యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం ప్రభుత్వాల విధి. వారి విద్య, ఉపాధికి అవకాశాలు కల్పించడం వాటి ప్రథమ, ప్రధాన కర్తవ్యం. అవి నెరవేరనప్పుడు యువత అసంతృప్తికి గురవుతుందన్న విషయం పాలకులందరికీ అనుభవంలోకి వచ్చిన సంగతే. ఇవన్నీ తెలిసిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నదో అర్థం కాదు. కేసీఆర్ హయాంలో ఎంతో విజయవంతంగా నడిచిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కనపెట్టింది.
ప్రభుత్వమే విద్యాసంస్థలన్నింటినీ ఏర్పాటుచేసి, నడపడం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కళాశాలను ప్రైవేటుసంస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఫీజు చెల్లిస్తుంది. దానివల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. విద్యను వ్యాపారంగా మార్చకుండా అరికట్టినట్టవుతుంది. పరోక్షంగా ఆ విద్యాసంస్థలను కూడా ప్రభుత్వమే నిర్వహించినట్టవుతుంది. ఇంత మంచి ఆలోచనతో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న నినాదం కింద కేసీఆర్ అమలుచేసిన పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అయోమయంలో పడేసింది. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఫీజుల కింద రూ.20 వేల కోట్లు ఇచ్చారు. సగటున ఏటా రూ.2,000 కోట్లు ఇచ్చారు.
కాలానుగుణంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య, ఇతర ఖర్చులకు అనుగుణంగా దాన్ని పెంచాల్సి ఉండగా అసలుకే మోసం వచ్చింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు వాపస్ చేయకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కోర్సులు పూర్తయినా విద్యార్థుల ఫీజును ప్రభుత్వం చెల్లించలేదు. ఆదాయం లేక కాలేజీలను నడపలేకపోతున్నామంటూ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఆ సొమ్మును తాము తిరిగి చెల్లిస్తామని ఆశ చూపాయి. గత్యంతరం లేక తల్లిదండ్రులు రూ.3-4 లక్షలు ఫీజుల కింద చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగువర్గాల వారికి ఇదెంత కష్టం? ప్రభుత్వం వాపస్ చేస్తుందన్న నమ్మకంతో అప్పో సప్పో చేసి ఫీజులు కట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వాపస్ చేస్తుందన్న నమ్మకం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇరువై నెలలుగా పెండింగ్లో ఉన్న ఈ బకాయిల్లో కొంతైనా చెల్లించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్కను కోరాయి. లేకుంటే సమ్మె చేస్తామని చెప్పాయి. అకస్మాత్తుగా బంద్కు పిలుపునివ్వడం ఏమిటని వారిని ప్రశ్నించిన మంత్రి ‘అల్లరి చేయొద్దు’ అని హెచ్చరించారు. 20 నెలలుగా వినతులు చేస్తూ వస్తుంటే అదింకా ఆకస్మికమే అవుతుందా? మంత్రి ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తి కలిగిస్తున్నది.
‘నేనేమీ చేయలేను. డబ్బులన్నీ జీతాలు, పథకాలకే సరిపోతున్నాయి’ అని చెప్పారు. రీ యింబర్స్మెంట్కు పైసల్లేవని తేల్చిచెప్పారు. ఇక్కడ రెండు విషయాలను గమనించాలి. ఒకటి… ‘డబ్బులన్నీ పథకాలకే సరిపోతున్నాయి’.. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది పథకం కాదా? దీన్ని ఒక పథకం కింద ప్రభుత్వం గుర్తించలేదా? ఒకవేళ గుర్తిస్తే బడ్జెట్లోనే నిధులు కేటాయించాలి కదా? ఒకవేళ కేటాయిస్తే వాటిని ఇతర పథకాలకు మళ్లించారా? కొత్త పథకాలను అమలుచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారంటే దానర్థం ఉన్నవాటిని కొనసాగించి కొత్తవాటిని తీసుకొస్తామని… మరి ఫీజు రీయింబర్స్మెంట్ పాత పథకమే కదా, దాన్ని కొనసాగించాల్సి ఉండగా నిధులు కేటాయించకపోవడం ఏమిటి? లోపం ఎక్కడ జరిగింది.
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కూడా వారి ఉద్యోగుల జీతభత్యాల కోసమే ఈ నిధులు అడుగుతున్నాయి. ఆ సిబ్బంది బాగోగులకు ప్రభుత్వం బాధ్యత వహించదా? ఈ సమస్యను తీవ్రమైనదిగా ఎందుకు చూడటం లేదు. ఆర్థికమంత్రి సమాధానంలోని రెండో విషయం ‘నేనేమీ చేయలేను’ అని చెప్పడం. అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఈ సమస్యకు సమాధానం విద్యాశాఖను నిర్వహిస్తున్న సాక్షాత్తూ ముఖ్యమంత్రి వద్ద లభిస్తుంది కాబట్టి. ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఫీజు రీయింబర్స్మెంట్మై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నట్టు కనిపించడం లేదు. బడ్జెట్లో దీన్ని ప్రత్యేకంగా చూపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో బోధన ఫీజులు, ఉపకార వేతనాలు, స్టయిఫండ్ల నిమిత్తం రూ.4,452 కోట్లు కేటాయించారు. పాత బకాయిలున్న దృష్ట్యా ఈ నిధులు సరిపోవని అప్పట్లోనే అందరూ చెప్పారు. దీన్ని రెట్టింపు చేస్తేనే మంచిదని సూచనలు కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్థిక సంవత్సరంలో సగభాగం ముగిసినా ఈ పద్దు కింద విడుదల చేసిన సొమ్ము ఎంతో కూడా తెలియదు. వీటిని నిర్వహణ నిధులుగా పరిగణిస్తారు. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, జీతాల వంటివి దీనికిందకే వస్తాయి. వీటి విడుదలలో జాప్యం జరిగితే దాని ప్రభావం ప్రజలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కుటుంబాలు, సంస్థల నిర్వహణ కష్టమవుతుంది. కొత్త పథకాల అమలు కాస్త అటూ ఇటూ అయినా ఫరవాలేదు కానీ, ఉన్నవాటి అమలు సరిగ్గా లేకపోతే అసంతృప్తి మొదలవుతుంది.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817