Telangana | మన తెలంగాణది ఏకీ రాస్తా. పదేండ్ల ప్రయాణంలో తూర్పు ముఖంగా వెలుగులను ఆస్వాదిస్తూ కలిసి నడిచిన ప్రజా రాశులు వెనుదిరగనే తిరగవు. నోటిఫికేషన్ కోసం ముసలి రాజకీయ మొసలి లాంటి కాంగ్రెస్, బీజేపీలు నోరు తెరుచుకొని ఎదురుచూస్తుండవచ్చును. ఎన్నికల గోదాట్లో దారితప్పిన ఓటర్ల కాళ్లు పట్టుకొని మింగేయ్యాలనే ఉబలాటంతో ఊగిపోతుండనూవచ్చును. కానీ, తెలంగాణ తన తీర్పును ఏనాడో రాసిపెట్టుకొని, సద్దిమూటలా దాచిపెట్టుకొనే ఉన్నది. పదేండ్ల రాష్ట్రం అలుపెరుగకుండా పరుగులు పెట్టింది, జనజీవితమే తెలంగాణమై వర్ధిల్లింది నక్కల పాలవ్వడానికి కానే కాదు కదా?
ఇక ఒడిసింది, ముగిసింది, దింపేస్తున్నాం, ఎక్కేస్తున్నామంటూ కాంగ్రెస్, బీజేపీల నేతలు గుక్కపట్టిన చంటోళ్ల మాదిరిగా ఒక్కటేతీరున గగ్గోలు పెడుతుంటే, జనాలు నవ్వుకుంటున్నారు. ఎవరిని దింపేది? ఎవరు కేసీఆర్?బీఆర్ఎస్కు పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి పదవిలోని నేతగా మాత్రమే కూడా చూడటం లేదు. సకలజనులు తమ కుటుంబాలకు పెద్దాయనగా ఆరాధిస్తున్నారు. అలాంటి జన నేతను దింపేస్తామని నవ్వుల నారదులు నమ్మితే ఎవరేం చేయగలరు? ఇప్పటికే కాలుజారితే పడే అగాధం గురించి తెలంగాణ స్పష్టమైన అంచనాతోనే ఉన్నది. ఇటీవలి కాలంలో తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పెద్దలు వాగుతున్న తీరు కూడా జనాలకు ఆ పార్టీలపై ఏహ్యభావాన్ని ఎక్కువ చేసేసింది. అర్థంలేని మాటలు, ఆచరణకు ఆస్కారం లేని ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ దిగజారి బజారున పడింది.
ఇదేమైనా రేడియో కాలమా? వినపడిందే సత్యమని నమ్మి, ఊపుతూ తల తాకట్టు పెట్టుకునే పాత కాలంలో ప్రజలున్నారా? ప్రతి పార్టీ పుట్టలో వేలు కాదు కండ్లు పెట్టి, కూపీ లాగేస్తున్నారు. అందుకే ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదనే నిజంతో పాటు, హస్తం పార్టీది ఎప్పటికీ పాపాల నైజమేననే సంగతి తేటతెల్లమైంది. పక్కన కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించి, అధికార పీఠమెక్కగానే ప్రజలకు ఖాళీచేతులు చూపుతున్న సత్యాలను సామాన్య ప్రజలే సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. కన్నడనాట ఆర్భాటపు హామీలిచ్చిన కాంగ్రెస్, నేడక్కడ వృద్ధాప్య పింఛన్‌ను కేవలం రూ.600 ఇస్తూ, దానికీ ఏడాదికి 20 వేల లోపు ఆదాయ పరిమితి నిబంధన పెట్టిన అన్యాయాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. పక్క రాష్ట్రంలో వృద్ధుల విషయంలోనే పండ్లు ఇగిలిస్తూ, తెలంగాణలో ప్రతి మహిళకు నెలనెలా రూ.2,500 ఇస్తామంటే నమ్మడానికి మన రాష్ట్రంలో వెర్రిబాగులోల్లెవ్వరూ లేరు కదా? కరెంటు, రైతులు అంటూ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అటకెక్కించిన హస్తం పార్టీ ‘స్కాంగ్రెస్’ బ్రాండ్‌ను తిరిగి కర్ణాటకలో ఎలా చేజిక్కించుకుంటున్నదో బట్టబయలవుతూనే ఉన్నది.
అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ర్టాల్లో చీకటి పంచుతూ, కుంభకోణాలను పెంచుతూ, తెలంగాణలో లేస్తే మనిషినే కానన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పలుకుతున్న ప్రగల్భాలు హాస్యాస్పదంగా మారిపోయాయి. ఇక కమలం పార్టీ కూడా కథలల్లుతూ, అబద్ధాలు, అడ్డగోలు వాగుడును నమ్ముకొని ‘ఎక్కువ పొంగిన పాలు ఎన్నటికైనా పొయ్యి పాలే..’ అన్నట్టుగా పట్లు పట్టకముందే నేలకరిచింది. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారనే నీచమైన మాట దగ్గర నుంచి లక్షల కోట్ల సహాయం అందించామనే అబద్ధాల దాకా కాషాయ పార్టీ పెద్దల ప్రసంగాలు ప్రజలందరి మనసులను గాయపరిచాయి. తవ్వకాలు, తన్నులాటలు తప్ప, గుడి, మసీదుల మధ్య గొడవలు తప్ప మరే గోడు పట్టని దివాళాకోరు రాజకీయం కలలో కూడా తెలంగాణ కోరుకోదు. గ్రాంట్ల విషయంలో మోదీ మొత్తుకొని చెప్తున్నదంతా ఉత్తదేనని కాగ్ నివేదికనే కడిగి పారేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర సర్కార్ నుంచి తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ రూపంలో దాదాపు రూ.41 వేల కోట్లకు పైగా రావాల్సి ఉండగా, మోదీ ప్రభుత్వం విడుదల చేసింది రూ.13 వేల కోట్లు మాత్రమే. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా తొమ్మిదేండ్లుగా నమ్మితిరా సిద్ధా అంటే తన్నితిరా సిద్ధా అన్న రీతిలోనే కమల సర్కార్ చేష్టలున్నాయి. గుజరాత్‌కు నిధులు, అదానీకి గనులు, తెలంగాణకు మాత్రం గుండు సున్నాలే మోదీ సర్కార్ ఒరగబెట్టింది.
పైగా ఫంక్షన్‌హాల్‌కు ఎక్కువ, మైదానానికి తక్కువస్థలాల్లో సభలు పెట్టి మోదీ, గాంధీలు ప్రసంగాలు ఊదరగొడుతుంటే, తెలంగాణ సమాజం నవ్వాపుకోలేకపోతున్నది. కమలం కోటకు రాళ్లెత్తిన అద్వానీ లాంటి ఎందరినో ఆగం జేసిన మోదీ పరివారం తెలంగాణ అమరవీరుల గురించి, గాంధీ కుటుంబం అంతా వేదికపై నిలబడి కుటుంబ పాలనపై మాట్లాడుతుంటే చెప్పేవాడికి వినేవారు లోకువనే నానుడి నగ్నంగా నిలబడి దర్శనమిస్తున్నది.
ప్రధాని స్థానంలో ఉండి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభల్లో నరేంద్ర మోదీ మాట్లాడిన తీరు ఎంత జుగుప్సాకరంగా ఉన్నదో తెలంగాణ పౌరులందరూ స్వయంగా గమనించారు. సకల రంగాల్లో తెలంగాణను శిఖర సమానంగా నిలబెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డి శ్రమించిన కేసీఆర్ మీద ఢిల్లీ ముఠా పొలిటికల్ దండుపాళ్యంలా దాడికి దిగడం విడ్డూరంగా ఉన్నది.
కాళేశ్వరం నిర్మించి 75 లక్షలకుపైగా మాగాణానికి సాగునీరు పారించినా, వలసపక్షిలా మారి విలపించిన పాలమూరు జిల్లాలో 2 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నా నిందలేస్తే నమ్మేదెవ్వరు? మిషన్ కాకతీయ, రైతుబంధు, బీమా పొలాల్లో పంటగా పెరిగి, దేశంలోనే అతి ఎక్కువ ధాన్యం పండే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగినా విషమే చిమ్మితే దగ్గరికి రానిచ్చేదెవ్వరూ? సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో సాటిరాగల రాష్ట్రం ఏముందని, ఐటీ, పారిశ్రామిక ప్రగతి పరుగులో దాటిపోయే రాష్ట్రం ఎక్కడుందనీ? రిజర్వ్ బ్యాంక్ హ్యాండ్ బుక్‌లో, ప్రజల గుండెల్లో కేసీఆర్ సాధించిన సత్యాలను ఎవరైనా చెరిపివేయడం సాధ్యమయ్యే పనేనా?
కానీ, ఎన్నికల మాసంలో జాతీయపార్టీల నేతల వ్యవహారశైలి మాత్రం తెలంగాణ ఎల్లకాలం గుర్తుపెట్టుకోవాల్సిందే. పాతాళంలో పడ్డ హస్తం, కమలం పార్టీలను తమిళనాడు జనం ఎలా ఎల్లకాలం పైకిలేవకుండా శవశోభలో పడుకోబెట్టారో, అలాగే మన రాష్ట్రంలో కూడా కాళోజీ చెప్పినట్టుగా కాలంబు రాగానే కాటేసి తీరాలే. మన దేశం, రాష్ట్రం చరిత్ర పరిణామ క్రమంలో ఎందరో మహామహులైన జాతీయ నేతలను చూసింది, ఆరాధించింది కూడా. కానీ, మారీచుడిలా మారిన ప్రధానిని, పగతో రగులుతున్న విపక్షమైన కాంగ్రెస్ నేతలను తెలంగాణ ఆదమరిచైనా తలకెత్తుకుంటుందా? మన తెలంగాణ మళ్లీ, మళ్లీ తూర్పు దిక్కుకే నడుస్తుంది. అసలు సీఎం పీఠం మీద కారణజన్ముడు కేసీఆర్‌ను తప్ప తెలంగాణ కలలో కూడా ఎవ్వరినైనా తలంపుకు తెచ్చుకుంటుందా? నవంబర్ 30న బారులు తీరి తెలంగాణ గులాబీ జెండానే రెపరెపలాడించబోతున్నది. ఇది తెలంగాణకు మరో మలుపు, దేశాన్ని మేల్కొలిపే మహా పోరును ఈ గెలుపుతోనే తెలంగాణ దీవించనున్నది. జై తెలంగాణ.., జైజై తెలంగాణ.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242