మన ముంగిట్లో మన చెట్టు
మనింట్లో మన అమ్మ
ఆ తర్వాతే ఎవరైనా…
తోవకు తంగేడు పూలెట్లనో
భాగ్యనగరానికి చార్మినారెట్లనో
సచివాలయం ముందల తెలంగాణ తల్లి!
అమ్మ నాయన యాదిలో
బిడ్డలకు అవ్వయ్య పేర్లే పెడుతం
ఊరులవున్న పేర్లన్నీ పెడుతమా?
మనింటికి మన అమ్మనాయినలే వెలుగు దివ్వెలు
ఉనికికి
ఎడంచేతి పనులు
ఎటమటం వ్యవహారాలు
తోటలో పావురాలు ఎన్నో
వాటి పాత్రలు వాటివే… గౌరవించాల్సిందే!
మన దర్వాజకు మన కాకతీయ తోరణం!
అరవై ఏండ్ల స్వేచ్ఛకై మట్టి పిడికిలెత్తింది
సబ్బండ వర్గాలు మానవహారాలైండ్రు
సకల జనుల దుఃఖం సాగరహారమైంది
జమ్మిచెట్టున పాలపిట్టలా
గెలిచి నిలిచిన వాకిట్ల తల్లి విగ్రహం ఉండాలి
మన కడపకు మన బొట్టె అందం
మహోద్యమం ఉప్పెనలై ఉరికిన నేలన
పాటపాడితే పొలంల నారు వడాలి
రాస్తే శిలకు ప్రాణం రావాలి
కాలువతీస్తే చెరువు శిఖం మురవాలి
మన వాకిట్ల మన మందారం పరిమళించాలి
మన గనుమల మన తల్లి సూర్యబింబం
అవినీతిని నిర్మూలించి
న్యాయానికి వారధై నిలువు
ఆకలిని వెంటాడి వేటాడి
పదిమంది కడుపునింపు
చరిత్రను నిర్మించు
మహనీయులను గౌరవించు
రాయబడని వెలుగుల్ని లిఖించు
అవకాశం కోసం
ఆశయాలకు పిండాలు
అధిష్ఠానం మెప్పుకై
మతిలేని పాకులాటలు
వెలుగు కుర్చీమీదుండి
చీకట్లకు తోసెయ్యడం ప్రజాస్వామ్యమా?
రత్నాన్ని తీసి రాయిని పాతాలె
చెరువును పూడ్చి బోరింగ్ ఏయాలె
మార్పంటే ఆనవాళ్లను చెరిపేయడమా?
యాపకు రంగేస్తే
మామిడి అవుతుందా?
పేరును మార్చితే
దొంగ దేశభక్తుడవుతాడా?
పేరును మార్చినోడు
ఊర్లను మార్చుతడు
జిల్లాలను కూడా…
మార్చుతడు
పేర్లు, తావులను
యాది మర్సెటట్లు
ఉమ్మడి కుట్రలకు
సలువచేస్తున్నడు
నీ వెలుగు కోసం
చీకట్ల ఉండాలా?
మహనీయులే లేనట్లు
అమరులే గొడ్డుపోయినట్లు
చంద్రవంకల జాడలే లేనట్లు
పరిపాలన గుండె
ఎదుట పరాయి విగ్రహం
అనాలోచిత చర్యలకు ప్రతిరూపం
తెలంగాణ అస్తిత్వ
గౌరవానికి సమాధి
తెలంగాణ తల్లికి కిరీటం
బంగారు కిరీటమని
చేతిలో మక్కజొన్న కంకికాదు
బంగారు కంకని
పట్టుచీర కట్టడానికి
అంత ధనవంతురాలా? అని
దొరల తల్లని… గడీల తల్లని?
తెలంగాణతల్లే కాదని ఎద్దేవా చేసి
ఎదలను చించుకున్నోళ్లంతా
ఎవరి సంకల్లో సేదతీరిండ్రు
ఏ చెట్టు నీడన ఉయ్యాలలూగుతూ
ఎవరి బూట్లకు లేసులు తొడుగుతున్నరు
వినండి! మిత్రులారా!మాట్లాడుదాం!!
తెలంగాణ తల్లికి అస్తిత్వ అక్షరమై సాగుదాం!!
(సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలని కోరుతూ…)
వనపట్ల సుబ్బయ్య
94927 65358