ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతున్నది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో అవి చేస్తున్న చిల్లర రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్షాలు ముందుకు వెళ్తుండటం సిగ్గుచేటు. రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమం మీద అజెండా లేకుండా కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ అధినాయకత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి.
నూటా ముప్ఫై ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ చంద్రబాబుకు ఏజెంటుగా మారింది. ఆయన నేతృత్వంలో పనిచేయడం ఆ పార్టీ దీనస్థితికి అద్దం పడుతున్నది. అంతేకాదు, రైతులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు విషయంలోనూ కాంగ్రెస్ తన అక్కసును వెళ్లగక్కింది. రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా అవసరం లేదు, మూడు గంటలు ఇస్తే చాలన్న రేవంత్‌రెడ్డి ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను బయటపెట్టింది. దీంతో రోడ్లమీదికి వచ్చి ప్రజలు ఆందోళన చేపట్టారు. బేషరతుగా క్షమాపణలు కోరాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇంకా చిల్లర రాజకీయాలు చేయడం దివాలాకోరుతనానికి నిదర్శనం.
తొమ్మిదేండ్ల కిందట రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో అనేక చిక్కుముళ్లు, సవాళ్లు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికినయి. ముఖ్యంగా విద్యుత్తురంగం తీవ్ర సంక్షోభంలో కూరుకున్నది. అందుకే రాష్ట్ర ప్రగతిని పట్టాలెక్కించడానికి ప్రాధాన్యతాక్రమంలో భాగంగా కేసీఆర్ విద్యుత్తు రంగ ప్రక్షాళనకు ప్రాధాన్యం ఇచ్చారు. తత్ఫలితంగా తెలంగాణ ప్రగతిఫలాలు విద్యుత్‌రంగ విజయాలతోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఏదేని ఒక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించడానికి ఆ రాష్ట్ర విద్యుత్తు తలసరి వినియోగాన్ని ప్రామాణికంగా చూపుతారు. ఈ రోజు దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో మెజారిటీ వ్యవసాయం బోరుబావుల మీదనే ఆధారపడి సాగుతున్నది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 30 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. అలాంటి సందర్భంలో అన్నదాతలకు అండగా నిలబడి వారి సాగుకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తన భుజాల మీద వేసుకున్నది. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చి వారికి తోడ్పాటునందిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రం ఖర్చుపెట్టని విధంగా వ్యవసాయం కోసం రూ.38 వేల కోట్లు వెచ్చించి విద్యుత్తు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తురంగ ప్రగతి ఫలాలను అన్నదాతకు చేరవేయడం ప్రతిపక్షాలకు రుచించడం లేదు. తెలంగాణ ఏర్పాటును విఫలయత్నంగా చూపడానికి కుట్ర పన్ని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పనిజేయడం సిగ్గుచేటు. అంతేకాదు, ఆయన చేసిన వ్యాఖ్యలకు వత్తాసు పలకడం తెలంగాణ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
వ్యవసాయరంగంలో తెలంగాణ సాగు విస్తీర్ణం 2014 నాటికి ఒక కోటి 30 లక్షల ఎకరాలుంటే 2022-23 నాటికి 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే, అన్నదాత కోసం, అన్నదాత సంక్షేమం, అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
నేడు తెలంగాణ అభివృద్ధి దేశానికే తలమానికం. తొమ్మిదేండ్ల తెలంగాణ పురోగతి ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న జాతీయపార్టీల వైఫల్యాలను ఎత్తిచూపుతున్నది. అదే జాతీయపార్టీలకు కంటగింపుగా మారింది. అందుకే కాంగ్రెస్, బీజేపీలు తమ జాతి వైరాన్ని మరిచి తెలంగాణ అభివృద్ధిని తొక్కిపెట్టడానికి కలిసి పనిజేస్తున్నాయి. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ జెండాతో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకు నడుస్తున్నారు. ఈ సమయంలో ఆయనను నిలువరించడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి పన్నుతున్న దుష్ట పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారు. పక్క రాష్ర్టాల్లో రైతుబాంధవుడిగా కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని జాతీయపార్టీలు రాష్ట్రంలో కేసీఆర్ పాలన మీద విషం చిమ్ముతున్నాయి.
తెలంగాణ సోయి లేని ప్రతిపక్షాలతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. తెలంగాణ అభివృద్ధి మీద చర్చకు వచ్చే దమ్ములేని కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కుతున్నారు. విద్యుత్తు విషయంలో ప్రజల ముందు కాంగ్రెస్ దోషిగా నిలబడ్డది. ముఖ్యంగా రైతులకు విద్యుత్ విషయంలో అవాకులు, చెవాకులు పేలిన పీసీసీ అధ్యక్షుడు యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ముందుకుతీసుకెళ్లే కేసీఆర్‌కు ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయి. పచ్చబడుతున్న తెలంగాణను ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కి ఆగం జేసుకోవడానికి రాష్ట్ర ప్రజ లు సిద్ధంగా లేరు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలను బొందబెట్టిన తెలంగాణ ప్రజలు ఈసారి ఎన్నికల్లో మరింత అధఃపాతాళానికి అణగదొక్కుతారనడంలో సందేహం లేదు. అంతేకాదు.. రానున్న ఎన్నికల ఫలితాలు దేశంలో గొప్ప మార్పునకు నాంది పలకబోతున్నాయి.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్)
-డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి 95530 86666