దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కలవడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాలు, ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు కూడా వారు విముఖత చూపుతున్నారు. కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తరచు ప్రధానిని కలవడంతోపాటు నీతిఆయోగ్ సమావేశాల్లో మోదీ విధానాలను ప్రశంసిస్తూ సొంత పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు.
మమతాబెనర్జీ, స్టాలిన్, విజయన్, సిద్ధరామయ్య, భగవంత్‌సింగ్ మాన్, హేమంత్ సోరెన్ తదితరులు నిత్యం మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలను వ్యతిరేకిస్తున్నారు. తమ రాష్ర్టాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా మోదీ సర్కారు తప్పుడు విధానాలు, నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. సీఏఏ, ఎన్ఆర్సీలపై మమతాబెనర్జీ.. కేంద్రం ఫెడరలిజాన్ని విస్మరించడంపై విజయన్.. రాష్ర్టాల నిధుల కోసం హేమంత్ సోరేన్ చేస్తున్న పోరాటాలను మనం చూస్తునే ఉన్నాం. కానీ, కాంగ్రెస్ సీఎం రేవంత్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నది.
ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన రేవంత్‌రెడ్డి బీజేపీ విధానాలను ప్రశంసించారు. వికసిత్ భారత్-2047ను సమర్థిస్తూ, తెలంగాణ రైజింగ్-2047 అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి, ఆపరేషన్ సిందూర్‌ను మోదీ ఉన్నపళంగా, ఏకపక్షంగా నిలిపివేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే.. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని మోదీని రేవంత్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఓవైపు రాష్ర్టాలకు 50 శాతం పన్ను వాటా ఇవ్వాల్సిందేనని పక్క రాష్ట్ర సీఎం స్టాలిన్ డిమాండ్ చేయగా, రేవంత్ మాత్రం రాష్ర్టాల హక్కులు గురించి ప్రస్తావించలేదు.
మరోవైపు బీజేపీ నేతలు కూడా చోటే భాయ్‌తో అంటకాగుతున్నారు. అమృత్ పథకం టెండర్లను రేవంత్ తన బావమరిదికి కట్టబెట్టినట్టు ఆరోపణలు వచ్చినా, నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరున్నా బీజేపీ నేతలు విమర్శలు కాదు కదా, కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. బడే భాయ్-చోటే భాయ్ బంధమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
– శ్రీను నాయక్ దోన్ వాన్ 85220 18001
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, ఓయూ)