కేసీఆర్ను గద్దె దించడమే మా లక్ష్యం.. కేసీఆర్ను ఓడిస్తామంటూ కేసీఆర్ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు కొందరు రాజకీయ నేతలు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం అధికార ఆరాటమే తప్ప ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడం గానీ, వారి కోసం ఆలోచన చేయటం లేదు. అంతా ఒక గుంపుగా చేరి కేసీఆర్ మీద విద్వేషంతో రగిలిపోతున్నారు. ఆ విద్వేషం ఆ నాయకులకే మంచిది కాదు. కేసీఆర్ను ఓడించడమంటే.. ప్రజలను ఓడించడమనే వాస్తవాన్ని మరిచిపోతున్నారు.
ప్రజలకు ఏదైనా చేయాలంటే వారి ఆకాంక్షలను పసిగట్టి వారి ఉన్నతికి కృషి చేయ గలగాలి. కానీ ఏదీ చేయకుండా, అధికార దాహంతో కేసీఆర్ మీద విద్వేషాన్ని నింపుకుంటే.. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ మీద వ్యక్తిగతంగా అక్కసును వెళ్లగక్కుతున్నా రు. ధనంతో రాజకీయాల్లో గెలుస్తామనుకోవడం భ్రమే అవుతుంది. డబ్బు ఉంటేనో… కేసీఆర్ను విమర్శిస్తేనో.. ప్రజలు తమను ఆదరిస్తారనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్కు ప్రజలను ప్రేమించడం తెలుసు.. వారి ఆకాంక్షలు, ఆవేదనలు, ఎతలు తెలుసు కాబట్టి సబ్బండ వర్గాలు ఆయనతో కలిసి నడుస్తున్నాయి. ఏ ఎన్నికలైనా ప్రజలు కేసీఆర్ పక్షమే నిలబడుతున్నారు.
ఇటీవల కొందరు కాంగ్రెస్లో చేరా రు. అయితే వారి ముఖాల్లో ఆందం కంటే…విద్వేషమే కన్పించింది. కాలుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలనట్టు… విద్వేషంతో రగిలిపోయే వారి వెంట నడవడానికి కూడా ఎవరూ ఇష్టపడరనే సంగతి వారికి తెలవనట్టుగా ఉన్నది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజ ల అభిమానాన్ని పొందాలే తప్ప.. విద్వేషాలతో గెలవలేరు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ విద్వేషాలు రెచ్చగొట్టలేదు. గాంధే య మార్గంలో శాంతియుతంగా ఆయన ఉద్యమాన్ని నడిపి ప్రజల ఆశీస్సులతో పాటు ఢిల్లీ స్థాయి నేతలను ఒప్పించడం వల్ల తెలంగాణ సాధ్యమైంది.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఆనాడు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తే… నేడు యువతను అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకొంటున్నది. ఏ ఒక్క ఉద్యమకారునికి కాంగ్రెస్ పార్టీ లో గుర్తింపు ఇచ్చిన సందర్భం లేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీ… యువ సంఘర్షణ పేరుతో యువతను డైవర్షన్ చేయాలని చూస్తున్నది. అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో యువత లేరు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం.. కేసీఆర్ నాయకత్వంలో ఎంతో మంది మేధావులు, సబ్బండ వర్గాల చైతన్యంతో కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం చావు అంచుల దాకా వెళ్లిన కేసీఆర్ త్యాగాన్ని గుర్తించి ఆనాడు.. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు…తెలంగాణలోని విద్యార్థి లోకమంతా ఏకమై కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచింది. తాము కేంద్రం లో అధికారంలోకి వస్తే తెలంగాణ ఆకాంక్షను సాకారం చేస్తామని 2004లో కరీంనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియాగాం ధీ హామీ ఇచ్చారు. అప్పటికే తెలంగాణలో కేసీఆర్ శక్తిని గుర్తించి టీఆర్ఎస్తో జతకట్టి ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ కాంగ్రె స్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
తెలంగాణ ఆకాంక్షను సాకారం చేస్తామన్న హస్తం నాయకత్వం జా ప్యం చేయడాన్ని నిరసిస్తూ.. కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రి పదవికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణకు సానుకూలం అంటూనే సాగదీత, జాప్యం చేయడం వల్ల నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వనరులు, ఉద్యోగాలు, సంపద సమైక్యపాలకులు కొల్లగొట్టుకుపోయారు. అటెండర్లు తప్ప.. అధికారులుగా తెలంగాణ బిడ్డలు ఎక్కడా ఏఆఫీసుల్లో లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఎంతో వివక్షను తెలంగాణ ప్రజల మీద ప్రదర్శించారు.
తెలంగాణ ఆకాంక్ష కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి లోకం ఉద్యమ జెండా ఎత్తుకొని గ్రామగ్రామాన ప్రజలను చైతన్యవంతులను చేశారు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయా ల కోసం తెలంగాణ ఏర్పాటును నిర్లక్ష్యం చేయ డం వల్ల వేల సంఖ్యలో తెలంగాణ ఉద్యమ బిడ్డలు బలిదానాలు చేసుకున్నారు. ఆ బలిదానాలకు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కారణం కాదా..? రాజకీయ అధికారం తప్ప… ఏనాడు విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన సందర్భమే లేదు. నేడు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఉద్యమసారథి కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం చర్యలు చేపడుతున్నారు. ఉద్యమ విద్యార్థి నాయకులను సముచిత స్థానాల్లో గౌరవించి వారికి ఎమ్మెల్యే, ఎంపీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా అతి సామాన్యులైనవారికి అవకాశాలు కల్పించిన ఘనత ఉద్యమ నాయకునిది.
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానా ల్లో ఒక్క స్థానంలోనైనా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులకు అవకాశాలు ఇచ్చిన సందర్భాలు లేవు. రాష్ట్ర విభజనలోని అడ్డంకులు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ…తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలమైన అభివృద్ధికి పునాదులు పడుతున్న వేళ అవకాశ వాద రాజకీయ ట్రాప్లో పడకండి. తెలంగాణ సాధించిన పార్టీ, బంగారు తెలంగాణ కోసం… భవిష్యత్తు తరాలకు ఓ గొప్ప మార్గాన్ని నిర్దేశిస్తున్న కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి … అవకాశ వాద రాజకీయాలను తిప్పికొట్టడానికి విద్యార్థి, యువలోకం రాజకీయ కుట్రలను పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-సంపత్ గడ్డం
78933 03516