శ్రీరాముని పాలనలో కరువు ఊసే ఉండేది కాదట.. వర్షాలు సరైన సమయంలో పడేవట.. పంటలు బాగా పండి రాజ్యం సస్య శ్యామలంగా ఉండేదట.. ‘అట.. అట’ అని ఎందుకు అంటున్నానంటే మన కండ్లతో చూడలేదు కదా. కానీ, అంత గొప్పగా చెప్పుకొనే రామ రాజ్యాన్ని నేను కండ్ల నిండా నా స్వరాష్ట్రంలో చూస్తున్న. నా తెలంగాణ గడ్డ మీద చూస్తున్న. అవును! బల్ల గుద్ది, గుండెల నిండా ఆనందంతో చెప్తున్న.
మా పొలం పక్కన పారీపారని వరద కాల్వకు తెలుసు నాడు మా భూమి ఎంత గోసవడ్డదో! మా పొలం గట్టుకాడ ఎండిపోయిన చెట్టుకు తెలుసు నీళ్లకు ఎంత తండ్లాట ఉండెనో! ఇప్పుడా వరద కాల్వ నిండుగ పారుతున్నది, ఇప్పుడా చెట్టు పచ్చగా కళకళలాడుతున్నది. కొన్నేండ్ల కిందట మా ఊరిలో చెరువు ఎక్కడ ఉండెనో కూడా నాకు తెల్వదు. ఇప్పుడు రెండు చెరువులున్నయ్.. నిండా నీళ్లున్నయ్! మా ఇంటి పక్కాయన గొర్లు, మేకలు కాస్తుంటడు. నా చిన్నప్పుడు ఆయన దగ్గర పదికి మించి చూసింది లేదు. ఇప్పుడు 40-50 మేకలు, గొర్రెలను కాస్తుండు. ఇది ఒక్క మా ఊరి కథే! నా కండ్ల ముందు కనిపిస్తున్న తెలంగాణ కథే!!
శ్రీరాముడు తీసుకొనే నిర్ణయాలన్నీ ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకొనే ఉండేవట.. అచ్చం తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి నిర్ణయాలే ఉన్నయ్. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, దళితబంధు, కంటివెలుగు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం.. ఇలా బోలెడు అభివృద్ధి, సంక్షేమ పథకాలున్నయ్. శ్రీరాముడి రాజ్యంలో సమన్యాయం ఉండేదట. అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం దక్కుతున్నది ఒక్క తెలంగాణలోనే అని గర్వంగా చెప్పవచ్చు.
దీనులు, హీనులు, అనాథలు, అన్నార్తులు, వృద్ధుల యోగక్షేమాలు చూసే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే.. అది బీఆర్ఎస్ సర్కారే. రాజ్యం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండేలా శ్రీరాముడు రాజ్యపాలన చేశాడట.. నేటి తెలంగాణలో ఆరోగ్యం బాగుండేలా ఆస్పత్రులు వెలుస్తున్నయ్. కులవృత్తులకు సహకారం, చేతివృత్తులకు చేదోడు దొరుకుతున్నది. ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణే ప్రధాన ధ్యేయంగా, వారికి అత్యున్నత గౌరవాన్ని అందించిన నిజమైన నాయకుడు శ్రీరాముడు. షీటీమ్స్‌తో రక్షణ, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, వీహబ్ వంటి పథకాలు, కార్యక్రమాలతో పాలన సాగిస్తున్న మరో నిజమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.
బుద్ధికుశలత, ఆలోచన శక్తి ఉన్న మంత్రివర్గాన్నే శ్రీరాముడు నియమించుకున్నారట.. అలాంటి ఆలోచనలు కలిగిన మంత్రివర్గమే తెలంగాణలో కొలు వైంది. దేశదేశాలు తిరిగి కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించే ‘తారక’మంత్రం ఉండనే ఉన్నది. అభివృద్ధి, శాంతిభద్రతలకు నాటి అయోధ్య ఆలవాలమట.. అచ్చం నేటి భాగ్యనగరంలా. పండితులు, విద్యావంతులకు శ్రీరాముడు తన సభలో ప్రాతినిధ్యం కల్పించినట్టే.. తెలంగాణలోనూ గోరటి వెంకన్న లాంటి ఉద్యమవీరులకు, విద్యావంతులకు ఉన్నత పదవులు దక్కాయి. అంటే అసలైన రామరాజ్యం.. తెలంగాణ రాష్ట్రం. ఈ రామరాజ్యమే దేశానికి అవసరం.. భారతావనికి బీఆర్ఎస్ అనివార్యం.
