 70 శాతం ఎల్పీజీ పశ్చిమాసియా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటున్నది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగితే, రానున్న రోజుల్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగే ఆస్కారం ఉంది. అంతేకాదు, ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20 శాతం ఇరాన్ ఆధీనంలోని ‘హార్ముజ్’ జలసంధి మార్గంలో జరుగుతున్నది. యుద్ధం వల్ల ఇరాన్ ఈ జలసంధిని మూసేస్తే ముడిచమురు ధరలు సుమారు 120 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చని అంచనా. అయితే, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం లేదు. కానీ, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు హార్ముజ్ జలసంధి గుండా వస్తున్నది. ఈ జలసంధి మూతపడితే ముడిచమురు ధరలకు రెక్కలు వచ్చినట్టే. గణాంకాల ప్రకారం.. ఒక బ్యారెల్ ముడిచమురు ధర 10 డాలర్లు పెరిగితే, మన దేశ జీడీపీ వృద్ధి సుమారు 0.3 పాయింట్లు తగ్గుతుంది. అలాగే, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా, డిమాండుకు సరిపడా చమురు సరఫరా పడిపోవడం, అంతర్జాతీయంగా ధరలు పెరగడం ఒక సమస్య కాగా, డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోవడం మరొక సమస్య. ఫలితంగా దేశీయ చమురు కంపెనీల దిగుమతి వ్యయం పెరుగుతుంది. తద్వారా, కరెంటు అకౌంట్ లోటు కూడా పెరిగే ప్రమాదం ఉన్నది. ముడిచమురుతో పరోక్షంగా సంబంధమున్న ప్లాస్టిక్, ప్రత్యేక రసాయనాలు, రంగులు, టైర్లు, ఇతర రంగాలు కుదేలవుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది సామాన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది.
చమురుపైనే కాకుండా, మనదేశ ఎగుమతి, దిగుమతి వాణిజ్యంపై కూడా ఇరాన్-ఇజ్రాయెల్ ప్రభావం పడుతుంది. అరేబియా ద్వీపానికి అవతల ఉన్న యెమెన్‌లోని హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా ఎర్రసముద్రం, సూయజ్ కాలువను మూసివేస్తే భారత నౌకలు మన ఎగుమతి దిగుమతులకు ‘కేఫ్ ఆఫ్ గుడ్‌హోప్’ మార్గం ఎంచుకోవడం ద్వారా ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులకు చేరుకుంటుంది. తద్వారా ఒక్కో కంటైనర్‌కు సుమారు 500 నుంచి 1000 డాలర్ల వరకు ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా ఎగుమతి, దిగుమతి వర్తక వ్యయం సుమారు 50 శాతం పెరగవచ్చు. ముఖ్యంగా ఎల్పీజీ, ఎరువుల ధరలు పెరగడం ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతుంది.
భారత్‌కు ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలతో సుమారు 5 బిలియన్ డాలర్ల వ్యాపార సంబంధాలున్నాయి. ఇరుదేశాలకు భారత్ వివిధ రకాల వస్తువుల ఎగుమతితో పాటు దిగుమతి కూడా చేసుకుంటున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్‌కు భారత్ ఎగుమతుల విలువ సుమారు 4.5 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 2 బిలియన్ డాలర్లు. అలాగే, 2024-25లో 2.1 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 1.6 డాలర్ల దిగుమతులు ఇరుదేశాల మధ్య జరిగాయి. ఇజ్రాయెల్‌కు భారత్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక ఇరాన్‌తో కూడా మన దేశానికి మంచి వాణిజ్య సంబంధాలే ఉన్నాయి. 2023-24లో 1.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 0.62 బిలియన్ డాలర్ల దిగుమతులు, 2024-25లో 1.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 0.44 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. భారత్ నుంచి బాస్మతీ బియ్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మన దేశ బాస్మతీ బియ్యం ఎగుమతుల్లో ఇరాన్ వాటా సుమారు 12.6 శాతం.
ఈ ఘర్షణల ప్రభావం విమానయాన రంగంపై కూడా పడుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం, వెండి వంటి లోహాల వైపు మళ్లిస్తారు. తద్వారా షేర్ విలువలు పడిపోయి, షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది. బంగారం, వెండి వంటి లోహాల విలువ పెరుగుతుంది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధప్రభావాలను తట్టుకొని ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్న భారత్‌కు ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం రానున్న రోజుల్లో పెనుముప్పు కానుంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ఎదురవుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో వేచిచూడాలి.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్ కామర్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ)
– డాక్టర్ రామకృష్ణ బండారు 79057 51940