సాధారణంగా ఎన్నికలొస్తున్నాయంటే, అధికార పార్టీలో కొంత జోష్ వస్తుంది. కానీ, రాష్ట్రంలో భిన్న పరిస్థితులున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచీ రేపో, మాపో స్థానిక ఎన్నికలు అనే ప్రచారాలు తప్ప, అవి నిర్వహించే ధైర్యం కాని, తెగువ కాని అధికార కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ ఆ పార్టీలో ఉలుకూ, పలుకూ లేదు. అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదనరంగంలో దిగడం, పార్టీ క్యాడర్
పూర్తి ఏకాభిప్రాయంతో అభ్యర్థికి మద్దతు పలకడం, వీటితో పాటు గత రెండేండ్లుగా నగరంపై ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ప్రజలను బీఆర్ఎస్ వైపు నిలిచేలా ప్రేరేపించాయనేది యూసుఫ్‌గూడ ప్రచారంలో నేను గమనించిన అంశాలు.
నవంబర్ 14న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అధికార కాంగ్రెస్ నేతలు సైతం చెప్పుకొంటున్నారు. ఆమె ఎందుకు గెలువబోతున్నారో అనేక అంశాలు క్షేత్రస్థాయి పర్యటనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓటర్లలో నూటికి తొంబై ఐదు శాతం బస్తీవాసులే. యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, బోరబండ డివిజన్లతో పాటు సోమాజిగూడలోని కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేదు, ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారినా బీఆర్ఎస్ క్యాడర్ చెక్కుచెదరలేదు. ఇది బీఆర్ఎస్ ప్రధాన బలమైతే, ఇక నియోజకవర్గంలోని 3.99 లక్షల మంది ఓటర్లలో సింహబాగం 1,33,000 పైగా ముస్లిం ఓటర్లున్నారు. ఆ తర్వాత మెజారిటీ బీసీలది.
ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతున్నది. కానీ, అవన్నీ కేవలం మభ్యపెట్టడానికే అన్న వాస్తవాన్ని ఆయా వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. దివంగత నేత మాగంటితో ఈ వర్గాలకున్న సాన్నిహిత్యం, అతని వల్ల గతంలో తమ కాలనీలకు, వ్యక్తిగతంగా చేకూరిన లబ్ధిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి స్వయంగా ఆయన సతీమణి కావడంతో ఇప్పటికే వీరు తమ ఓటు విషయంలో నిర్ణయం తీసుకున్నారు. గత 22 నెలలుగా పెడుతున్న ప్రలోభాలకు లొంగని వీరిని ఈ 34 రోజులు మార్చుతాయనుకోవడం అసంభవం.
ఇక మరో ప్రధాన అంశం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మాగంటి సునీతకు దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం. ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ఆశావహుల్లోని ఏ ఒక్కరి పట్ల నియోజకవర్గంలో కనీస అభిప్రాయం లేదని మా పర్యటనల్లో తెలిసింది. ఇది ఆయా పార్టీల అంతర్గత సర్వేల్లో తేలినందువల్లే ఎవరిని ఎంచుకోవాలో ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు. తమకు పేటెంట్ అయిన ఓటుకు నోటునే అధికార పార్టీ నమ్ముకున్నది. ప్రజలు సైతం ఎంత పంచగలరో చూస్తాం, ఓటు మాత్రం ప్రజానేతకే వేస్తామంటున్నారు. ఇక బీజేపీ చేసే మత రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. ఇవీ పార్టీల పరంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో స్థానికంగా వెల్లువెత్తుతున్న అభిప్రాయాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమైన విషయం తెలిసిందే.
కాగా, వాటిని గుర్తుచేస్తూ జూబ్లీహిల్స్ ఓటర్లకు బీఆర్ఎస్ పంచిన బాకీ కార్డులను కాంగ్రెస్ నేతల మొఖం మీదే చూపిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ రెండేండ్లలో అభివృద్ధి సంగతి దేవుడెరుగు బీఆర్ఎస్ హయాంలో అమలుచేసిన ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ వంటి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతుల మెరుగును పూర్తిగా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. నగరంలో ప్రస్తుతానికి గుంతలు లేని రోడ్డు లేదు, రోడ్లపై డ్రైనేజీ పొంగని వీధి లేదు, వారంలో ఒక్కరోజైనా సరిగా వచ్చే నల్లా లేదు. ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు గత 22 నెలలుగా నరకం చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే, అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఆనుకొనే ఉన్న దుర్గం చెరువుకు సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి తమ్ముడి ఇంటి జోలికి వెళ్లని హైడ్రా.. మూసీని అనుకొని ఉన్న ముస్లిం, హిందూ బస్తీలపై ప్రతాపం చూపింది. గాజుల రామారంలో ఎమ్మెల్యేను ఏం చేయలేక, పదీ పరకా పోగేసుకొని కొన్న అమాయక పేదలను నిర్దాక్షిణ్యంగా రోడ్డుమీదకు లాగింది. ఇలా ఎన్నో వైనాలు చూశాక హైడ్రా తమ ఇండ్లపైనా పడకమానదు, అప్పుడు, జీ హుజూర్ అనే అధికార ఎమ్మెల్యే ఉండటం కన్నా, ప్రాణాలు పెట్టి పోరాడే మాగంటి వారసులు ఉండాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. నా ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికల్లో, ఎన్నో చోట్ల ప్రచార బాధ్యతలు నిర్వహించాను. కానీ, ఎవరు మంచో, ఎవరు చెడో ఓటర్లే చెప్పడం తొలిసారి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చూశాను. తమకు అండగా ఉండే నేతను తామే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని ప్రకటిస్తున్న ఈ ప్రజలకు, ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి 95530 86666