ప్రజా ఆకాంక్షలకు దూరంగా పాలన సాగించే ప్రభుత్వాలను గద్దెదించి, మరో పార్టీకి పట్టం కట్టడం ప్రజలకు కొత్తేం కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటిదాకా ఈ దేశాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పాలించాయి. ఒకప్పుడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ నేడు అస్తిత్వం కోల్పొయి ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నది. కాంగ్రెస్ తర్వాత బీజేపీ అదేస్థాయిలో దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో అధికారం చేపట్టి ఇప్పుడు క్రమంగా పట్టు కోల్పోతున్నది. అనాలోచిత నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలు ఆ పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నాయి. తద్వారా ఆ పార్టీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతున్నది
2018 మార్చి వరకు బీజేపీ స్వయంగా కానీ, సంకీర్ణ భాగస్వామిగా కానీ దేశంలోని 21 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది. కానీ 2022 డిసెంబర్ నాటికి 30 అసెంబ్లీ స్థానాలున్న రాష్ర్టాల్లో 16 చోట్ల అధికారంలోకి వచ్చింది. ఈ 16లో 10 రాష్ర్టాల్లో సొంత మెజారిటీతో అధికారంలో ఉండగా, మిగతా ఆరు చోట్ల మిత్రపక్షాలతో అధికారం పంచుకున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాలు గతంలో బీజేపీ చేజారిపోగా, ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఓటమి తప్పలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో విజయాల ఫలితంగా కాకుండా ప్రభుత్వాలను కూలదోయడం మూలంగా బీజేపీ వశమయ్యాయి.
ఒక దశలో ఆ పార్టీకి ఎదురే లేకుండాపోయింది. 2018 మొదట్లో 21 రాష్ర్టాల్లో అధికారంలో ఉంటే, అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలలో ఓడిపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. 2021 అస్సాం ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాల్లో కోత పడింది. 2022లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మినహా బీజేపీ కొత్త రాష్ర్టాల్లో అధికారంలోకి రాలేకపోయింది. పైగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర పరాభవం చవిచూసింది. 2023లో జరుగనున్న ఎన్నికలను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద కష్టమే. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈశాన్య రాష్ర్టాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక మిత్రపక్షమైన ఐపీఎఫ్టీతో కలిసి త్రిపురలో బీజేపీ అధికారంలో ఉన్నది. 2018లో ఇక్కడ తొలిసారిగా బీజేపీ గెలిచినా ఇప్పుడు అక్కడ భారీ తిరుగుబాటును ఎదుర్కొంటున్నది. దక్షిణభారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. మరో రెండు మూడు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడనున్నాయి. 2019లో జేడీఎస్‌తో సంకీర్ణాన్ని వదులుకున్నాక తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది.
మరోవైపు, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ తంటాలు పడుతున్నది. రాష్ట్ర సీఎం బొమ్మైపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కేపీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ దూకుడుగా ఉన్నారు. ప్రతిపక్ష నేత, రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా బీజేపీపై మాటల దాడిని పెంచారు. ఈ నెల 11 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టనున్నది. మరోవైపు కుమారస్వామి మద్దతుతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కర్ణాటకలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని గతంలో కోరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలను దగ్గరి నుంచి చూస్తున్న కర్ణాటక ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధమవుతున్నారు. వీటన్నింటినీ అధిగమించి బీజేపీ అధికారంలోకి రాగలుగుతుందా? అనేది సందేహమే. తెలంగాణలోనూ కేసీఆర్ చరిష్మాను, సంక్షేమ పాలనను దాటుకొని బీజేపీ అధికారంలోకి వస్తుందనేది పగటికల. ఉద్యమనేతగా కేసీఆర్, ఉద్యమపార్టీగా బీఆర్ఎస్ ముద్ర ప్రజలపై బలంగా ఉన్నది. దాన్ని తుడిచేయడం ఎవరితరం కాదు. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలను అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ శివరాజ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఆయన పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చడం అక్కడ బీజేపీకి బాగా లాభించింది. అదే ఫార్ములాను ఇక్కడా అమలుచేసే అవకాశం ఉన్నది. కానీ తాజా సర్వేల ప్రకా రం..మధ్యప్రదేశ్‌లో బీజేపీ బలహీన పడింది. పైగా హిమాచల్‌ప్రదేశ్ ఓటమి తాలుకు ప్రభావం కూడా మధ్యప్రదేశ్‌పై పడే అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే మరో రెండు రాష్ర్టాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్. ఈ రెండుచోట్లా కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు నడుస్తున్నది. కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వచ్చినా అధికారం చేజిక్కించుకోవాలనేది బీజేపీ ఆలోచన. కానీ అది అంతగా సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ హవాను తట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. కానీ ఆ ప్రయత్నాలూ ఫలించకపోవచ్చు.
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా అనుకుంటున్న ఈ 9 రాష్ర్టాల్లో బీజేపీ ప్రభావం గతంలో కంటే తగ్గింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండటం శుభ పరిణామం.
(వ్యాసకర్త:బచ్చు శ్రీనివాస్, 93483 11117, బీఆర్ఎస్ ప్రతినిధి)