ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 24 : ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల వినోభానగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో వందలాది మంది పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం కూల్చేసింది. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొందరు ముఖ్యనేతలను వెంట బెట్టుకుని బాధితుల పరామర్శకు బయలుదేరారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టగానే గల్లీల్లో మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో రయ్ రయ్‌మంటూ వచ్చి గట్టయ్యసెంటర్‌లో అడ్డగించారు. ఎక్కడికి వెళ్తున్నారు..? ఎందుకు వెళ్తున్నారు..? అని మాటమాత్రమైనా అడగకుండానే అరెస్ట్ చేసి ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యలకు తీవ్రంగా మండిపడిన గులాబీ నేతలు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు.
దాదాపు రెండున్నర గంటలపాటు ఆందోళన చేశారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్.. జై తెలంగాణ’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి నియంతృత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్లను కూల్చడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీలేదన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కూల్చివేతలు, మూసీ దగ్గర గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం అని చెప్పి పేద, మధ్యతరగతి వర్గాల ఇండ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, అర్హులైన పేదలందరికీ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్బంధించిన వారిలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు, తోట రామారావు, దండా జ్యోతిరెడ్డి, ఎండీ మక్బుల్, కూరాకుల వలరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బత్తుల మురళి, ఎండీ తాజుద్దీన్, అజ్మీరా వీరూనాయక్, బెల్లం వేణుగోపాల్, నాయకులు పాల్గొన్నారు.