నెర్రెలుబారిన నేలలు, ఎండిన చెరువులు, వర్షాధారపు పంటలు, ముంబయి, దుబాయి, మస్కట్ వలసలు, పాలమూరు కూలీల గోసలు, కరెంటు కోతలు, నేతన్నల ఆకలి చావులు, అన్నదాతల ఆత్మహత్యలు.. ఇది తొమ్మిదేండ్ల కిందట వరకు తెలంగాణ ముఖచిత్రం. కానీ దార్శనికుడు, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా తెలంగాణ స్వరూపమే మారిపోయింది. ఎక్కడచూసినా పచ్చని పంట పొలాలు, నీళ్లతో నిండుగా చెరువులు, యువతకు ఉపాధి లభిస్తున్నది. 24 గంటల కరెంటు, చేనేతలకు చేయూత, రైతు బంధు, పరిశ్రమలకు పెట్టుబడుల వెల్లువతో తెలంగాణలో కొత్త శకం ప్రారంభమైంది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో విధ్వంసమైన తెలంగాణను సీఎం కేసీఆర్ సోషల్ ఇంజనీర్ అవతారమెత్తి పునర్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నదీ జలాల్లో మన వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, వ్యవసాయాన్ని పండుగలా చేయడం, కొత్త కలెక్టరేట్లు, కొత్త సెక్రటేరియట్, చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించడం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ‘ఆసరా’గా నిలవడం, రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతు ఏ కారణంతో చనిపోయినా రైతుబీమా ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలవడం, కుల వృత్తులకు చేయూతనివ్వడం, దళితులను వ్యాపారాల్లో ప్రోత్సహించి వారిలో ఆత్మగౌరవం పెంపొందించడం, ఆడబిడ్డల పెండ్లి ఖర్చులకు సాయం, వందల సంఖ్యలో ఉన్న గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందివ్వడం, 26 మెడికల్ కాలేజీలను ప్రారంభించి రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం, నియోజకవర్గానికో 100 పడకల దవాఖానతో ప్రజలకు వైద్యం అందేలా చూడటం, మిషన్ భగీరీథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వడం, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో మన భాషే ప్రామాణికం అయ్యేలా చేయడం, అన్నింటికీ మించి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం తెలంగాణ పునర్ నిర్మాణ లక్ష్యాల్లో భాగమే. ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలుచేస్తూనే.. మౌలిక వసతుల కల్పనపైనా సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతోపాటు ఉమ్మడి ఏపీలో నిర్మించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన చిన్నా, పెద్ద ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం రెండింతలైంది. ఇవాళ దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.
హైదరాబాద్ మహా నగరానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడంతోపాటు మెట్రో రైలు నిర్మాణం, విస్తరణ, ట్రాఫిక్ కంట్రోల్ కోసం భారీ ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ లాంటి మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అజరామరం. ఐటీ ఎగుమతులు పెరగడానికి, ప్రజల తలసరి ఆదాయం ఏడాదికి రూ.3.5 లక్షలకు ఎగబాకడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే కారణం. తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2022-23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగింది. వివిధ రిపోర్టుల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటు 8.6 శాతంగా నమోదైంది.
ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ర్టాలు కొత్తగా ఏర్పడి 23 ఏండ్లు గడుస్తున్నా ఇంకా బాలారిష్టాలను దాటలేదు. కానీ రాష్ట్ర సాధన కోసం ముందుండి నడిచిన నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తొమ్మిదేండ్లలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అయినా కాంగ్రెస్, బీజేపీ నేతలు కాళేశ్వరం నీళ్ల విషయంలో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతున్నారు. కోటి ఎకరాల మాగాణిని తడుపుతున్న నీళ్లను చూడకుండా.. కరెంటు బిల్లుల పేరిట నానా యాగీ చేస్తున్నారు. రైతుబంధు, దళితబంధుపై దుష్ప్రచారం చేస్తున్నారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీ కుల వృత్తులకు చేయూత లాంటి అనేక పథకాలు అర్హులకు పూర్తిస్థాయిలో అందాలన్నా, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి రావాలి. తెలంగాణకు కేసీఆరే నాయకత్వం వహించాలి. పదేండ్లుగా అప్రతిహతంగా సాగుతున్న అభివృద్ధి ఆగొద్దంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: రిటైర్డ్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం)
-సీహెచ్ దినేష్ కుమార్
98490 50305