కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్‌సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్‌సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిపిస్తున్నది. ఎందుకంటే అత్యధిక సభ్యులు ఉంటే కేవలం ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఉంటుంది, అంతేకానీ తమ గొంతు వినిపించేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా దేశంలోని సంస్థాగత నిర్మాణాన్ని ధ్వంసం చేసే దిశగా మలుపు తిప్పే సూచనగా నిలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న డీలిమిటేషన్ లెక్కలు కేవలం అంకెల కోణానికి మాత్రమే పరిమితం. 1972లో పార్లమెంట్‌లోని దిగువసభ అయిన లోక్‌సభ స్థానాలను 543గా ఖరారు చేశారు. అయితే, ఆ సంఖ్య అలాగే యథాతథంగా ఉండిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆ పెరుగుదల అనేది ప్రజాస్వామ్య మౌలిక లక్ష్యాలకు విఘాతం కలిగించేదిగా ఉండకూడదు. కానీ కేంద్రం చెప్తున్న పద్ధతిలో సీట్ల సంఖ్యను పెంచడంలో ఓ పెనుప్రమాదం దాగి ఉన్నది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రధానమైన ఆటంకాల మధ్య నిలిచిపోయింది. మరోవైపు వివిధ ఆటంకాలు ఉండగానే, జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచుతామని కేంద్రం చెప్తూ వస్తున్నది.
అంటే జనాభా నియంత్రణలో సత్ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ర్టాలను శిక్షించనట్టు, హిందీ ప్రాబల్యం కలిగిన ఉత్తరాది రాష్ర్టాలకు బహుమతి ఇచ్చినట్టు అవుతుంది. ఇదొక కీలకమైన అభ్యంతరం. కానీ కేంద్రం పరిష్కారం చూపని సమస్యగా మిగిలిపోయింది. దీంతో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పునర్విభజన జరగడానికి వీల్లేదనే వాదనలు, రాజకీయ డిమాండ్లు, సంక్లిష్ట పరిస్థితుల మధ్య పునర్విభజన వ్యవహారం ముందుకు సాగలేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల మధ్య నిర్వహించడానికి కూడా కష్టంగా ఉండే నిర్మాణంలో భారీ లోక్‌సభ అవసరమేంటి? ఏ స్థిరమైన ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి ప్రతిపాదిత వ్యవస్థ లేదు.
పరిణతి చెందిన ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థ పరిశీలన, సమగ్ర చర్చ, సభ్యులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. అలాంటి వీలు కల్పించే విధంగా సభ పరిమాణాన్ని పరిమితం చేయాలని కోరుకుంటుంది. ఎక్కడా లేని విధంగా లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని నిర్ణయించడం, అసాధారణం, ప్రమాదకర మార్గంలో ప్రయాణించడమే అవుతుంది. ప్రజాస్వామ్య సిద్ధాంతం, ప్రపంచ వ్యాప్తంగా ఆచరణను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతున్నది. సభ్యుల సంఖ్య ఒక పరిమితిని దాటిన తర్వాత అది ఆలోచనాత్మక వేదికగా కాకుండా అస్తవ్యస్తమైన సభగా మారుతుంది. అలాంటి చోట కొందరికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది. మిగిలిన సభ్యులు కేవలం ఓటింగ్ కోసం, ఏమీ చేయలేని ప్రేక్షకులుగా మిగిలిపోతారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్యను 1929లో 435గా నిర్ణయించారు. అప్పుడు ఆ దేశం జనాభా 12 కోట్లు ఉండగా, ప్రస్తుతం 33.5 కోట్లుగా ఉన్నది.
కానీ నేటికీ అమెరికాలోని ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య 435గానే కొనసాగుతున్నది. జనాభా పెరిగిన నిష్పత్తిలోనే సభ్యుల సంఖ్యను పెంచితే సభా కార్యకలాపాలు స్తంభించిపోతాయని అమెరికన్లు భావిస్తుంటారు. నియోజకవర్గ పరిధిలో జనాభా పెరుగుతుంది, కానీ ప్రతినిధి మాత్రం ఒక్కరే ఉంటారు.
ఏటేటా పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల సంఖ్య తగ్గిపోతున్నది. స్థాయీ సంఘాలు పరిశీలన లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. ప్రతిపక్షం పాత్రను పాలకపక్షం తోసిపుచ్చుతున్నది. సభను ఇంకా వందలాది మంది సభ్యులతో నింపితే సభ్యుల పట్ల అణచివేత మరింత పెరుగుతుంది. సంఖ్యా బలం కింద నాణ్యత మరుగునపడిపోతుంది.
ఎక్కువ మందికి ప్రాతినిధ్యం వహించే క్రమంలో పాలనలో అంతరాలు ఏర్పడకుండా పెద్దఎత్తున స్థానిక సిబ్బందిని పెంచుతుంటారు. ఆధునిక సమాచార వ్యవస్థ, అత్యంత పకడ్బందీగా నిర్వహించే కమిటీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఇదే తరహాలో భారత్‌లోని ఎంపీలు కూడా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టుగా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచితే, ఎంపీలకు వినాశకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. పార్లమెంట్ సమావేశాల్లో సమయం చాలా పరిమితమైంది. ఉదాహరణకు రోజువారీ ప్రశ్నోత్తరాలు లేదా ఏదైనా సంక్లిష్ట బిల్లుపై సమగ్ర చర్చ జరగాలంటే కనీసం నాలుగు గంటలు కేటాయిస్తే, 850 మంది సభ్యుల్లో ఎంత మందికి అవకాశం ఇవ్వగలుగుతారు? పార్టీల బలాలను బట్టి సమయం కేటాయిస్తే, మొత్తం 15-20 మంది మాత్రమే చర్చలో పాల్గొనగలరు. పార్టీలలో వెనుక వరుసలోని సభ్యులు, చిన్నపార్టీల సభ్యులు కేవలం ప్రేక్షకపాత్రకు పరిమితమవుతారు. అత్యధిక సభ్యులున్న పెద్ద సభలో పాలక పక్షాన్ని ప్రశ్నలు అడిగేందుకు, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేందుకు, ఐదేండ్ల పదవీ కాలంలో కనీసం ఒక్క అర్థవంతమైన చర్చలోనైనా పాల్గొనేందుకు చాలామంది సభ్యులకు అవకాశం దొరకదు. కేవలం వారి పార్టీల నేతలు ఆదేశించినప్పుడు చేతులెత్తడానికి తప్ప ఏమీ ఉపయోగం ఉండదు.
ఇప్పటికే పరిపాలనలో ఈ ధోరణి ఆందోళనకరంగా ఉన్నది. సభ్యుల సంఖ్య భారీగా పెరిగితే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో పరిపాలనలో పార్లమెంట్ పాత్ర క్రమంగా క్షీణిస్తున్నది. ఏటేటా పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల సంఖ్య తగ్గిపోతున్నది. స్థాయీ సంఘాలు పరిశీలన లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. ప్రతిపక్షం పాత్రను పాలకపక్షం తోసిపుచ్చుతున్నది. సభను ఇంకా వందలాది మంది సభ్యులతో నింపితే సభ్యుల పట్ల అణచివేత మరింత పెరుగుతుంది. సంఖ్యా బలం కింద నాణ్యత మరుగునపడిపోతుంది. భారీ సంఖ్యలో సభ్యులు కలిగిన సభలో ఏదైనా చర్చించేందుకు అనుకూల వాతావరణం ఉండదు. చర్చించడానికి వీలులేనంత పెద్ద సభ సహజంగానే తన పర్యవేక్షణ అధికారాన్ని కోల్పోతుంది. మంత్రివర్గమే పర్యవేక్షణ బాధ్యతను చూసుకోవాల్సి వస్తుంది. సభ్యులు తమ బలాన్ని కోల్పోతారు. సభ నోటీసు బోర్డుగా, రబ్బర్ స్టాంప్‌గా మారిపోతుంది.
ఒకవేళ లోక్‌సభ స్థానాలను 850కి పెంచితే అ ది, చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ లేదా ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీని పోలి ఉం టుంది. ఆయా దేశాల సభలు చూడటానికి గంభీరంగా, పెద్ద ఎత్తున ప్రతినిధులు కలిగిన సభలుగా కనిపిస్తాయి. కానీ చివరికి అధినేతలు ముందే సిద్ధం చేసుకొని ఇచ్చిన ప్రసంగాలకు చప్పట్లు కొట్టేందుకే సభ్యులు పరిమితమవుతారు. ఆ రెండు దేశాల సభల్లోని సభ్యులు తమ అంగీకారం తెలిపేందుకు మాత్రమే ఉన్నారు. అంతేకానీ చర్చలో పాల్గొని, అభిప్రాయాలు తెలిపేందుకు కాదు. భారతదేశంలో ఎంపీల గొంతులు నొక్కేలా భారీ లోక్‌సభను నిర్మిస్తే, ప్రజాస్వామ్యాన్ని నిర్వీ ర్యం చేసినట్టే అవుతుంది. చర్చ స్థానంలో ప్రదర్శనను నిర్వహించినట్టు మారుతుంది. మరో 300 మంది ఎంపీలను పెంచితే వారి జీతం, వసతి, ప్రయాణ, పెన్షన్‌కు అదనపు వ్యయం అవుతుంది. ఆ ఖర్చును ఆదా చేసి, పార్లమెంట్ సమీపంలో ఎంపీలకు పటిష్ట కార్యాలయం నిర్మించవచ్చు.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఒక ఎంపీ 20-30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించలేరన్న వాదన తప్పు, అపోహ. చట్టాల రూపకల్పన, విదేశాంగ విధానం, స్థూల ఆర్థిక పాలన, కేంద్ర కార్యనిర్వాహకవర్గాన్ని జవాబుదారీగా ఉంచడం ఎంపీల రాజ్యాంగ విధి. వాళ్లు మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు కాదు. ఇప్పుడున్న తరహాలోనే పెద్ద నియోజకవర్గాలకు ఎంపీలు ప్రాతినిధ్యం వహించగలరు.
73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థాని క సమస్యలు, స్థానిక సంస్థలు, పట్టణ మౌలిక సదుపాయాలు పూర్తిగా రాష్ర్టాల అసెంబ్లీ, మున్సి ల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలి. పౌరులు రోజువారీ సమస్యల పరిష్కారం కోసం ఎంపీ వైపు చూడాల్సిన అవసరంలేదు. ఎంపీలు పూర్తిగా జాతీయ పరిపాలన అంశాలపై దృష్టి పెట్టి, స్థానిక అంశాలను అసెంబ్లీ, మున్సిపల్‌శాఖ, గ్రామపంచాయతీలకు వదిలేయాలి. దీంతో పార్లమెంట్ పనితీరుకు ఆటంకం కలుగకుండా భారత్ సమర్థవంతమైన, ప్రభావవంతమైన, భాగస్వామ్యంతో కూడిన సమాఖ్య నిర్మాణాన్ని కొనసాగించగలదు. సభలో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు సభ్యులకు అవకాశం, స్థానిక సంస్థలకు సాధికారత కల్పించడంలో ప్రజాస్వామ్య భవిష్యత్తు ఉంటుంది, అంతేకానీ చర్చల స్థానంలో డొల్ల నాటకాలను ప్రదర్శించే భారీ మహాసభను నిర్మించడంలో కాదు.
– (వ్యాసకర్త: కాంగ్రెస్ ఎంపీ ) (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
శశిథరూర్