మే 24 నాడు రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన రేవంత్ సర్కార్ మఫ్టీ పోలీసులు పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉండే నా చెల్లెలి ఇంటిమీదికి పోయినప్పుడు ఆ గ్రామంలో కరెంటు లేదు! ఆ సమయంలో మా చెల్లెలు, ఆమె కొడుకు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వాళ్లు అభ్యంతరపెడుతున్నా వినకుండా ఆ చిమ్మచీకట్లోనే ఇంట్లోకి దూరి, తమ మొబైల్ ఫోన్ టార్చిలైట్ల వెలుతురులో దిలీప్ కోసం అన్ని రూములూ పోలీసులు గాలించారని విన్నప్పుడు నాకు 1881లో ప్రముఖ హిందీ రచయిత భర్తేందు హరిశ్చంద్ర రాసిన నాటకంలోని ‘అంధేర్ నగరీ చౌపట్ రాజా’ వాక్యం గుర్తొచ్చింది.
ఇవ్వాళ తెలంగాణలో ఆ దృశ్యం అనేకవిధాల కొనసాగుతున్న చీకటి రాజ్యాన్ని కండ్లకు కడుతున్నది. ఈ చీకటి రాజ్యాన్ని ఏలుతున్న చౌపట్ రాజా ఎంత అభద్రతాభావంతో బతుకుతున్నాడో గత ఐదు నెలల సోకాల్డ్ ప్రజా ప్రభుత్వ పాలన తీరు చెప్తున్నది. ఒక అక్రమ, అబద్ధపు, అన్యాయపు కేసులో నా సహచరుడిని ఇరికించిన సర్కార్, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నది.
సుమారు వారం రోజుల కిందట మొదలైంది ఈ దుర్మార్గపు ప్రహసనం. మే 23 నాడు పొద్దుపోయాక దిలీప్ మిత్రుడు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. అది చదివేలోపే తనే ఫోన్ చేశాడు. ‘నీ మీద కేసు పెట్టారు, తెలిసిందా?’ అని. ‘లేదు. ఏం కేసు?’ అని అడిగాడు దిలీప్. ‘డీటైల్స్ పంపాను చూడు’ అని ఫోన్ పెట్టేశాడు ఆయన. మిత్రుడు పంపిన కేసు ఎఫ్ఐఆర్ కాపీ చదివి ఆశ్చర్యపోయాం. నిజానికి ప్రభుత్వం మారి రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి దిలీప్‌ను ఏదో విధంగా వేధిస్తారని ఊహిస్తూనే వచ్చాను. కానీ, అబద్ధపు కేసొకటి పెట్టి ఊహించిన దానికన్నా దిగజారుడు రాజకీయం చేస్తున్నారు.
మే 22 నాడు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చిన విషయం తెలియజేస్తూ, దానికి ఒక కొత్త లోగో కూడా జత చేస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాట్సాప్ గ్రూపులో ఆయన సిబ్బంది రిలీజ్ చేశారు. ఆ లోగోను రాష్ట్రంలోని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ఓ టీవీ చానల్ పెట్టిన ఆర్టీసీ పాత, కొత్త లోగోలతో కూడిన పోస్టర్‌ను మే 22 నాడు రాత్రి ఒక పోస్టు చేస్తూ కొత్త లోగోలో తెలంగాణ చిహ్నాలైన చార్మినార్, కాకతీయ తోరణం ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తూ, తెలంగాణ అస్తిత్వంతో ఆటలాడితే తీవ్ర ప్రతి చర్య ఉంటుందని దిలీప్ ఎక్స్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేశా డు. మే 23 ఉదయం సుమారు పది గంటలకు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు కొత్త లోగో ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదని ఒక వివరణ పంపించారు. ఈ సంభాషణ జరిగినప్పుడు నేను తన పక్కనే ఉన్నాను. దిలీప్ వారికి థాంక్స్ చెప్పి, తన సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల ను డిలీట్ చేశాడు.
సాయంత్రానికి రేవంత్ సర్కార్ దిలీప్ మీద, మరో మిత్రుడు హరీశ్‌రెడ్డి మీద ఈ లోగోను వీళ్లిద్దరే తయారుచేశారని హాస్యాస్పదమైన ఆరోపణ చేస్తూ ఒక తప్పుడు కేసు పెట్టింది. మే 22 నాడు ఉదయం నుంచి అన్ని మీడియా సంస్థల్లో వచ్చిన లోగోను దిలీప్ పోస్టు చేస్తే, ముందుగా ప్రచురించిన వారినెవరినీ ఏమీ అనకుండా మే 22 నాడు రాత్రి పోస్టు చేసిన దిలీప్ మీద కేసు పెట్టడం స్పష్టంగా కుట్రపూరితంగా జరిగింది. ఫిర్యాదు వచ్చిన కొద్దిసేపట్లోనే కనీస ఇన్వెస్టిగేషన్ లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం, కేసు ఎఫ్ఐఆర్ ఎవరికీ చేరకముందే వింతగా ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి (సీఎం పీఆర్ఓ) పుత్రరత్నం ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ కావడంతో, ఇది రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పెట్టించిన కక్షసాధింపు కేసు అని మాకు అర్థమైంది. గురువారం సాయంత్రం కేసు పెట్టి, శుక్రవారం సాయంత్రం ఊహించినట్టే ఆరుగురు మఫ్టీ పోలీసులు మా ఇంటిమీదికి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసుల ఈ ఎత్తుగడ గురించి తరచూ వినేవాళ్లం. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేస్తే శని, ఆదివారాలు కోర్టులు ఉండవు కనుక రెండు రోజులు సదరు వ్యక్తిని తమ కస్టడీలో ఉంచుకోవచ్చనే అతి తెలివి ఎత్తుగడను మళ్లీ చౌపట్ రాజా వారి పాలనలో మొదలుపెట్టారన్నమాట పోలీసులు.
పోలీసులు వచ్చిన సమయానికి దిలీప్ ఇంట్లో లేకపోవడంతో మేము ఉండే అపార్ట్మెంటు సెక్యూరిటీ వారిని బెదిరించి సీసీ టీవీ ఫుటేజీ ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఆ ఫుటేజీలో మా కారు డ్రైవర్‌ను గుర్తించి, తన ఇంటి మీదికి పోయి ఒక రోజంతా ఏ కారణం చూపకుండానే ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచారు. చివరికి లాయర్‌ను పంపితే కానీ పోలీసులు ఆయనను వదలలేదు. ఈ అక్రమ కేసు ఉద్దేశం దిలీప్‌ను అరెస్టు చేసి వేధించడమే అని మిత్రులు కొందరు చెప్పారు. అందువల్లనే లాయర్ సలహా తీసుకొని ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాం. ఈ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్లో చేసిన తప్పుడు ఆరోపణలే మరోసారి వల్లెవేశారు. టీఎస్ఆర్టీసీ నకిలీ లోగోను దిలీపే తయారు చేశాడట! ఆయన్ని అర్జెంటుగా అరెస్టు చేయకపోతే సాక్ష్యాలను (ఏమిటో ఆ సాక్ష్యాలు?) తారుమారు చేస్తాడట.
పోలీసులు దిలీప్‌ను అరెస్ట్ చేయడానికి ఇంటిమీదికి రావడం, మా చెల్లెలి ఇంట్లో సోదాలు, పత్రికల్లో, సోషల్ మీడియాలోనూ చూసిన న్యూస్ వల్ల తనకొచ్చిన అవగాహన మేరకు, నా పద్నాలుగేండ్ల కొడుకు అడిగాడు ‘అమ్మా! ఇంత క్లియర్‌గా తెలుస్తుంది కదా, నాన్నేమీ తప్పు చేయలేదని. మరి తప్పుడు కేసు పెట్టినవాళ్లు, మనింటికి వచ్చిన పోలీసులు కేసు క్లియరయ్యాక నాన్నకు సారీ చెప్తారా?’ అని. పది రోజుల నుంచి మేమంతా కోల్పోయిన మానసిక ప్రశాంతతకు, నా కొడుకు ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కటి మాత్రం స్పష్టం. దిలీప్ ఏ తప్పూ చేయలేదు. కేవలం తనను వేధించాలన్న దుర్బుద్ధితో రేవంత్ సర్కార్ పెట్టిన ఈ అక్రమ కేసును కోర్టు ద్వారా పోరాడి న్యాయం పొందగలమనే విశ్వాసం మాకున్నది. అక్రమ కేసుల ద్వారా దిలీప్‌ను నిలువరించాలని ప్రయత్నించడం వృథా ప్రయాసేనని ఆయన సహచరిగా గట్టిగా చెప్పగలను.
నిన్న హైకోర్టులో దిలీప్ బెయిల్ పిటిషన్ వేశాం. త్వరలోనే ఈ కేసులో తనకు ఊరట లభిస్తుందన్న నమ్ముతు న్నా. ఈ సమయంలో అండగా నిలిచిన మిత్రులకు, బీఆర్ఎస్ కుటుంబానికి, తెలంగాణ ఆత్మబంధువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా… జై తెలంగాణ.
(వ్యాసకర్త: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ సహచరి)
– స్వర్ణ కిలారి