రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థల పట్ల కాంగ్రెస్ సర్కార్ విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థకు పెద్దపీట వేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన జీవో నంబర్ 7 ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికే ఉరితాడుగా మారిందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత నెల 29న జారీ చేసిన ఈ జీవో ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది.
ప్రభుత్వ తాజా జీవో ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇకపై ఫీజు నేరుగా విద్యార్థి ఖాతాకే వేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, విద్యార్థులకు బకాయిలు చెల్లించటానికి నిర్దిష్ట గడువు ప్రకటించకపోవటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జూన్ 24లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, సర్కార్ బకాయిలు చెల్లించని పక్షంలో, విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకునేందుకు కోర్టు కొన్ని కాలేజీలకు మధ్యంతర అనుమతి ఇవ్వటం పేద విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం రెండున్నరేండ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను పెండింగ్లో పెట్టింది. కమిటీలు, టోకెన్ల పేరుతో కాలయాపన చేస్తూ కాలేజీలను ఆర్థికంగా దెబ్బతీసింది. దీని ప్రభావం వల్ల సుమారు 2,500 విద్యాసంస్థలు మూతపడే స్థితికి చేరుకున్నాయి.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ లక్షలాది పేద విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింతమంది విద్యార్థులకు ఉపయోగపడేలా గ్రామీణ విద్యార్థుల ఆదాయ పరిమితిని రూ1.5 లక్షలు, పట్టణ విద్యార్థులకు రూ.2 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.2.5 లక్షలుగా నిర్ణయించింది. కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఉదార స్వభావంతో ఏటా సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చదివిన 7 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 70% (అంటే 5 లక్షల మంది) ఈ పథకం కిందనే చదువుకున్నారు.
ఈ ఏడాది మే నెల నాటికి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం సుమారు 5 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో స్కాలర్షిప్ల కోసం రూ.4,343 కోట్లు కేటాయించినప్పటికీ, రీయింబర్స్మెంట్ కింద చెల్లించే వాటా మాత్రం తగ్గింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బకాయిలను తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చెల్లిస్తూ పథకాన్ని మరింతమంది విద్యార్థులకు చేరువయ్యేలా చేసింది. కానీ, రేవంత్రెడ్డి ప్రభుత్వం బకాయిలను తీర్చకుండా, కొత్త బాకీలు చేస్తూ విద్యావ్యవస్థను అవస్థలపాలు చేస్తున్నది. ఇకనైనా పాత బకాయిలు చెల్లించి, పాత పద్ధతిలోనే నేరుగా కాలేజీలకు ఫీజు చెల్లించే పద్ధతి కొనసాగించాలి. లేకుంటే విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని గుర్తించాలి.
-తుంగ బాలు, 9985930246
– వ్యాసకర్త: బీఆర్ఎస్వీ నాయకుడు