ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అప్పలపై ఆధారపడుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సర్కార్ ఎందుకంత మంకు పట్టు పడుతుందదో అర్థమైతలేదు. మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారడానికి ఎన్నో ఉదాహరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో మురుగునీటితోపాటు కాలుష్యపు జలాలను తమ ఒడిలో నింపుకొని ప్రవహించే నదుల ప్రక్షాళన అనేది ఆయా ప్రాంతాల్లో ఒక ప్రహసనంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ లాంటి నగరంలో యమునా నదిని శుద్ధి చేస్తామనే ప్రధాన ఎజెండాతోనే రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలో పొందుపరిచి అధికారంలోకి వస్తున్నాయి. నిత్యం వ్యర్థ జలాలతో కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని గత ప్రభుత్వాలే కాదు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యత అని చెప్పింది. అయితే వారు శుద్ధి చేయడానికే పెద్దపీట వేస్తున్నారు తప్ప ఆ నదిని అందంగా తీర్చిదిద్దాలని గాని, ఆ నదిలో నీళ్లకు రంగులద్దాలని గాని చెప్పడంలేదు. అలాగే హైదరాబాద్లో మూసీ నదిని శుద్ధి చేయాలి. కానీ సుందరీకరణ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని పంతానికి పోవడం, పెద్దఎత్తున ఇండ్లు కూల్చి ప్రజలను నిర్వాసితులను చేయడం దారుణం.
మూసీ సుందరీకరణతో నగరానికి కొత్త ఆకర్షణ వస్తుందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ పర్యావరణ వేత్తలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది సహజ ప్రవాహం మారిపోవడం ద్వారా జీవవైవిధ్యం దెబ్బ తినే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి ద్వారా పర్యాటకం పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రభుత్వం వింత వాదన వినిపిస్తున్నది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు అంచనా ఎంత అనేది స్పష్టత లేకుండానే ఒక ప్రయాణం ఎందుకు మొదలైంది? ఎందుకు కొనసాగుతున్నది? ఎవరి కోసం ప్రభుత్వం ఉరుకులాడుతున్నది? ముంబైలోనూ మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలను తీసుకెళ్లే నది మిథి. దాదాపు 18 కిలోమీటర్లు నగరంలో ప్రవహిస్తూ చివరికి అరేబియా సముద్రంలో కలిసే ఈ నది విషయంలో కూడా అక్కడి పాలకులు సుందరీకరణ వేషాలేవీ వేయడంలేదు. శుద్ధి చేయడానికి మాత్రమే ప్రాధాన్యతిస్తున్న విషయాన్ని గుర్తించాలి. కలకత్తాలోనూ విద్యాధరి-మాతలా నదితోపాటు హుగ్లీ నదులు అక్కడ మురుగునీరును తరలిస్తుంటాయి. బెంగళూరు లాంటి నగరంలో వృషభావతి నది పరిస్థితి కూడా ఉన్నది.
పరిశ్రమల నుంచి వెలువడే సమయంలోనే వ్యర్థ జలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి పంపాలని నిబంధన ఉన్నది. కానీ పీసీబీ అధికారుల పర్యవేక్షణ లోపంతో శుద్ధి కాకుండానే కాలుష్య జలాలు మూసీ నదిలో కలుస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద అపార్ట్మెంట్లలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని డ్రైనేజీ నీటిని శుద్ధి చేసి బయటకు పంపించాల్సి ఉంటుంది. కానీ ఎంతమంది అలా చేస్తున్నారు? ఈ విషయంలో కూడా ప్రభుత్వ అధికారుల నిఘా కొరవడటం వల్ల నదీజలాలు కలుషితమవుతున్నాయి.
పారిశ్రామిక వ్యర్థ జలాలు చెరువులను కూడా కలుషితం చేస్తున్నాయి. చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమలు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు దోమల రాజ్యం నడుస్తున్నది. సాయంత్రం వాకింగ్ చేసే ప్రజలు దోమల బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చెరువులు, నదుల కాలుష్యం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా మనం చూసిన సందర్భాలను ఇక్కడ ప్రస్తావించక తప్పదు. లాక్డౌన్ ఏర్పడటం వల్ల పరిశ్రమలు మూతపడితే ఆ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు తాత్కాలికంగా కొన్ని నెలలపాటు ఆగిపోయాయి. ఆ సమయంలో ఈ నదులు శుద్ధి పరిశుద్ధమైన నీటితో ప్రవాహించడాన్ని పర్యావరణవేత్తలు గమనించారు. కాబట్టి సమస్య ఎక్కడ ఉన్నదో తెలుసుకొని ఎలా పరిష్కరించాలో ప్రభుత్వం ఆలోచించాలి. సుందరీకరణ పేరుతో ప్రణాళికలను రూపొందించుకోవడం, వాటిని అమలుపరిచేందుకు తహతహలాడడం వెనుక అసలు రహస్యం ఎవరికీ బోధపడటం లేదు.
దేశంలోని ప్రధాన నగరాల్లో నదులను శుద్ధి చేయడానికి అక్కడి ప్రభుత్వాలు ఆధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయడం, నదిలో పూడిక తీయడం, చెత్తాచెదరాలను తొలగించడం లాంటి బహుముఖ వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతర పర్యవేక్షణ, వ్యర్థాల నివారణకు కఠిన చట్టాలు తీసుకురావడం లాంటివి చేయడం ద్వారా ఎంతో కొంత ఫలితాలు సాధిందేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్మాణాలు కూల్చకుండా, ప్రస్తుతం ప్రవహిస్తున్న నది భౌతిక స్వరూపాన్ని మార్చకుండానే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే కేవలం పరిమిత బడ్జెట్తోని ఈ ప్రాజెక్టు శుద్ధి చేసే అవకాశాలు లేకపోలేదు. అలా కాదని సుందరీకరణ పేరుతో నదికి ఇరువైపులా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే, ఇదే మురుగునీరు మళ్లీ ప్రవహిస్తే ప్రాజెక్ట్ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారవడం ఖాయం.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
అస్కాని మారుతి సాగర్ 9010756666